Begin typing your search above and press return to search.

బాబు మాట‌లు అబ‌ద్ద‌మ‌న్న‌ మేధావి!

By:  Tupaki Desk   |   20 Aug 2016 5:07 AM GMT
బాబు మాట‌లు అబ‌ద్ద‌మ‌న్న‌ మేధావి!
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కు ప్ర‌త్యేక హోదా అంశం ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడును తీవ్రంగా ఇరుకున ప‌డేస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. స్పెష‌ల్ స్టేట‌స్ కేంద్రంగా ఏపీ సీఎం చంద్ర‌బాబుపై దునుమాడుతున్న వైసీపీ తాజాగా తీవ్ర విమ‌ర్శ‌లు చేసింది. రాష్ట్ర హక్కుల కోసం పోరాడాల్సిన ముఖ్యమంత్రి బిచ్చగాడిలా వ్యవహరిస్తూ ఏపీ ఆత్మ‌గౌర‌వాన్ని కేంద్రం వద్ద తాకట్టుపెడుతున్నారని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్రంగా మండిప‌డ్డారు. కేంద్రంలో భాగస్వామిగా ఉండి కూడా విభజన చట్టంలోని హామీలను సాధించడంలో విఫలమయ్యారని త‌ప్పుప‌ట్టారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటినా - కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు కాకమ్మ కథలు చెబుతూ కాలక్షేపం చేస్తున్నాయని అంబ‌టి ధ్వజమెత్తారు.

ఏపీకి ప్ర‌త్యేక రాజధాని - పోలవరం నిర్మాణం హామీలు ఏమయ్యాయని అంబ‌టి రాంబాబు ప్రశ్నించారు. విభజన హామీలు, ఎన్నికల వాగానాలూ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే చందంగా ఉందని ఆక్షేపించారు. కేంద్రం ప్రకటించిన రూ. 1976 కోట్ల సాయం చూసి సంతోషపడాలో - బాధపడాలో అర్థంకావడం లేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు కేంద్రంలో భాగస్వామిలా కాకుండా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నట్లు మాట్లాడుతూ నటిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇంత‌కీ బాబు ఒత్తిడి చేయ‌గ‌ల‌రా లేక‌పోతే న‌టించ‌గ‌లరా అనేది ఆయ‌న‌కైనా క్లారిటీ ఉందా లేదా అని అంబ‌టి వ్యాఖ్యానించారు.

మ‌రోవైపు ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు - ఆంధ్రా మేధావుల ఫోరం నాయ‌కుడు చలసాని శ్రీనివాస్ సైతం చంద్ర‌బాబుకు హిత‌వు ప‌లికారు. విశాఖ జిల్లా అనకాపల్లిలోని జరిగిన 'ప్రత్యేక హోదాపై ప్రజాగర్జన'కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ - రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం అని ఎన్నికల్లో చెప్పిన బీజేపీ.. ప్రత్యేక ప్యాకేజీని తెరపైకి తీసుకురావడం శోచనీయమన్నారు. కేంద్ర ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు ఎందుకు మౌనం వహిస్తున్నారో సమాధానం చెప్పాలని చ‌లసాని ప్రశ్నించారు. కేంద్రంలో తమ మంత్రులు కొనసాగితేనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా - నిధులు వస్తాయని కల్లబొల్లి మాటలను సీఎం చెబుతున్నారని విమర్శించారు. ప్రజలను మోసం చేయడం మాని ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్న వారితో కలిసి పని చేయాలని చంద్రబాబు ఆయ‌న‌ హితవు చెప్పారు. ప్రత్యేక హోదాతో పరిశ్రమలు ఏర్పడి యువతకు ఉపాధి లభిస్తుందని చ‌ల‌సాని తెలిపారు.