Begin typing your search above and press return to search.

విషం క‌క్కుతున్న ముద్ర‌గ‌డ‌కు ఏడు ప్ర‌శ్న‌లు

By:  Tupaki Desk   |   8 Jan 2017 4:47 PM GMT
విషం క‌క్కుతున్న ముద్ర‌గ‌డ‌కు ఏడు ప్ర‌శ్న‌లు
X
కాపు రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు బ‌హిరంగ లేఖ రాసిన కాపు రిజ‌ర్వేష‌న్ల నాయ‌కుడు ముద్ర‌గ‌డ ప‌ద్మనాభంపై ఏపీ కాపు కార్పొరేషన్ ఛైర్మన్ చలమలశెట్టి రామానుజయ మండిప‌డ్డారు. ఈ ప్రశ్నలకు బదులేది పేరుతో ముద్ర‌గ‌డ‌కు లేఖ రాస్తూ ఏడు ప్ర‌శ్న‌లు సంధించారు. ముద్రగడ పద్మనాభం గారికి నమస్కారం అని పేర్కొంటూ ఇచ్చేవాడిని చూస్తే చచ్చేవాడు కూడా లేచొస్తాడని కానీ మీ వ్యవహారంతో ఇచ్చేవాడిని కూడా ఇవ్వనీయకుండా అడుగడుగునా అడ్డుపడుతూ అందరినీ చావగొడుతున్నారని చ‌ల‌మ‌ల‌శెట్టి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కాపులకు లబ్ది చేకూర్చే పథకాన్ని ప్రభుత్వం చేపట్టిన వెంటనే ఒకవైపు ప్ర‌తిప‌క్ష నేత‌ జగన్, మరోవైపు మీరు పోటాపోటీగా అడ్డుకుంటున్నారని దుయ్య‌బ‌ట్టారు. కాపు సామాజిక వర్గంలో డ్రైవర్లు, క్లీనర్లుగా పనిచేస్తున్న వారందరికీ సొంత వాహనాలు కొనుగోలు చేయించి వారిని యజమానులుగా మార్చే లక్ష్యంతో కాపు కార్పొరేషన్ ముందుకు రావడం జరిగింది. దీని గురించి కాపు - బలిజ - తెలగ - ఒంటరి కులాలలో మంచి స్పందన లభించగానే విద్వేషంతో మరో లేఖ రాశారని మండిప‌డ్డారు.

ముద్ర‌గ‌డకు సంధించిన ఏడు ప్ర‌శ్న‌లు ఇవే

1. అతి సర్వత్రా వర్జయేత్ అంటే అతి చేష్టలు అనర్గానికి దారితీస్తుందనేది వేదవాక్కు - మీ లేఖల పరంపరగాని, అందులోని సారంగాని, వాడుతున్న భాష గాని చూస్తే వేదవాక్కును తలపించడం ఖాయం.

2. మీ తాజా లేఖలో మీరు వాడిన భాష అచ్చం జగన్ భాష లాగా లేదా?

3. రాజధానిపై జగన్ వెళ్ళగక్కే విషానికి మీ లేఖలో మీరు వెదజల్లిన విషానికి ఏమన్నా తేడా ఉందా?

4.వేలాదిమంది యువతకు ఉపాధి కల్పించే బందరుపోర్టు, పరిశ్రమలపై మీ దాడికి జగన్ చేస్తున్న దాడికి నలుసంతైనా తేడా వున్నదా?

5.బందరు పోర్టు వస్తే ఎక్కువ లబ్దిపొందేది కాపులే కదా? మరి బందరు పోర్టుపై ఎందుకు విషం కక్కుతున్నారు? జగన్‌ను సంతోషపెట్టడానికి కాదా?

6. చావో, బ్రతుకో అంటూ మీరు వ్రాసే భాష ఒడిగడుతున్న చేష్టలు రాష్ట్రంలో అల‌జ‌డులు సృష్టించడానికే కదా? జగన్ కోరుకుంటున్నట్లు పెట్టుబడులను తరిమికొట్టడానికే కదా? పొరపాటున నిన్ను నమ్మిన కొద్దిమందిని కేసులు బలిచేయడమే కాదా?

7. మీరు జగన్ పార్టీ ముసుగు నాయకుడివేగాని మొత్తం కాపు, బలిజ, తెలగ, ఒంటరి ప్రతినిధివి కావని గుర్తుంచుకో - కాపు జాతి నిన్ను నమ్మి మరోసారి మోసపోవడానికి సిద్ధంగా లేరని గ్రహిస్తే మిగిలివున్న ఆ కాస్త గౌరవమన్నా మిగులుతుందని తెలుసుకో.

తెలుగుదేశంతోనే ఇప్పటి వరకు కాపులకు మేలు జరిగిందని, భవిష్యత్తులోను మేలు జరుగుతుందని పేర్కొంటూ ఇది చారిత్రక వాస్తవమ‌ని స్ప‌ష్టం చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/