Begin typing your search above and press return to search.

జగన్ పాదయాత్రకు ఏపీ బీజేపీ సపోర్టు?

By:  Tupaki Desk   |   9 Nov 2017 6:21 AM GMT
జగన్ పాదయాత్రకు ఏపీ బీజేపీ సపోర్టు?
X
ఏపీ రాజకీయాల్లో అధికారపక్షానికి మిత్రపక్షంగా ఉంటూ ప్రతిపక్షంతోనూ సత్సంబంధాలు మెంటైన్ చేస్తున్న బీజేపీ ఇప్పుడు ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ.. రాజకీయం పీక్ స్టేజికి చేరుకుంటున్న సమయాన కూడా మిత్రపక్షం టీడీపీ అధినేత చంద్రబాబుకు మంటపుట్టించే పనులకు పాల్పడుతోందట. ముఖ్యంగా విపక్ష నేత జగన్ పాదయాత్ర విషయంలో ఆ పార్టీ ఏపీ నేతలు చూపిస్తున్న సాఫ్ట్ ఫీలింగును టీడీపీ జీర్ణించుకోలేకపోతున్నట్లు సమాచారం. జగన్ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించినా... పాదయాత్రలో ప్రభుత్వాన్ని ఏకిపారేస్తున్నా బీజేపీ ఏమాత్రం స్పందించడం లేదు. ఏపీ ప్రభుత్వంలో తామూ ఉన్నామన్న సంగతే పట్టించుకోవడం లేదన్నది టీడీపీ నేతల ఆరోపణ.

జగన్ ను విమర్శించకపోయినా ఫరవాలేదు కానీ ఆయన యాత్రకు అనుకూలంగా ఉండడం ఏంటన్న ప్రశ్నలు టీడీపీ నేతల నుంచి వినిపిస్తున్నాయి. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ఉద్దేశించిన పాదయాత్రలను అన్ని పార్టీలు స్వాగతించాల్సిందేనని భాజపా రాష్ట్ర ఫైనాన్స్ కమిటీ కన్వీనర్ సిహెచ్ రామకోటయ్య అనడాన్ని తప్పు పడుతున్నారు టీడీపీ నేతలు.

ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకోవడం పాదయాత్రల లక్ష్యంగా భాజపా భావిస్తోందని రామకోటయ్య అనడం తెలిసిందే. 1994లో రాష్ట్రంలో మొదటిసారిగా భారతీయ జనతాపార్టీ అయిదుగురు సభ్యుల బృందంతో పాదయాత్ర చేపట్టిందని... పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలకం రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఈ అయిదుగురు సభ్యుల బృందం ‘నీటికోసం - శాంతికోసం’ అనే నినాదం తో రాష్ట్రంలో 52 రోజులు పర్యటించి 1200 కి.మీ మేరకు పాదయాత్ర చేసిందని చెప్పిన ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా రాష్ట్రంలో పాదయాత్ర చేసి భాజపా స్ఫూర్తితోనే తాను పాదయాత్ర చేసినట్లు చెప్పారన్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు కూడా పాదయాత్ర చేశారని గుర్తు చేశారు.

అక్కడితో ఆగని ఆయన ఎవరు పాదయాత్ర చేసినా ఆ సందర్భంగా గుర్తించిన సమస్యలను తెలుసుకుని పరిష్కరించేలా అధికార పక్షం ఉండాలని సూచించారు. ఈ మాట టీడీపీ నేతలకు తెగ బాధపెడుతోందట. ఏపీ బీజేపీలోని కీలక నేతలు ఇంతవరకు నేరుగా బయటపడకపోయినా వారికి కూడా జగన్ పాదయాత్రపై మంచి అభిప్రాయమే ఉందని... అందుకే రామకోటయ్య నోటి నుంచి అంత డైరెక్టుగా, పార్టీ అభిప్రాయంలా వ్యాఖ్యలు వెలువడినట్లుగా తెలుస్తోంది.