Begin typing your search above and press return to search.

కేంద్రంపైకి కేసీఆర్ యుద్ధ'శకటం'

By:  Tupaki Desk   |   14 Dec 2015 10:58 AM GMT
కేంద్రంపైకి కేసీఆర్ యుద్ధశకటం
X
కేంద్రంతో కేసీఆర్ ప్రభుత్వానికి కొత్త సమస్య వచ్చింది. రిపబ్లిక్ డే కోసం తెలంగాణ ప్రభుత్వం పంపిన మూడు శకటాల నమూనాలను కేంద్రం నియమించిన ఎంపిక కమిటీ రిజక్ట్ చేయడంతో తెలంగాణ గవర్నమెంటు మండిపడుతోంది. ఇకపై తాము రిపబ్లిక్ డేకు శకటమే పంపించబోమని తేల్చి చెప్పేసింది.

నిరుడు పంపిన శకటాలనూ కేంద్రం ఓకే చేయలేదని... అయితే... తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాది కావడం... అమెరికా అధ్యక్షుడు ఒబామా వస్తుండడంతో ప్రతిష్ఠాత్మకంగా భావించి కేంద్రాన్ని ఒప్పించి తెలంగాణ శకటానికి స్థానం దక్కేలా చేశారు. కానీ, ఈ ఏడాది పంపిన 3 నమూనాలకు కేంద్రం నో చెప్పడంతో తెలంగాణ గవర్నమెంటు సీరియస్ అయింది.

లోక్ సభలో సోమవారం టీఆరెస్ ఫ్లోర్ లీడర్ జితేందర్ రెడ్డి దీనిపై తమ ప్రభుత్వ వైఖరిని స్పష్టంగా చెప్పేశారు. ఇకపై రిపబ్లిక్ డేకు తెలంగాణ నుంచి శకటాలు పంపించరాదని నిర్ణయించుకున్నామని చెప్పారు. రక్షణ శాఖ జాయింట్ సెక్రటరీ నేతృత్వంలోని కమిటీ ఏటా అన్ని రాష్ట్రాల నమూనాలను పరిశీలించి ఎంపిక చేస్తుంది. ఈసారి తెలంగాణ మూడు నమూనాలను పంపించింది. పేరిణి శివతాండం, బతుకమ్మ, సమ్మక్కసారక్క నేపథ్యంలో నమూనాలు పంపారు. ఇవి ప్రమాణాలకు అనుగుణంగా లేవని కమిటీ రిజక్ట్ చేసింది. తొలుత ముసాయిదా జాబితాలో ఇందులో ఒక నమూనాకు స్థానం కల్పించినా ఆ తరువాత ఫైనల్ లిస్టులో మాత్రం వీటిలో ఏదీ లేకుండా చేశారు. ఎంపిక కమిటీ నిర్వహించిన మూడు సమావేశాల్లోనూ సమ్మక్కసారక్క నమూనాకు ఓకే అన్నారని... కానీ, చివరికొచ్చేసరికి ఎందుకో లిస్టులో లేకుండా చేశారని జితేందర్ రెడ్డి ఆరోపించారు. తాము ఇక కేంద్రాన్ని బతిమాలదలచుకోలేదని చెప్పిన ఆయన ఏకంగా శకటాలు పంపించడమే మానుకుంటామని తేల్చి చెప్పేశారు.