Begin typing your search above and press return to search.

హోదాకు మించిన సాయం అంటే ఇదేనా!!

By:  Tupaki Desk   |   27 Sep 2016 6:52 AM GMT
హోదాకు మించిన సాయం అంటే ఇదేనా!!
X
ఏపీ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై అంతటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ప్రత్యేక హోదా ఇవ్వకుండా దెబ్బతీసిన వైనంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉంది. అయితే.. హోదా ఒక్కటే కాదు మిగతా పలు విషయాల్లోనూ కేంద్రం కారణంగా ఏపీ ఎంతో నష్టపోతోంది. ప్రపంచ ఆర్థిక సంస్థల నుంచి అమరావతి నిర్మాణానికి రుణం తీసుకునేందుకు ఏపీ చేస్తున్న ప్రయత్నాలకూ కేంద్రం నుంచి సహాయం అందడం లేదు సరికదా మోకాలడ్డుతోంది. కేంద్రానికి అంతర్జాతీయ స్థాయిలో రుణపరపతి తగ్గడంతో పనిలోపనిగా ఆంధ్రప్రదేశ్‌ కిచ్చే రుణాల్లో కోతకు సిఫార్సులు చేస్తోంది. నేరుగా నిధులిచ్చే అవకాశం లేదని తేల్చేసిన కేంద్రం హోదా మాటెలా ఉన్నా కనీసం ప్రపంచ ఆర్దిక వ్యవస్థలకు అప్పు కోసం చేసిన దరఖాస్తుల మేరకు హామీదారుగానైనా ఉంటే బాగుండేది కానీ.... ఏపీ పెట్టుకున్న దరఖాస్తుల్లోని రుణ మొత్తంలో కటింగులు వేస్తోంది.

ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న పలు సమస్యలు ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ నిర్మాణంపై ప్రభావం చూపిస్తున్నాయి. యూరిలో ఉగ్రదాడి అనంతరం పాక్‌ పై యుద్దానికి కేంద్రం సంకేతాలిచ్చింది. దీంతో భారత ఉపఖండంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. యుద్దమంటూ వస్తే దేశీయంగా ఆర్దిక సంక్షోభం తప్పదు. మరోవైపు అంతర్జాతీయ స్థాయిలో భారత రుణపరపతి తగ్గిం దని బహుళజాతి ఆర్దిక అధ్యయన సంస్థ మూడీస్‌ వెల్లడించింది. ఈ సంస్థ పెట్టు బడుల అనుకూలతలో బిఎఎ3 గ్రేడ్‌ కేటాయించింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ తో సహా పలు రాష్ట్రాలు ప్రతిపాదించిన భారీ ప్రాజెక్టుల కోసం విదేశీ ఆర్దిక సంస్థల రుణాలపై ఆధారపడ్డాయి. దీనికోసం భారీగానే దరఖాస్తులు కూడా చేశాయి. అయితే రుణాల మంజూరులో పలురకాల అధ్యయన నివేదికల్ని పరిగణనలోకి తీసుకునే ఆర్థిక సంస్థలు ఇప్పుడు భారతీయ సంస్థల పట్ల పెద్దగా ఆసక్తి చూపడంలేదు. అమరావతి నిర్మాణానికి బిలియన్‌ డాలర్ల రుణమివ్వమంటూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రపంచబ్యాంక్‌ కు దరఖాస్తు చేసింది. దీనిపై పలు దఫాలు చర్చలు - సమీక్షలు జరిగాయి. గతకొంతకాలం వరకు ప్రపంచ బ్యాంక్‌ కూడా ఇందుకు సమ్మతించింది. అయితే అనూహ్యంగా ఐదొందల మిలియన్‌ డాలర్లకు మించి రుణమిచ్చే అవకాశాల్లేవని తేల్చేసింది. ఇందుక్కారణం ఇలా రాష్ట్రాలకందే విదేశీ రుణాలన్నింటికి కేంద్రం జవాబుదారిగా ఉంటుంది. ప్రస్తుతం భారత్‌ కున్న రుణపరపతి తగ్గిపోవడంతో ఆ పరిధిమేరకే విదేశీ సంస్థలు రుణాల మంజూరుకు పరిధులు విధించుకున్నాయి.

ఇలాంటి నిర్ణయాలిప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ప్రగతిని నీరు గార్చేస్తున్నాయి. హోదా ఇవ్వకపోయినా అంతకుమించిన ఆర్థిక సాయంచేస్తామంటూ కేంద్రం నమ్మబలికింది. రాష్ట్రం కూడా ఇదే మేలంటూ వత్తాసు పలికింది. కానీ... వాస్తవానికి వచ్చేసరికి పరిస్థితులు ఇలా తయారయ్యాయి. ముందుముందు ఇలాంటివి ఇంకెన్ని చూడాలో మరి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/