Begin typing your search above and press return to search.

విశాఖలో మోడీ ఇచ్చిన హామీ కూడా... ?

By:  Tupaki Desk   |   9 Dec 2021 2:30 AM GMT
విశాఖలో మోడీ ఇచ్చిన హామీ కూడా... ?
X
హామీలు నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయా. అధికార స్థాయి ప్రకటనలు కూడా ఏ మాత్రం ప్రయోజనం లేకుండా ఆగిపోతున్నాయా అంటే అవును అనే జవాబు చెప్పుకోవాలేమో. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు, నడుస్తున్న చరిత్ర చెబుతున్న సత్యం ఇదే. 2019 మొదట్లో విశాఖకు ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా వచ్చారు. ఆయన రైల్వే వారి గ్రౌండ్స్ లో ఒక మీటింగ్ పెట్టి మరీ తీయని కబురొకటి మోసుకువచ్చాను అని చెప్పారు. విశాఖ వాసులకు తీరని కోరికగా ఉన్న రైల్వే జోన్ ని సాకారం చేస్తున్నామని ప్రకటించారు.

దాంతో విశాఖలో అంతా సంబరాలు చేసుకున్నారు. ఇప్పటికి సరిగ్గా యాభై ఏళ్ల క్రితం అంటే 1971లో విశాఖకు రైల్వే జోన్ కావాలన్న డిమాండ్ పుట్టింది. అది అలా సాగుతూ వస్తోంది.ఇక పాతికేళ్ల క్రితం అంటే 1996 ప్రాంతంలో కేంద్రం కొత్తగా కొన్ని జోన్లను ప్రకటిస్తున్న వేళ విశాఖకు కూడా ఆశ పుట్టింది. విశాఖకు రైల్వే జోన్ కావాలని నాడు అంతా గట్టిగానే నినదించారు. అయితే అది అలాగే ఉండిపోయింది. నాడు టీడీపీ హయాంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో మంత్రి పదవులు తీసుకున్నారు. అలాగే ఉత్తరాంధ్రా జిల్లాలకే చెందిన ఎర్రన్నాయుడు రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా పనిచేశారు. అయినా రైల్వే జోన్ మాట ఏ మాత్రం వినిపించని పరిస్థితి ఉంది.

ఇక ఆ తరువాత వాజ్ పేయ్ ప్రభుత్వంలో కూడా టీడీపీ కీలకమైన పాత్ర పోషించింది. అపుడు కూడా రైల్వే జోన్ ఆందోళనలు జరిగినా ఎక్కడా అడుగు కూడా ప్రతిపాదన ముందుకు కదలలేదు. ఇక ఏపీ రెండు ముక్కలు అయింది. విభజన ఏపీకి ఇచ్చిన అనేక హామీలలో రైల్వే జోన్ ఒకటి. ఎందుకంటే ఉమ్మడి ఏపీలో ఉన్న జోన్ తెలంగాణాకు వెళ్ళిపోతుంది కాబట్టి. దాంతో తప్పనిసరిగా జోన్ వచ్చి తీరుతుంది అని అంతా ఆశపడ్డారు. అది అలా నిక్కుతూ నీల్గుతూ సాగుతూ పాకుతూ 2019 ఎన్నికలకు కాస్తా ముందు విశాఖకు రైల్వే జోన్ ఇచ్చేస్తున్నామని కేంద్రం ప్రకటించింది.

దాన్ని స్వయంగా విశాఖలో ప్రధాని మోడీ కూడా చెప్పారు. దాంతో ఇక రైల్వే జోన్ ఖాయమనే అనుకున్నారు. అయితే ఆ సంబరం కేవలం మాటల వరకే పరిమితం అయింది. రెండవసారి కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చాక జోన్ ఏర్పాటు కోసం బడ్జెట్ లో కేటాయించింది కేవలం 75 కోట్లు మాత్రమే. ఆ తరువాత రెండవ సారి మరో నలభై కోట్లు కేటాయించారు. కనీసం అయిదు వేల కోట్లు ఉంటే తప్ప విశాఖ రైల్వే జోన్ అన్నది ముందుకు కదలదు, దానికి కావాల్సిన ఇంఫ్రాస్ట్రక్చర్ అన్నది రాదు అని అంతా అనుకుంటున్న వేళ నెమ్మదిగా అయినా ఏదో రోజు జోన్ వచ్చి తీరుతుంది అన్న ఆశ అయితే ఉంది.

కానీ తాజాగా పార్లమెంట్ లో బీజేపీ ఎంపీ అజయ్‌నిషాద్ ప్రశ్నకు కేంద్రమంత్రి అశ్వనీ వైష్ణవ్ సమాధానం చెబుతూ కొత్తగా రైల్వే జోన్లు ఏర్పాటు చేసే ప్రసక్తి లేదని తేల్చేశారు. ప్రస్తుతం ఉన్నవి కేవలం 17 జోన్లు మాత్రమే. వాటికి మించి ఏ ఒక్కటీ ఏర్పాటు చేయబోమని స్పష్టం చేశారు. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తూ ఉంటాయి. కానీ జోన్లు అన్నవి ఇవ్వలేమని కూడా పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తూంటే విశాఖ రైల్వే జోన్ అన్నది ఇక ఎప్పటికీ తీరని ఆశగానే మిగిలి ఉందని చెప్పాలి. మొత్తానికి కేంద్రం ఊరించడమే కాదు, ఏదో చేస్తున్నట్లుగా ఇన్నాళ్ళూ చెప్పి మరీ చివరికి ఇలా చేయడం అంటే అది విశాఖ ప్రారబ్ధమా. ఏపీకి పట్టిన శాపమా. ఏమో ఎన్ని అయినా అనుకోవాలేమో.