Begin typing your search above and press return to search.

రాయ‌పాటి కంపెనీపై దాడులు..లాజిక్ ఏంటో?

By:  Tupaki Desk   |   11 Aug 2018 4:44 PM GMT
రాయ‌పాటి కంపెనీపై దాడులు..లాజిక్ ఏంటో?
X
ట్రాన్స్‌ ట్రాయ్‌...తెలుగు రాష్ర్టాల్లో ఈ కంపెనీ గురించి ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. రాయ‌పాటి సాంబ‌శివ‌రావు...ఈ నాయ‌కుడికి గురించి కూడా వివ‌రించాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే...సుదీర్ఘ రాజ‌కీయ జీవితం రాయ‌పాటి సొంతం. కాంగ్రెస్ పార్టీలో కొన‌సాగిన రాయ‌పాటి గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీ గూటికి చేరారు. అయితే, బ‌ల‌మైన లాబీయింగ్‌ కు పెట్టింది పేర‌యిన రాయ‌పాటి ఒక ద‌శ‌లో...ఏపీ ముఖ్య‌మంత్రి - తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడుకు సైతం షాక్ ఇచ్చారు. బాబు ఢిల్లీలో చ‌క్రం తిప్పుతార‌ని - త‌ను అనుకున్న ప‌నుల‌ను అనుకున్న‌ట్లుగా...చ‌క‌చ‌కా చేసేస్తార‌నే ప్ర‌చారాన్ని కాద‌ని సైతం త‌న కంపెనీకి రాయ‌పాటి మేలు చేసుకున్నారు. ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌తిష్టాత్మ‌కంగా ముందుకు తీసుకుపోతున్న పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణ‌ప‌నుల్లో ట్రాన్స్‌ ట్రాయ్‌ సంస్థ విఫ‌ల‌మైంద‌నే అభిప్రాయం ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ సంస్థ టీడీపీకి చెందిన ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావుకు చెందిందనేది కూడా సుప‌రిచితం. అయితే పోల‌వ‌రం ప‌నులు అనుకున్న రీతిలో జ‌ర‌గ‌ని నేప‌థ్యంలో కాంట్రాక్టరును మార్చేయాల‌ని ఏపీ సీఎం చంద్ర‌బాబు డిసైడ‌య్యారు. ఈ విష‌యాన్ని కేంద్ర‌మంత్రి గడ్క‌రీకి తెలియ‌జేయ‌గా....ప్ర‌స్తుత కాంట్రాక్ట‌రును మార్చేది లేద‌ని ఆయ‌న తేల్చిచెప్పిన‌ట్లు స‌మాచారం. ఈ ప‌రిణామం రాజ‌కీయవ‌ర్గాల్లో చ‌ర్చనీయాంశంగా మారింది. అది రాయ‌పాటి స‌త్తా.

అలాంటి స‌త్తా ఉన్న నరసారావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావుకు తాజాగా షాక్‌ కు లోన‌య్యే ప‌రిణామం ఎదురైంది. రాయ‌పాటికి చెందిన ట్రాన్స్‌ ట్రాయ్ కంపెనీ కార్యాలయాలపై సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. ట్రాన్స్‌ట్రాయ్‌కు చెందిన‌ హైదరాబాద్ కార్పొరేట్ కార్యాలయంపై దాడులు నిర్వహించారు. పెద్ద ఎత్తున పన్ను ఎగ్గొట్టారని పేర్కొంటూ అధికారులు సోదాలు చేశారు. ఈ ప‌రిణామం రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. 2012లో పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టును ట్రాన్స్‌ ట్రాయ్ దక్కించుకుంది. అయితే, ఇటీవ‌లి కాలంలో ప‌నులు వేగంగా సాగ‌డం లేద‌ని ఆ కంపెనీ బ‌దులుగా మ‌రో కంపెనీకి ఆ కార్య‌క‌లాపాలు అప్ప‌గించే క‌స‌రత్తు సాగితే...దాన్ని రాయ‌పాటి విజ‌య‌వంతంగా అడ్డుకున్నారు.

ఇదిలాఉండ‌గా....ఈ సోదాల‌పై రాయ‌పాటి స్పందించారు. తన కార్పొరేట్ కార్యాలయంపై దాడులు జరిగిన మాట వాస్తవమేనని రాయపాటి చెప్పారు. పోలవరం పనులకు అడ్డంకులు సృష్టించేందుకు ఈ దాడులు చేస్తున్నారని అన్నారు. ఇది ముమ్మాటికీ రాజకీయ కక్షచర్య సాధింపేనని అన్నారు. త‌న రాజ‌కీయ శ‌త్రువు అయిన ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు కన్నా లక్ష్మీనారాయణకు లింక్ పెడుతూ ఏపీలో అత్యంత అవినీతిపరుడు అని ఎంపీ రాయపాటి అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ పోటీ చేసినా కన్నా గెలవలేరని ఆయన విమర్శించారు. సీబీఐ - ఈడీని అడ్డుపెట్టుకొని వేధింపులకు గురిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం నుంచి తమ కంపెనీకి బకాయిలు రావాలని తెలిపారు. బకాయిలు వస్తే కేంద్రానికి జీఎస్టీ కడతామన్నారు. కాగా, కేవ‌లం క‌న్నా-రాయ‌పాటికి మ‌ధ్య ఉన్న వివాదం వ‌ల్లే సోదాలు జ‌రిగాయా? లేక‌పోతే...దీనివెనుక మ‌రే కార‌ణాలు అయినా ఉన్నాయా అనేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది