Begin typing your search above and press return to search.

ఏపీపై కేంద్రం వరాల జల్లు మొదలైందా?

By:  Tupaki Desk   |   28 Sep 2015 12:20 PM GMT
ఏపీపై కేంద్రం వరాల జల్లు మొదలైందా?
X
విభజన కారణంగా మొత్తంగా నష్టపోయిన ఏపీకి.. చేయాల్సిన స్థాయిలో కేంద్ర సాయం అందటం లేదన్న ఆక్రోశం ప్రతి ఒక్క సీమాంధ్రుడు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఏపీ అధికారపక్షం కేంద్రం మెడలు వంచి తమకు అవసరమైన ప్రాజెక్టులు తెప్పించుకోవటంలో విఫలమైందన్న విమర్శల్ని మూటగట్టుకుంది. కేంద్రం నుంచి కావాల్సిన ప్రాజెక్టులు తెచ్చుకోవటంలో తడబడిన నేపథ్యంలో బీజేపీ సర్కారుపై సీమాంధ్రుల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

ప్రధాని మోడీ మీద కోటి ఆశలు పెట్టుకున్న సీమాంధ్రులకు నిరాశే దక్కుతోంది. మోడీ ప్రధాని అయితే.. ఏపీకి ఏదో చేసేస్తారన్ననమ్మకాన్ని పెట్టుకున్న సీమాంధ్రులు.. మోడీ అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నాసీమాంధ్రకు చేసిందేమిటని ప్రశ్నిస్తే బీజేపీ నేతలు సైతం నోరు వెళ్లబెట్టే పరిస్థితి.

మరోవైపు.. ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు సరిగ్గా మూడు వారాలు లేని నేపథ్యంలో.. ఏపీపై వరాలు జల్లు కురిపించేందుకు కేంద్రం సిద్ధమవుతుందని చెబుతున్నారు. దీనికి తగ్గట్లే తాజాగా కేంద్రం నుంచి కొన్ని ప్రకటనలు వెలువడటం గమనార్హం. రాజధాని నగరమైన అమరావతి చుట్టూ 185 కిలోమీటర్ల పరిధిలో రింగురోడ్డు నిర్మాణానికి కేంద్రం ఓకే చెప్పేసి.. ప్రకటించింది. దీంతో పాటు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 800 కిలోమీటర్ల మేర రోడ్లను జాతీయ రహదారులుగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది.

ఈ రెండింటిలో ఒకటి రాజధాని నగరం చుట్టూ రింగు రోడ్డు ద్వారా.. ఏపీ రాజధాని విషయంలో కేంద్రం వరాలు కురిపించటం మొదలు పెట్టిందన్న భావన కలగుతోంది. ఇక.. రోడ్లను జాతీయ రహదారులుగా మార్చేందుకు 800 కిమీలకు ఓకే చెప్పేయటం సానుకూలాంశంగా చెప్పొచ్చు. కర్నూలు.. కడప.. అనంతపురం రోడ్లను ఎన్ హెచ్ 40ను ఎన్ హెచ్ 60 కు అనుసంధానం చేస్తారు. దీంతో.. ఇప్పటివరకూ నాలుగు లేన్ల రోడ్లు ఉన్న రహదారులన్నీ ఆరు.. ఎనిమిది లైన్లగా మారనున్నాయి. వీటితో పాటు.. మరిన్ని వరాలు వెనువెంటనే ప్రకటిస్తే తప్పించి.. మోడీ సర్కారుపై ఏపీ ప్రజల్లో నమ్మకం పెరగదని చెప్పొచ్చు.