Begin typing your search above and press return to search.

కేసీఆర్ కు అదిరిపోయే ఐడియా ఇచ్చిన చాడ

By:  Tupaki Desk   |   2 May 2016 6:10 AM GMT
కేసీఆర్ కు అదిరిపోయే ఐడియా ఇచ్చిన చాడ
X
రెండు తెలుగు రాష్ట్రాల్లో దారుణ కరవు పరిస్థితి ఉన్న విషయం తెలిసిందే. వణికిస్తున్న ఈ కరవును ఎదుర్కొనేందుకు వీలుగా తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అంబలి కేంద్రాల్ని కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేశాయి. అయితే.. ఇలాంటి అంబలి కేంద్రాలకు అనుమతి ఇవ్వొద్దంటూ మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లుగా వార్తలు రావటం తెలిసిందే.

అంబలి కేంద్రాల్ని ఏర్పాటు చేసే.. తెలంగాణ రాష్ట్ర ఇమేజ్ దెబ్బ తినే అవకాశం ఉందని.. తిండి లేక ప్రజలు అంబలి తాగుతున్నారన్న సందేశం వెళ్లే ప్రమాదం ఉన్నందున ఇలాంటి అంబలి కేంద్రాలకు అనుమతి ఇవ్వొద్దంటూ కేసీఆర్ అన్నట్లుగా చెబుతున్నారు. కేసీఆర్ చేసిన వాదనకు ఒక అద్భుతమైన ఐడియా ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి. అంబలి కేంద్రాలు ఏర్పాటు చేస్తే తిండి లేక.. ప్రజలు అంబలి తాగుతున్నారన్న చెడ్డ పేరు తెలంగాణ రాష్ట్రానికి వస్తుందని ముఖ్యమంత్రి భావిస్తున్న నేపథ్యంలో.. అంబలి బదులు.. ప్రభుత్వమే ఉచిత భోజనం ఏర్పాటు చేస్తే బాగుంటుంది కదా అని చాడ చెబుతున్నారు.

కరవు రక్కసితో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే వేళ.. వారి ఆకలిని తీర్చేందుకు ప్రభుత్వమే ఉచిత భోజనాన్ని అందిస్తే బాగుంటుంది కదా. ధనిక రాష్ట్రమని తరచూ చెప్పుకునే కేసీఆర్ కు మాటల స్థాయికి తగ్గట్లే చాడ ఇచ్చిన భోజనం ఐడియా బాగుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కరవుతో విలవిలలాడుతున్న పేద ప్రజలకు ఉచిత భోజనం ఏర్పాటు చేసిన ఘనతను కేసీఆర్ సొంతం చేసుకుంటారో లేదో..? పేదోడు ఆకలితో విలవిలలాడుతున్న వేళ.. కడుపు నిండా భోజనం పెట్టాలే కానీ కేసీఆర్ ను అంత తేలిగ్గా పేద ప్రజలు మర్చిపోయే అవకాశం ఉండదు. మరి.. చాడ ఇచ్చిన ఐడియాను కేసీఆర్ అందిపుచ్చుకుంటారా..?