Begin typing your search above and press return to search.

వామ్మో..టీఆర్ ఎస్ కూడా డేటా చోరీకి పాల్పడిందా?

By:  Tupaki Desk   |   5 Aug 2019 2:14 PM GMT
వామ్మో..టీఆర్ ఎస్ కూడా డేటా చోరీకి పాల్పడిందా?
X
డేటా చోరీ... ప్రజలకు సంబంధించి దాదాపుగా అన్ని రకాల సమాచారాన్ని వారి ప్రమేయం లేకుండానే సేకరించేసి, వారి అనుమతి లేకుండానే వాడేసుకోవడం. ఇటీవల జరిగిన ఎన్నికలకు కాస్తంత ముందుగా తెలుగు రాష్ట్రాల్లో కాక రేపిన ఈ వ్యవహారం... ఎన్నికల హడావిడి మొదలుకాగానే చప్పున చల్లారిపోయింది. ఏపీలో అధికార పార్టీ టీడీపీ ప్రజల డేటాను చోరీ చేసిందన్న ఆరోపణలపై అందిన ఫిర్యాదులపై తెలంగాణ సర్కారు దర్యాప్తునకు ఉపక్రమించింది. అయితే ఇప్పుడు తెర మీదకు వచ్చిన డేటా చోరీ విషయం... డేటా చోరీపై దర్యాప్తు జరిపిన తెలంగాణ సర్కారే... తెలంగాణ ప్రజల డేటాను చోరీ చేసిందన్న ఆరోపణ నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది. తెలంగాణ ప్రజలకు సంబందించిన డేటాను వివిధ మార్గాల్లో సేకరించేసిన అధికార పార్టీ టీఆర్ ఎస్... దానిని తన రాజకీయ ప్రయోజనాల కోసం యథేచ్ఛగా వాడేస్తోందని కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేత - ఆ పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదండోయ్... ఈ వ్యవహారంపై నేరుగా కేంద్రమే రంగంలోకి దిగి దర్యాప్తు చేయాలని కూడా ఆయన డిమాండ్ చేసిన వైనం చూస్తుంటే... మున్ముందు మరింత ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

సరే... ఏపీ ప్రజల డేటానో చోరీ చేసిందంటూ టీడీపీపై వచ్చిన ఆరోపణల ఆధారంగా టీఆర్ ఎస్ సర్కారు దర్యాప్తు చేయించిన విషయం తెలిసిందే కదా. నాడు ఆ కేసు విషయంలో ప్రధాన నిందితుడిగా ఉన్న ఐటీ గ్రిడ్ ఎండీ అశోక్ ను అరెస్ట్ చేసేందుకు తెలంగాణ పోలీసులు ఏపీలో అడుగుపెడతారన్న విషయంపై పెను కలకలమే రేగింది కదా. అయితే ఎన్నికల హడావిడి మొదలు కాగానే తెలంగాణ పోలీసులు ఆ కేసును పక్కనపెట్టేసినట్టే కనిపించారు. డేటా చోరీపై నాడు నానా యాడీ చేసిన తెలంగాణ సర్కారే... ఇప్పుడు డేటా చోరీకి పాల్పడిందన్న ఆరోపణలు నిజంగానే ఆసక్తికరమే. ఈ దిశగా శ్రవణ్ ఆరోపణలు చేయడానికి ఆధారం ఏమిటన్న విషయానికి వస్తే... తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ ఉన్నారు కదా. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఈ ఐఏఎస్ అధికారి ఇటీవల ఏదో కార్యక్రమంలో మాట్లాడుతూ చేసిన కొన్ని కామెంట్లే శ్రవణ్ ఆరోపణలకు ఆధారాలుగా నిలుస్తున్నాయట.

అయినా ఆ సందర్భంగా రంజన్ ఏమన్నారన్న విషయానికి వస్తే.... పలు ప్రభుత్వ శాఖల నుంచి ప్రజలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి దానిని చాలా కార్యకలాపాల కోసం వినియోగిస్తున్నామని రంజన్ చెప్పారట. అంతేకాకుండా పలు మార్గాల ద్వారా సేకరించిన ఈ సమాచారాన్ని ఓ ఆల్గారిథమ్ లా రూపొందించుకుని వినయోగిస్తున్నట్లు కూడా రంజన్ చెప్పారట. ఇవే మాటలను పట్టుకున్న శ్రవణ్... కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలను వెంటేసుకుని నేరుగా బీజేపీ సీనియర్ నేత - కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని కలిశారట. ప్రజలకు సంబంధించిన కీలక సమాచారాన్ని వారికి తెలియకుండానే సేకరించేసిన టీఆర్ ఎస్ సర్కారు... ఆ సమాచారాన్ని సంబంధిత వ్యక్తులకు తెలియకుండానే తన స్వప్రయోజనాల కోసం వాడేస్తోందని, ఇలా చేయడం చట్టసమ్మతం కాదని ఫిర్యాదు చేశారట. అంతేకాకుండా ఇలా చట్ట విరుద్ధంగా ప్రజలకు చెందిన అత్యంత సున్నిత సమాచారాన్ని సేకరించడమే కాకుండా దానిని తనకు అవసరమైన అన్ని విషయాలకూ వాడేస్తున్న టీఆర్ ఎస్ సర్కారుపై దర్యాప్తు జరపాలని కూడా ఆయన కిషన్ రెడ్డిని కోరారట. శ్రవణ్ వాదనను విన్న కిషన్ రెడ్డి దీనిపై దృష్టి సారిస్తానని చెప్పారట. మరి శ్రవణ్ ఆరోపిస్తున్నట్లుగా టీఆర్ ఎస్ సర్కారు పాల్పడుతున్న డేటా చోరీపై కేంద్రం గనుక దర్యాప్తు చేయిస్తే... ఎంతటి రాద్ధాంతం చోటుచేసుకుంటుందో చూడాలి.