Begin typing your search above and press return to search.

బాబును క‌లిసేందుకు సీఈవోలు భ‌య‌ప‌డ్డారు

By:  Tupaki Desk   |   15 May 2017 8:30 AM GMT
బాబును క‌లిసేందుకు సీఈవోలు భ‌య‌ప‌డ్డారు
X
ఏపీ విప‌క్షానికి చెందిన ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మీద.. ఆయ‌న స‌ర్కారు మీద తీవ్ర ఆరోప‌ణ‌లు చేసిన ఆమె త‌న‌దైన శైలిలో ముఖ్య‌మంత్రిపై విరుచుకుప‌డ్డారు. ఏపీ సీఎం చంద్ర‌బాబు చెప్పే మాట‌ల్ని విని ప్ర‌జ‌లు న‌వ్వుకుంటున్నార‌న్న ఆమె.. స్నానం చేయ‌కుండానే 24 గంట‌ల పాటు రాష్ట్ర ప్ర‌జ‌ల కోసం విదేశీ ప‌ర్య‌ట‌న‌లు చేయ‌టాన్ని ఎద్దేవా చేశారు.

అమెరికాలో 300 కంపెనీల సీఈవోల‌ను క‌లుస్తాన‌ని వెళ్లార‌ని.. అయితే చంద్ర‌బాబు అవినీతి గురించి తెలుసుకొని 200 మంది సీఈవోలు ఆయ‌న్ను క‌లిసేందుకు భ‌య‌ప‌డ్డార‌న్నారు. చంద్ర‌బాబు ఫారిన్ టూర్లు ఎందుకన్న‌ది ఎవ‌రికీ అర్థం కావ‌టం లేద‌న్న రోజా.. దోచుకున్న సొమ్మును దాచుకునేందుకు, విరాళాల కోస‌మే ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నార‌న్నారు.
ఫారిన్ టూర్ త‌ర్వాత ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌కి చేరుకున్న చంద్ర‌బాబు అమిత్ షా కాళ్లు ప‌ట్టుకోవ‌టానికి ఆరు గంట‌లు అదృశ్య‌మ‌య్యారా? హోం మంత్రి కాళ్లు పట్టుకోవ‌టానికి వెళ్లారా? అని ప్ర‌శ్నించారు. గ‌డిచిన రెండున్న‌రేళ్ల‌లో చంద్ర‌బాబు అండ్ కో రూ.2 ల‌క్ష‌ల కోట్లు దోచుకుంద‌ని.. ప్ర‌జ‌ల్ని డైవ‌ర్ట్ చేయ‌టానికే ఎమ్మెల్సీ వాకాటి స‌త్య‌నారాయ‌ణ రెడ్డి స‌స్పెన్ష‌న్ డ్రామా అని.. బాబులో నిజాయితీ ఉంటే మారిష‌స్ బ్యాంకుకు వంద‌ల కోట్లు ఎగ్గొట్టిన సుజ‌నా చౌద‌రికి కేంద్ర‌మంత్రి ప‌ద‌వి ఎందుకు ఇచ్చార‌న్న సందేహాన్ని వ్య‌క్తం చేశారు.

తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకునేందుకు వ‌చ్చిన రోజా.. స్వామి ద‌ర్శ‌నం త‌ర్వాత చంద్ర‌బాబు స‌ర్కారు తీరుపై నిప్పులు చెరిగారు. ఓటుకు నోటు కేసులో దోషిగా ఉన్న చంద్ర‌బాబు.. అవినీతికి పాల్ప‌డిన సుజ‌నా, గంటా శ్రీనివాస‌రావులు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు. కొండ‌మీద రాజకీయాలు మాట్లాడ‌కూడ‌ద‌న్న‌ది అవివేక‌మ‌ని.. శ్రీవారి ద‌ర్శ‌నానికి వ‌చ్చిన చంద్ర‌బాబు అనేక హామీలు ఇవ్వ‌టాన్ని గుర్తు చేశారు. బాబు స‌ర్కారుకు నిజంగానే చిత్త‌శుద్ధి ఉంటే.. రాష్ట్రంలో దేవాల‌యాల చుట్టూ ఉండే బెల్ట్ షాపుల్ని ఎత్తేయ‌గ‌ల‌రా? అని సూటిగా నిల‌దీశారు.