Begin typing your search above and press return to search.

చంద్రబాబుకే షాకిచ్చిన మండలి ఛైర్మన్

By:  Tupaki Desk   |   25 March 2021 7:30 AM GMT
చంద్రబాబుకే షాకిచ్చిన మండలి ఛైర్మన్
X
అవును మీరు చదివింది కరెక్టే. చంద్రబాబునాయుడుకేంటి శాసనమండలి ఛైర్మన్ ఎంఏ షరీఫ్ షాకివ్వటం ఏమిటి ? అని అనుకుటున్నారా ? ఏం చేస్తాం చంద్రబాబుకు పరిస్దితులు అలా ఎదురుతిరుగుతున్నాయి మరి. ఇంతకీ విషయం ఏమిటంటే చిదిపిరాళ్ళ శివనాధరెడ్డి అనే ఎంఎల్సీ ఉన్నారు. ఈయనపై అనర్హత వేటు వేయించేందుకు టీడీపీ శతవిధాల ప్రయత్నించి ఫెయిలైంది.

పార్టీ విప్ ను ఉల్లంఘించి శివనాధరెడ్డి స్వతంత్రంగా వ్యవహరించారు కాబట్టి ఆయనపై అనర్హత వేటు వేయాలనే డిమాండ్ తో శాసనమండలిలో పార్టీ విప్ బుద్దా వెంకటేశ్వరరావు మండలి ఛైర్మన్ కు చాలాకాలం క్రితం ఓ ఫిర్యాదుచేశారు. అయితే టీడీపీ ఫిర్యాదుపై ఛైర్మన్ షరీఫ్ సభ్యునికి నోటీసిచ్చి విచారణకు రమ్మన్నారు. సభ్యుడు విచారణకు హాజరైనా ఫిర్యాదు చేసిన బుద్దా మాత్రం హాజరుకాలేదు.

ఇదే సమయంలో సభ్యుడు మూడుపాయింట్లు రైజ్ చేశారు. అవేమిటయ్యా అంటే తానసలు టీడీపీ సభ్యుడినే కాను అనేది మొదటిది. ఇక రెండోదేమిటంటే పార్టీ జారీచేసిన విప్ తనకు అందలేదు అనేది. చివరగా మూడోది ఏమిటంటే తనపై పార్టీ ఇచ్చిన అనర్హత ఫిర్యాదు చెల్లదని. సభ్యుని వాదన తర్వాత ఛైర్మన్ అన్నీ విషయాలను పరిశీలించారు. పై మూడు విషయాలు వాస్తవమే అని తేలింది.

విప్ జారీ చేసినట్లు బుద్ధా అసెంబ్లీ కార్యదర్శికి లేఖ ద్వారా చెప్పారే కానీ సభ్యులకు జారీచేసిన విప్ కాపీని కార్యదర్శికి అందచేయలేదు. పైగా సభ్యుడు నేరుగా టీడీపీ తరపున ఎంఎల్సీ కాలేదు. ప్రభుత్వ సిఫారసు ద్వారా గవర్నర్ కోటాలో నామినేట్ అయ్యారు. నామినేట్ అయిన ఆరుమాసాల్లోగా తాను పలానా పార్టీ సభ్యుడిని అని కూడా సదరు ఎంఎల్సీ డిక్లరేషన్ ఇవ్వలేదు. అంటే సాంకేతికంగా సభ్యుడు ఏ పార్టీకి చెందని వ్యక్తి అని నిర్ధారణైంది.

వీటన్నింటికి అదనంగా శివనాధరెడ్డిపై అనర్హత వేటుకు ఫిర్యాదు చేసిన బుద్ధా వెంకన్నకు ఎన్ని నోటీసులిచ్చినా విచారణకు మాత్రం హాజరుకాలేదని సమాచారం. సో సభ్యుడి వాదన ఒకవైపు, బుద్ధా గైర్హాజరు మరోవైపు. అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం బుద్ధా చేసిన ఫిర్యాదును ఛైర్మన్ తోసిపుచ్చారు.