Begin typing your search above and press return to search.

సొంత జిల్లాలో బాబు పని గోవిందా గోవిందా

By:  Tupaki Desk   |   19 Oct 2018 5:36 AM GMT
సొంత జిల్లాలో బాబు పని గోవిందా గోవిందా
X
ఏపీ సీఎం చంద్రబాబు తన సొంత జిల్లాలోనే ఈసారి దారుణంగా దెబ్బతినే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో అక్కడ పేలవమైన ప్రదర్శన చేయబోతుందనడానికి తాజాగా జరుగుతున్న పరిణామాలే ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఇప్పటికే నగరిలో గాలి ముద్దుకృష్ణమనాయుడి కుమారులిద్దరూ కలిసి పనిచేయడం మానేసి నేను పోటీ చేస్తానంటే నేను పోటీ చేస్తానంటూ కొట్టుకుంటున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ గెలుపు ఇప్పటికే ఖాయమైపోయింది.

ఇది చాలదన్నట్లు ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో సిటింగ్ ఎమ్మెల్యే - టీడీపీ నేత సుగుణమ్మ చంద్రబాబు పైన - ఆయన కోటరీ పైనా మండిపడుతున్నారు. చంద్రబాబు పాలనలో ఏపీ అత్యంత అవినీతి రాష్ట్రంగా మారిందంటూ ఇటీవల ఆమె ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆరోపించారు. అందుకు ట్రాన్సపరెన్సీ ఇంటర్నేషనల్ నివేదికను ఆధారంగా కూడా చూపించారు. సొంత పార్టీ పాలనపై ఒక ఎమ్మెల్యే ఆ స్థాయిలో ఆరోపణలు చేయడమంటే వచ్చే ఎన్నికల్లో ఆమె అడుగులు ఎలా ఉండబోతున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు.

ఇక తాజాగా తిరుపతి మాజీ ఎమ్మెల్యే - మాజీ టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి కూడా తెలుగుదేశం పార్టీని వీడారు. ఆయన జనసేనలో చేరారు. చదలవాడ 1999 లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో టిడిపి తరపున తిరుపతి నుండి పోటీ చేసి 15,000 ఓట్ల మెజారిటీ తో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2015 - ఏప్రిల్ 27 న టీటీడీ చైర్మైన్ గా పదవి బాధ్యతలు స్వీకరించారు. ఏప్రిల్ 27 - 2017 న ఆయన పదవి విరమణ చేశారు. తిరుపతి సహా మరికొన్ని నియోజకవర్గాల్లో పట్టున్న చదలవాడ పార్టీని వీడడం తెలుగుదేశం పార్టీకి దెబ్బనే చెప్పాలి. మొత్తానికి సొంత జిల్లాలో చంద్రబాబు ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలుస్తారో చూడాలి.