Begin typing your search above and press return to search.

బీజేపీ...కేసీఆర్...మ‌ధ్య‌లో న‌యీం!

By:  Tupaki Desk   |   2 Jan 2017 7:20 AM GMT
బీజేపీ...కేసీఆర్...మ‌ధ్య‌లో న‌యీం!
X
గ్యాంగ్ స్ట‌ర్ నయీంతో రాజ‌కీయ నాయకుల‌కు సంబంధం లేద‌నే తెలంగాణ రాష్ట్ర అఫిడ‌విట్ నేప‌థ్యంలో విప‌క్షాలు విరుచుకుప‌డుతున్నాయి. రహంతకుడు నయీమ్‌ డైరీని బయటపెట్టాలని సీపీఐ డిమాండ్‌ చేసింది. అప్పుడే నయీమ్‌ తో సంబంధాలున్న రాజకీయ నేతలు - పోలీసు - ఇతర ఉన్నతాధికారుల బండారం బయటపడుతుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. సోహ్రాబుద్దీన్‌ ఎన్‌ కౌంటర్‌ కేసులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాకు ప్రమేయముందనే వార్తలు నిజమో కాదో తేలాలంటే నయీమ్‌ డైరీని బయటపెట్టాల్సిందేనని తెలిపారు. అమిత్‌ షా బండారం బయటపడుతుందనే కారణంతోనే టీఆర్‌ ఎస్‌ సర్కారు ఆ డైరీని బహిర్గతం చేయటం లేదని విమర్శించారు. బీజేపీతో కుమ్మక్కయిన కేసీఆర్‌ ఉద్దేశపూర్వకంగానే ఈ డైరీని తొక్కిపడుతున్నారని చెప్పారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ - బీజేపీకి పరమ భక్తుడైపోయారని చాడ విమర్శించారు. కాషాయ పార్టీతో దోస్తీకోసం కేసీఆర్‌ తహతహలాడుతున్నారని ఎద్దేవా చేశారు. పెద్ద నోట్ల రద్దు చర్యతో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అబాసు పాలయ్యిందని అన్నారు. ప్రధాని తలకాయను కిందికి పెట్టి - కాళ్లను పైకి పెట్టినా మన దేశంలో నగదు రహిత ఆర్థిక వ్యవస్థ సాధ్యం కానేకాదని చాడ వెంక‌ట‌రెడ్డి చెప్పారు. జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని...నగదు కొరత వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఎలా పరిష్కరిస్తారనే విషయాన్ని చెప్పలేదని విమర్శించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఎత్తుగడల్లో భాగంగానే పెద్ద నోట్లను రద్దు చేశారని చాడ ఆరోపించారు. తనను నమ్మి ఓట్లేసిన ప్రజలను నరేంద్రమోడీ నట్టేట ముంచారని చెప్పారు. ఇలాంటి చర్యలన్నింటినీ నిరసిస్తూ మంగళవారం నుంచి దేశవ్యాప్త ఆందోళనలు నిర్వహిస్తామని తెలిపారు.

పెద్ద నోట్ల రద్దు వల్ల ఇప్పటి వరకూ ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు క్యూ లైన్లలో నిలబడాల్సి రావటం వల్ల 125 మంది దాకా ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. దీనికంతటికీ కారణమైన ప్రధాని మోడీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని రామ‌కృష్ణ‌ డిమాండ్‌ చేశారు. విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న రూ.80 లక్షల కోట్ల నల్లడబ్బును వెనక్కి తీసుకురావాలని కోరారు. ఇలాంటి అంశాలపై దృష్టి పెట్టని మోడీ...గంభీరమైన ఉపన్యాసాలు, వాగాడంబరంతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని రామ‌కృష్ణ‌ విమర్శించారు. ఇదే సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు...పెద్ద నోట్ల రద్దుపై 40 రోజుల్లో పలు అబద్ధాలను వల్లెవేశారని, దీంతో ఆయన పేరు గిన్నిస్‌ బుక్కు రికార్డులోకెక్కుతుందని ఎద్దేవా చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/