Begin typing your search above and press return to search.

జల్లికట్టుపై ఆర్డినెన్స్ ముసాయిదా జారీ

By:  Tupaki Desk   |   21 Jan 2017 4:57 AM GMT
జల్లికట్టుపై ఆర్డినెన్స్ ముసాయిదా జారీ
X
యావత్ తమిళులంతా ఒక్క మాటపై నిలబడి..రాష్ట్రాన్ని స్తంభించిన వేళ.. కేంద్రం రియాక్ట్ అయ్యింది. తమ సంప్రదాయ క్రీడ జల్లికట్టును నిషేధిస్తూ సుప్రీం ఆదేశాలపై తమిళులు మండిపడుతూ.. నాలుగు రోజులుగా మెరీనా బీచ్ తీరంలో నాన్ స్టాప్ ఆందోళనలు చేయటం తెలిసిందే. జల్లికట్టుపై విధించిన ఆంక్షల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. తమిళనాడు వ్యాప్తంగా ఆందోళనలు.. నిరసనలతో పాటు తమిళనాడు బంద్ తో శుక్రవారం అట్టుడికిపోయింది. ఇదిలా వదిలేస్తే.. మరింత ప్రమాదమన్న విషయాన్ని గుర్తించిన కేంద్రం.. నిరసనల్ని శాంతింపజేసే కార్యక్రమాన్ని వేగవంతం చేశారు. ఇందులో భాగంగా జల్లికట్టును నిషేదం ఎత్తివేసేలా చేసేందుకు వీలుగా.. సుప్రీంకోర్టు అడ్డు చెప్పని రీతిలో ఆర్డినెన్స్ ముసాయిదాను కేంద్రం సిద్ధం చేసింది.

ముసాయిదాను శుక్రవారం రాత్రి కేంద్రం ఆమోదించి తమిళనాడుకు పంపింది. జల్లికట్టుపై తమిళులు తీవ్రమైన భావోద్వేగంతో ఉన్నారని.. ఈ సమస్యకు కేంద్ర.. రాష్ట్రాలు శాశ్విత పరిష్కారం దిశగా అడుగులు వేయాల్సిన అవసరాన్ని గుర్తించాయి. ఇందుకు న్యాయపరమైన సంప్రదింపుల్ని షురూ చేశారు. గురువారం ప్రధానిని కలిసిన తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం.. జల్లికట్టుపై నిషేధాన్ని ఎత్తివేసేలా చేయాలని.. ఇందుకు అవసరమైన ఆర్డినెన్స్ ను కేంద్రం జారీ చేయాలని కోరటం తెలిసిందే. దీనికి స్పందించిన మోడీ.. ప్రస్తుతం ఈ అంశం సుప్రీం కోర్టులో ఉందన్నట్లు చెప్పినప్పటికీ.. కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఇష్యూను ఆమోదయోగ్యమైన రీతిలో క్లోజ్ చేసేందుకు శుక్రవారం కసరత్తు చేశారు.

తొలుత.. జల్లికట్టుపై వెలువరించాల్సిన తీర్పును వాయిదా వేయాలని సుప్రీంను కోరిన అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ కోరారు. దీనికి సుప్రీం సానుకూలంగా స్పందించింది. అదే సమయంలో తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ప్రధాని.. హోం మంత్రితో సహా పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. న్యాయపరమైన అడ్డంకులు జల్లికట్టుకు ఎదురుకాకుండా చూసేందుకు వీలుగా ప్రయత్నాల్ని ముమ్మరం చేశారు.

ఆర్డినెన్స్ ద్వారా జంతుహింస నిరోదక చట్టాన్ని సవరించి.. అందులోని పర్ ఫామింగ్ యానిమల్స్ జాబితా నుంచి ఎద్దుల్ని తొలగిస్తారు. దీంతో న్యాయపరమైన ఇబ్బందులు ఉండవు. ఇలా తయారు చేసిన ముసాయిదాను కేంద్రం ఓకే చేసి తమిళనాడుకు పంపింది. దీనిపై తమిళనాడు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేయాల్సి ఉంది. అనంతరం ఇది గవర్నర్ ముందుకువెళుతుంది.ఆయన ఓకే చేసిన వెంటనే.. కేంద్రానికి వెళ్లి..అక్కడ ఆర్డినెన్స్ రూపంలో విడుదల అవుతుంది. దీనికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసిన తర్వాత జల్లికట్టుపై విధించిన బ్యాన్ తొలిగిపోతుంది.

జల్లికట్టుపై బ్యాన్ ఎత్తేసేందుకు కేంద్రం చాలా తెలివిగా వ్యవహరించిందని చెప్పాలి. జల్లికట్టు క్రీడపై నిషేధాన్ని ఎత్తేస్తేలా ఆర్డినెన్స్ తెస్తే.. సుప్రీంకోర్టు ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంది. అలా కాకుండా.. జల్లికట్టుపై బ్యాన్ విధించేందుకు సహకరిస్తున్న చట్టంలోని అంశాల్ని సవరించటం ద్వారా.. జల్లికట్టుపై బ్యాన్ విధించేందుకు అవకాశం ఇవ్వని రీతిలో కసరత్తు జరిగిందని చెప్పొచ్చు. ఇప్పుడు రూపొందిస్తున్న ఆర్డినెన్స్ సుప్రీం అభ్యంతరం చెప్పని రీతిలో ఉంటుందని చెప్పక తప్పదు.

సాంకేతికంగా చూస్తే.. ఈ మొత్తం వ్యవహారానికి ఒకట్రెండు రోజులు పట్టే వీలుందని చెప్పొచ్చు. తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం చెప్పినట్లుగా.. ‘బిగ్ డే’ దారిలో ఉందన్నది నిజమైందని చెప్పక తప్పదు. జరిగినదంతా ఒక్క మాటలో చెప్పాలంటే.. తమిళులు తమ ఆగ్రహంతో.. కేంద్రాన్ని తమ దారికి తెచ్చుకున్నారని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/