Begin typing your search above and press return to search.

50 లక్షలు తీసుకున్నారు, జనసేనపై సీపీఐ నేత!

By:  Tupaki Desk   |   24 March 2019 11:09 AM IST
50 లక్షలు తీసుకున్నారు, జనసేనపై సీపీఐ నేత!
X
విజయవాడ ఎంపీ టికెట్ ను ముందు సీపీఐకి కేటాయించిన జనసేన, ఆ తర్వాత తన అభ్యర్థిని ప్రకటించడం వివాదాస్పదంగా మారుతూ ఉంది. కమ్యూనిస్టు పార్టీలతో జనసేన పొత్తు అని పవన్ కల్యాణ్ చాలా రోజులుగానే చెబుతూ ఉన్నారు. ఆ మేరకు కమ్యూనిస్టు పార్టీ నేతలు నిత్యం పవన్ వెంట తిరిగారు. సీట్ల ఒప్పందం కోసం వారు గట్టిగా ప్రయత్నించారు. చివరకు పొత్తు ఓకే అయ్యింది.

అలా జనసేన వాళ్లు సీపీఐకి కేటాయించిన సీట్లలో ఇప్పుడు మళ్లీ జనసేన అభ్యర్థులు రంగంలోకి దిగడం విశేషం. విజయవాడ ఎంపీ, నూజివీడు ఎమ్మెల్యే సీట్లను సీపీఐకి కేటాయించారు పవన్.ఇప్పుడు ఆ సీట్లకు జనసేన అభ్యర్థులు రంగంలోకి దిగడం సహజంగానే సీపీఐ వాళ్లకు అసహనాన్ని కలిగిస్తూ ఉంది.

ఈ మేరకు విజయవాడలో సీపీఐ తరఫు నుంచి నామినేషన్ దాఖలు చేసిన చలసాని అజయ్ కుమార్ తీవ్రంగా ధ్వజమెత్తారు. పవన్ కల్యాణ్ తమను అవమానిస్తూ ఉన్నారని, యాభై లక్షల రూపాయలు చేతులు మారాయని, ఆ డబ్బుల ప్రభావంతోనే విజయవాడలో జనసేన పార్టీ అభ్యర్థి తెర మీదకు వచ్చారని ఆయన అంటున్నారు. నూజివీడు సీటును కూడా తమ పార్టీకి కేటాయించి, ఇప్పుడు మళ్లీ జనసేన అభ్యర్థి ఎలా రంగంలోకి దిగుతారు? అని ఆయన ప్రశ్నించారు.

ఏదేమైనా నోరు తెరిస్తే నీతులు చెప్పే పవన్ కల్యాణ్ కు ఇది ఇబ్బందికరమైన పరిణామమే. కమ్యూనిస్టు పార్టీలకు అంటూ ఏవో కొన్ని సీట్లను కేటాయించి, ఇప్పుడు అక్కడ మళ్లీ తన పార్టీ వాళ్లను పోటీలో పెట్టడం వివాదంగా మారుతోంది. వెనుకటికి చంద్రబాబు నాయుడు కూడా ఇలా పొత్తు అంటూ కొన్ని సీట్లను వేరే పార్టీలకు ఇచ్చి మళ్లీ తన పార్టీ వాళ్లను పోటీలో పెట్టేవారు. ఇప్పుడు పవన్ తీరు కూడా అలాగే కనిపిస్తోంది. దీనిపై జనసేన ఎలా స్సందిస్తుందో!