Begin typing your search above and press return to search.

మోడీ జ‌మిలితో.. సీన్ మొత్తం రివ‌ర్స్!

By:  Tupaki Desk   |   29 July 2019 6:05 AM GMT
మోడీ జ‌మిలితో.. సీన్ మొత్తం రివ‌ర్స్!
X
సార్వ‌త్రిక ఎన్నిక‌లు.. అసెంబ్లీ ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత దాదాపు ఐదేళ్ల వ‌ర‌కూ మ‌ళ్లీ ఎన్నిక‌ల గురించి ఆలోచించాల్సిన అవ‌స‌ర‌మే ఉండ‌ని ప‌రిస్థితి. స్థిర‌మైన ప్ర‌భుత్వం కొలువు తీరిన త‌ర్వాత‌.. గ‌డువు ప్ర‌కారం త‌ప్పించి..అంత‌కంటే ముందుగా ఎన్నిక‌లు వ‌చ్చే అవ‌కాశ‌మే లేదు. అయితే.. ప్ర‌ధాని మోడీ దేశ వ్యాప్తంగా ఒకేసారి అన్ని ఎన్నిక‌ల్ని నిర్వ‌హించేందుకు వీలుగా జ‌మిలి ఎన్నిక‌ల‌ను తెర మీద‌కు తీసుకురావ‌టంతో.. ఇప్పుడు ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయి.

సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రిగి రెండు.. మూడు నెల‌లు కూడా కాలేదు. ఇలాంటి వేళ‌.. ఎన్నిక‌ల ఊసే వచ్చేది కాదు. కానీ.. అందుకు భిన్నంగా దేశ వ్యాప్తంగా సార్వ‌త్రిక‌.. రాష్ట్ర అసెంబ్లీల‌తో పాటు.. స్థానిక ఎన్నిక‌ల్ని ఒకేసారి నిర్వ‌హించ‌టం ద్వారా.. అధికారంలోకి వ‌చ్చిన పార్టీకి మ‌ళ్లీ ఎన్నిక‌ల ఇబ్బంది ఎదురుకాకుండా ఉండేలా చేయాల‌న్న ఆలోచ‌న‌కు ప్ర‌తిరూపం జ‌మిలి ఎన్నిక‌లు.

ఇప్ప‌టికే ఈ దిశ‌గా మోడీ స‌ర్కారు అడుగులు వేస్తోంది. ఈ ఏడాది చివ‌రి నుంచి వ‌రుస పెట్టి ప‌లు రాష్ట్రాల అసెంబ్లీల‌కు ఎన్నిక‌ల్ని నిర్వ‌హించాల్సిన అవ‌స‌రం ఉంది. ఇలా ఎన్నిక‌లు నిర్వ‌హించుకుంటూ వెళ్ల‌టం ద్వారా.. ఏదైనా రాష్ట్రంలో ఫ‌లితాలు ప్ర‌తికూలంగా వ‌చ్చినంత‌నే.. పాల‌నా ప‌ర‌మైన నిర్ణ‌యాల‌కు అడ్డంకిగా మారుతోంది. దీనికి చెక్ పెట్టేందుకు ఇప్పుడు జ‌ర‌గాల్సిన రాష్ట్రాల్లో ఎన్నిక‌ల్ని మ‌రో రెండేళ్లు వాయిదా వేయ‌టం.. అదే స‌మ‌యంలో 2024లో జ‌ర‌గాల్సిన ఎన్నిక‌ల్ని ఒక ఏడాది ముందే ఎన్నిక‌ల్ని నిర్వ‌హించ‌టం ద్వారా దేశం మొత్తం ఒకేసారి ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌న్న‌ది ఆలోచ‌న‌.

ఒక దేశం.. ఒకే ఎన్నిక‌ల‌న్న‌ట్లుగా మోడీ ఆలోచ‌నా తీరు ఉంద‌ని చెప్పాలి. ఈ దిశ‌గా ఇప్పటికే ప‌లు స‌మావేశాలు నిర్వ‌హించిన మోడీ స‌ర్కారు.. తాజాగా జ‌మిలికి క‌న్ఫ‌ర్మ్ అయిన‌ట్లుగా స‌మాచారం. అదే జ‌రిగితే.. మొన్న‌నే జ‌రిగిన సార్వ‌త్రిక.. అసెంబ్లీల నేప‌థ్యంలో 2024లో జ‌ర‌గాల్సిన ఎన్నిక‌లు ఏడాది ముందుకు వ‌చ్చేస్తాయి. అంటే.. ఐదేళ్లు ఉండాల్సిన ప‌ద‌వీ కాలం నాలుగేళ్ల‌కు పూర్తి కానుంద‌న్న మాట‌. అదే విధంగా స్థానిక సంస్థ‌ల‌కు మూడున్న‌రేళ్ల‌కే ప‌ద‌వీ కాలం ముగుస్తుంది. ప‌ద‌వీ కాలం పూర్తిగా ఉంటామ‌న్న ఆశ‌తో ఉన్న ప‌లువురు నేత‌ల‌కు మోడీ జ‌మిలి కొత్త త‌ల‌నొప్పులు తెస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.