Begin typing your search above and press return to search.

ట్రిపుల్ త‌లాక్‌ కు జైలుతో చెక్‌!

By:  Tupaki Desk   |   22 Nov 2017 6:42 AM GMT
ట్రిపుల్ త‌లాక్‌ కు జైలుతో చెక్‌!
X
న‌ష్టం జ‌రుగుతుంద‌ని అనుకున్న అంశంలో లాభం జ‌ర‌గ‌టం ఆస‌క్తిక‌ర‌మైన అంశం. ఎవ‌రూఊహించ‌ని రీతిలో ట్రిపుల్ తలాక్ ఎపిసోడ్ లో బీజేపీకి క‌లిగిన ప్ర‌యోజ‌నం అంతా ఇంతా కాదు. ట్రిపుల్ త‌లాక్ అంశం మైనార్టీలోని కొంద‌రికి తాము అనుకూలంగా మార‌తామ‌ని బీజేపీ అంచ‌నా వేసుకున్న‌ప్ప‌టికీ.. వారు అనుకున్న దానికి రెట్టింపు మైలేజీ బీజేపీకి ద‌క్కింది.

ద‌శాబ్దాల ప‌ర్యంతం త‌మ క‌ష్టాన్ని ప‌ట్టించుకోని రాజ‌కీయ పార్టీలకు భిన్నంగా.. త‌మ స‌మ‌స్య‌ను జాతీయ అంశంగా మార్చి పెద్ద ఎత్తున చ‌ర్చ‌తో పాటు.. కీల‌క నిర్ణ‌యాన్ని తీసుకునేందుకు మోడీ స‌ర్కారు అడుగులు వేస్తుంద‌న్న న‌మ్మ‌కం ఓట్ల రూపంలో మార‌ట‌మే కాదు.. కీల‌క‌మైన యూపీ ఎన్నిక‌ల్లో బీజేపీకి భారీ మెజార్టీ ద‌క్కేందుకు కార‌ణ‌మైంద‌ని చెబుతారు. బీజేపీకి దూరంగా ఉండే మైనార్టీల‌కు త‌మ తీరుకు భిన్నంగా ట్రిపుల్ త‌లాక్ విష‌యంలో కొంద‌రు ఓట‌ర్లు బీజేపీకి అండ‌గా నిల‌వ‌టం తెలిసిందే.

మ‌రి ముఖ్యంగా మైనార్టీ మ‌హిళ‌లు మోడీని హీరోగా కీర్తిస్తున్నారు. త‌మ క‌ష్టాన్ని ఎవ‌రికి చెప్పుకోలేని ప‌రిస్థితుల్లో ట్రిపుల్ త‌లాక్ విష‌యంలో త‌మ‌కు మేలు జ‌రిగేలా చేశార‌న్న భావ‌న వారిలో ఉంది. ఈ కార‌ణంతోనే మైనార్టీ మ‌హిళ‌ల ఓట్లు బీజేపీకి ప‌డ్డాన్న విశ్లేష‌ణ‌ను వినిపిస్తుంటారు. ట్రిపుల్ త‌లాక్ మీద తాము తీసుకున్న స్టాండ్ త‌మ‌కు ఓట్ల రూపంలో ల‌బ్థి చేకూరుతుంద‌న్న విష‌యాన్ని క‌మ‌ల‌నాథులు ఊహించ‌లేద‌ని చెబుతారు. ముస్లిం మ‌హిళ‌లు పార్టీ విష‌యంలో సానుకూల‌త వ్య‌క్తం చేస్తున్న విష‌యాన్ని గుర్తించిన క‌మ‌లనాథులు ఇప్పుడు చ‌ట్టంగా మార్చాల‌న్న యోచ‌న‌లో ఉన్నారు.

ఇందుకు త‌గ్గ‌ట్లే పార్ల‌మెంటు స‌మావేశాల్లో ట్రిపుల్ త‌లాక్ బిల్లును ప్ర‌వేశ పెట్టాల‌ని భావిస్తోంది మోడీ స‌ర్కార్‌. ముస్లింల ఆచార‌ణ‌మైన ట్రిపుల్ త‌లాక్ ను రద్దు దిశ‌గా కేంద్రం అడుగులు వేస్తోంది. మూడుసార్లు వెంట వెంట‌నే త‌లాక్ చెప్పే భ‌ర్త‌ల‌ను జైలుకు పంపాల‌ని.. భారీగా జ‌రిమానా విధించాల‌న్న అంశంపైనా పార్ల‌మెంటులో చ‌ర్చ జ‌ర‌ప‌నున్నారు. ఇదిలా ఉంటే.. ట్రిపుల్ త‌లాక్ మీద ఇప్ప‌టికే ఉన్న నిబంధ‌న‌ల్ని స‌వ‌రించాలా? లేదంటే ర‌ద్దు చేసి కొత్త చ‌ట్టాన్ని తీసుకురావాలా? అన్న అంశంపై ఒక క‌మిటీని వేయాల‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ట్రిపుల్ త‌లాక్ విష‌యంలో మోడీ స‌ర్కారు మ‌రింత ముందుకు వెళ్లాల‌ని డిసైడ్ అయిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు.