Begin typing your search above and press return to search.

అమిత్ షా ఎంట్రీ... ఏబీకి డబుల్ ట్రబుల్ తప్పదా?

By:  Tupaki Desk   |   7 March 2020 1:54 PM GMT
అమిత్ షా ఎంట్రీ... ఏబీకి డబుల్ ట్రబుల్ తప్పదా?
X
ఏపీ ఇంటెలిజెన్స్ అదనపు డీజీగా పనిచేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు డబుల్ ట్రబుల్ తప్పేలా లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే జగన్ సర్కారు ఏబీని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడమే కాకుండా... ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న సమయంలో తన కుమారుడి కంపెనీకి లబ్ధి చేకూరేలా వ్యవహరించారన్న ఆరోపణలపై విచారణ కూడా జరుగుతోంది. తాజాగా ఏబీకి సంబంధించిన వ్యవహారంపై పూర్తి వివరాలతో సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఏపీ నుంచి త్వరలోనే అందనున్న సదరు నివేదిక ఆధారంగా ఏబీ వ్యవహారంపై ఏ రకమైన చర్యలు తీసుకోవాలన్న విషయంపై కేంద్రం ఆలోచన చేయనున్నట్లుగా సమాచారం. అంటే... ఇటు ఏపీ ప్రభుత్వం నుంచే కాకుండా అటు కేంద్రం వైపు నుంచి కూడా ఏబీకి ట్రబుల్స్ తప్పేలా లేవన్న వాదనలు వినిపిస్తున్నాయి.

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఏపీకి సీఎంగా కొనసాగిన కాలంలో ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన ఏబీ... చంద్రబాబు సీఎం పదవి నుంచి దిగిపోయే దాకా అదే పోస్టులో కొనసాగారు. చంద్రబాబు సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తొలి నాళ్లలో ఓ నాలుగైదు నెలలు వేరే వారు ఇంటెలిజెన్స్ చీఫ్ గా వ్యవహరించినా... ఆ పదవిలోకి ఏబీ వచ్చాక సాంతం ఆయనే కొనసాగారు. మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోగానే... సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన జగన్... ఏబీని ఇంటెలిజెన్స్ చీఫ్ పదవి నుంచి పీకేసి వెయిటింగ్ లో పెట్టేశారు. పదవిలో ఉండగా తన పదవిని అడ్డం పెట్టుకుని తన కుమారుడి చేత ఓ కంపెనీని పెట్టించి నిఘా పరికరాలను కొనుగోలు చేసే వ్యవహారంలో రూ.25 కోట్ల మేర నిధులను బొక్కేశారన్నది ఏబీపై వచ్చి ఆరోపణ. దీనిపై జగన్ సర్కారు సీరియస్ గానే విచారణ మొదలుపెట్టేసింది.

అయితే తనను తాను డిఫెండ్ చేసుకునేందుకు ఏబీ... క్యాట్ ను ఆశ్రయించారు. క్యాట్ లో విచారణ సందర్భంగా తానేమీ తప్పు చేయలేదని, జగన్ సర్కారు తనపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని కూడా ఏబీ వాదిస్తున్నారు. అదే సమయంలో ఇంటెలిజెన్స్ చీఫ్ హోదాలో ఏబీ ఏఏ అక్రమాలకు పాల్పడ్డారన్న వివరాలను కూడా ఏపీ సర్కారు క్యాట్ ముందు పెట్టేసింది. ఇరు వర్గాల వాదనలను విన్న తర్వాత క్యాట్ తన తీర్పును రిజర్వ్ లో పెట్టేసింది. ఇలాంటి కీలక తరుణంలో ఏబీ వ్యవహారంలోకి కేంద్ర ప్రభుత్వం ఎంట్రీ ఇచ్చిన తీరు నిజంగానే ఆసక్తి రేకెత్తించేదే. ఏబీ వ్యవహారానికి సంబందించి పూర్తి వివరాలను, సమగ్ర నివేదికను అందజేయాలని జగన్ సర్కారుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసిందంటే... అమిత్ షా ఈ వ్యవహారంలోకి నేరుగా దిగేసినట్టేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే... ఏబీకి డబుల్ ట్రబుల్ తప్పదు.