Begin typing your search above and press return to search.

కేంద్రం న్యూస్‌ తో కేసీఆర్ వెరీ వెరీ హ్యాపీ!

By:  Tupaki Desk   |   16 Jun 2017 2:53 PM GMT
కేంద్రం న్యూస్‌ తో కేసీఆర్ వెరీ వెరీ హ్యాపీ!
X
నిజ‌మే.. మీరు న‌మ్మినా - న‌మ్మ‌కున్నా... టీఆర్ ఎస్ అధినేత‌ - తెలంగాణ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు కేంద్ర ప్ర‌భుత్వానికి థ్యాంక్స్ చెప్పారు. థ్యాంక్స్ చెప్ప‌డ‌మే కాదండోయ్‌... వీలు చూసుకుని ఢిల్లీ వ‌చ్చిన‌ప్పుడు మీ నోరు తీపి చేస్తానంటూ కూడా ఆయ‌న మోదీ కేబినెట్ లోని ఓ మంత్రి ఒక‌రికి స్వ‌యంగా ఫోన్ చేసిన మ‌రీ చెప్పారు. అయినా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర స‌ర్కారుకు కేసీఆర్ ఎందుకు థ్యాంక్స్ చెప్పార‌నే విష‌యానికి వ‌స్తే... కేసీఆర్ స‌ర్కారు ప్ర‌తిష్టాత్మ‌కంగా ప‌రిగ‌ణిస్తున్న కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు కేంద్ర ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ట‌.

విప‌క్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా... వెర‌వ‌కుండా ముంద‌డుగు వేసిన కేసీఆర్ కాళేశ్వ‌రం ప్రాజెక్టు నిర్మాణానికే మొగ్గు చూపారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు అడ్డు తగిలే వారు ఎవ‌రైనా కూడా త‌మ‌కు శ‌త్రువులే అన్న రీతిగానూ టీఆర్ ఎస్ వ్య‌వ‌హ‌రించింది. ఈ క్ర‌మంలో విప‌క్షాల నుంచి ఆందోళ‌న‌లు త‌గ్గినా... కేంద్రం నుంచి మాత్రం ఈ ప్రాజెక్టుకు అనుమ‌తుల వ్య‌వ‌హారం రోజుల త‌ర‌బడి నానుతోంది. అయితే ప్రాజెక్టుకు సంబంధించి అన్ని విష‌యాల‌ను కాస్తంత లోతుగానే ప‌రిశీలించిన కేంద్ర అట‌వీ - ప‌ర్యావ‌ర‌ణ శాఖ... ఆ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది. ఈ విష‌యంపై కేంద్రం సానుకూలంగా స్పందిస్తూ... ప్రాజెక్టుకు అనుమ‌తిస్తున్న‌ట్లు ఉత్త‌ర్వులు జారీ అయిన విష‌యాన్ని తెలుసుకున్న కేసీఆర్ చాలా వేగంగా స్పందించారు.

వార్త తెలిసిన మ‌రుక్ష‌ణ‌మే ఫోనందుకున్న కేసీఆర్‌... నేరుగా కేంద్ర అట‌వీ - ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ నెంబ‌రుకు డ‌య‌ల్ చేశారు. అవ‌త‌లి నుంచి కాల్ ను రిసీవ్ చేసుకోగానే... హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌కు థ్యాంక్స్ చెప్పిన కేసీఆర్‌... కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు అనుమ‌తులు మంజూరు చేసినందుకు ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఢిల్లీ వ‌చ్చిన‌ప్పుడు త‌మ‌ను ప్ర‌త్యేకంగా క‌లుస్తాన‌ని, మీ నోరు తీపి చేస్తాన‌ని కూడా కేసీఆర్ చెప్పారు. తెలంగాణ ప్రాజెక్టుల ప‌ట్ల సానుకూలంగా స్పందించినందుకు కేంద్ర మంత్రికి కేసీఆర్ ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు చెప్పారు. ఒక్క ప్రాజెక్టుకు అనుమ‌తులు ఇచ్చినందుకే కేసీఆర్ ఇంత‌గా సంతోష‌ప‌డిన వైనాన్ని హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ ఆస‌క్తిగా గ‌మ‌నించార‌ట‌.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/