Begin typing your search above and press return to search.

పీకేకు హ్యాండ్‌!... టీడీపీలోకి చ‌ల‌మ‌ల‌శెట్టి!

By:  Tupaki Desk   |   28 Feb 2019 2:58 PM GMT
పీకేకు హ్యాండ్‌!... టీడీపీలోకి చ‌ల‌మ‌ల‌శెట్టి!
X
త‌న‌దైన మార్కు రాజ‌కీయాలు నెర‌పుదామంటూ ఎంట్రీ ఇచ్చిన యువ పారిశ్రామిక‌వేత్త చ‌ల‌మ‌ల‌శెట్టి సునీల్... త‌న సామాజిక వ‌ర్గానికి చెందిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ఝ‌ల‌క్ ఇచ్చార‌నే చెప్పాలి. గ‌డ‌చిన ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీలో చేరిన చ‌ల‌మ‌ల‌శెట్టి... కాకినాడ పార్ల‌మెంటు నుంచి బ‌రిలోకి దిగి టీడీపీ అభ్యర్థికి తోట న‌ర‌సింహానికి చుక్క‌లు చూపించారు. ఎన్నిక‌ల కౌంటింగ్‌లో ఈ స్థానంలో నువ్వా, నేనా అన్న రీతిలో సాగిన చ‌ల‌మ‌ల‌శెట్టి... చివ‌ర‌కు 3,431 ఓట్ల తేడాతో న‌ర‌సింహం చేతిలో ఓట‌మిపాలయ్యారు. అంతకుముందు 2009 ఎన్నిక‌ల్లోనూ ప్ర‌జారాజ్యం పార్టీ త‌ర‌ఫున బ‌రిలోకి దిగిన చ‌ల‌మ‌ల‌శెట్టి... పెద్ద‌గా రాణించిన దాఖ‌లా లేదు. వైసీపీలో చేరిన త‌ర్వాతే.. విజ‌యం దిశ‌గా దూసుకుపోయిన ఆయ‌న టీడీపీ అభ్య‌ర్థికి చుక్క‌లు చూపే స్థాయికి ఎదిగారు.

ఇదంతా గ‌త‌మ‌నుకుంటే... గ‌డ‌చిన ఎన్నిక‌ల త‌ర్వాత వైసీపీలోనే కొంత‌కాలం పాటు కొన‌సాగిన చ‌ల‌మ‌ల‌శెట్టి.. రెండేళ్ల నుంచి పార్టీలో క్రియాశీల‌కంగా లేర‌నే చెప్పాలి. త‌నకు ఎలాగూ కాకినాడ ఎంపీ సీటు ద‌క్కుతుంద‌ని, అలాంట‌ప్పుడు ఆ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని అసెంబ్లీ అభ్య‌ర్థుల ఎంపిక కూడా త‌న‌కే వ‌దిలేయాల‌ని ఓ కొత్త డిమాండ్ పెట్టార‌ట‌. వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ‌ద్ద ఈ త‌ర‌హా య‌త్నాలేమీ సాగ‌క‌పోగా.. జ‌న‌సేన‌లోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. వైసీపీకి దాదాపుగా దూరం జ‌రిగిన చ‌ల‌మ‌ల‌శెట్టి... జ‌న‌సేన‌లో అయితే చేర‌లేదు. అక్క‌డ ఏమైందో తెలియ‌దు గానీ... ఏ పార్టీలో లేకుండానే ఏడాదికి పైగా సైలెంట్ గా ఉన్నారు.

అయితే ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న స‌మ‌యంలో మ‌రోమారు తెర ముందుకు వ‌చ్చిన చ‌ల‌మ‌ల‌శెట్టి... జ‌నసేన‌కు బ‌దులుగా టీడీపీలో చేరిపోయేందుకు సిద్ధ‌మైపోయారు. ఈ మేర‌కు నేటి సాయంత్రం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన సునీల్‌... తాను టీడీపీలో చేరుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా వైసీపీపై విమ‌ర్శ‌లు గుప్పించిన సునీల్‌.. వైసీపీ నాయకత్వ వైఖరి తనకు నచ్చట్లేదని.. తమ మనోభావాలను ఆ పార్టీ దెబ్బతీసిందంటూ ఆరోపించారు. దీంతో తాను రాజకీయాలకు దూరంగా ఉండాలని భావించాన‌ని కూడా ఆయ‌న తెలిపారు. కానీ చంద్రబాబు తనను పిలిచి తనలాంటి వారు రాజకీయాల్లో ఉండాలని చెప్పడంతో టీడీపీలో చేరుతున్నానని సునీల్‌ ప్రకటించారు.