Begin typing your search above and press return to search.

బిగ్ బ్రేకింగ్ : మే నెలలో రెండో దశ లాక్ డౌన్..?

By:  Tupaki Desk   |   6 April 2020 10:50 AM GMT
బిగ్ బ్రేకింగ్ : మే నెలలో రెండో దశ లాక్ డౌన్..?
X
ఈనెల 14 తర్వాత లాక్‌ డౌన్‌ ను ఎత్తేయబోతున్నారా? లేదా లాక్‌ డౌన్‌ ను కంటిన్యూ చేస్తారా? చేస్తే ఏయే రంగాలకు మినహాయింపులిస్తారు? ఎవరిని రోడ్లపైకి అనుమతిస్తారు? ఇప్పుడు ప్రతి ఒక్కరి మదిలో మెదిలే ప్రశ్నలు. అయితే లాక్‌ డౌన్ ఎత్తేసే విషయంపైనే ఏప్రిల్ 3న 16 మందితో కూడిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. దీనికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌ నాథ్ సింగ్ అధ్యక్షత వహించగా - కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తదితరులు పాల్గొన్నారు. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... ఏప్రిల్ 14 న లాక్‌ డౌన్ ఎత్తేసిన తర్వాత.... మే 15 నుంచి రెండో దశ లాక్‌ డౌన్ విధిస్తే ఎలా ఉంటుందని కేంద్ర మంత్రులు చర్చించినట్టు సమాచారం.

అయితే మొదటి దశ లాక్‌ డౌన్ ఎత్తేసిన తర్వాత ఏ దుకాణాలు తెరవాలి? ఏ దుకాణాలు మూసి ఉంచాలన్నది కూడా ఈ సందర్భంగా చర్చకి వచ్చినట్టు తెలుస్తుంది. అయితే లాక్ డౌన్ ఎత్తివేసినప్పటికీ .. షాప్స్ ముందు ప్రజలు పెద్ద ఎత్తున గుమ్మిగూడకుండా చూడాలని అనుకున్నారని భావించినట్లు సమాచారం. సినిమా థియేటర్లు - ఫుడ్ కోర్టులు - రెస్టారెంట్లు - ప్రార్థనా మందిరాలను మాత్రం తెరవకూడదన్న నిబంధన విధించాలని భావించారు.

అలాగే, నిత్యావసరాలను అమ్మే మాల్స్‌ కు మాత్రం మినహాయింపు ఇస్తే బాగుంటుందని భావించినట్లు సమాచారం. విమాన సర్వీసులు తిరిగి ప్రారంభించాలని - అయితే ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే విదేశీయులకు అనుమతులిస్తే ఎలా ఉంటుందన్న దానిపై కూడా చర్చ జరిగింది. అయితే కరోనా వైరస్‌ తో బాగా ప్రభావితమైన ప్రాంతాల్లో మాత్రం వారం వారం సంతలకు అనుమతి ఇవ్వకూడదని - రాష్ట్రమంతటా కరోనా పై అవగాహన కల్పించేందుకు అన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక అధికారులను నియమించాలని మంత్రులు భావించారు. ఈ నిర్ణయాల పై ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోక పోయినప్పటికీ కూడా ఈ ప్రతిపాదనలన్నీ కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. అయితే లాక్‌ డౌన్ ఎత్తేసిన తర్వాత పరిస్థితిని బట్టి మే 15 నుంచి రెండో దశ లాక్‌ డౌన్ విధించాలా? వద్దా? అని నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.