Begin typing your search above and press return to search.

ఏపీ అవినీతిలో బీజేపీకి వాటా ఉంద‌ట‌

By:  Tupaki Desk   |   26 Jun 2018 10:40 AM GMT
ఏపీ అవినీతిలో బీజేపీకి వాటా ఉంద‌ట‌
X
దాదాపు నాలుగేళ్ల వ‌రకూ మిత్రులుగా ఉన్న టీడీపీ.. బీజేపీల మ‌ధ్య బంధం బ‌ద్ధ‌లైపోవ‌టం.. ఒక‌రిపై ఒక‌రు తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డుతున్న వైనం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. నిన్న‌టి వ‌ర‌కూ మిత్రులుగా భుజాలు.. భుజాలు రాసుకుపూసుకు తిరిగిన వారే.. నేడు ఒక‌రి త‌ప్పుల్ని మ‌రొక‌రు ఎత్తి చూపించుకుంటున్న వైనం చూసిన‌ప్పుడు దొంగ‌లు.. దొంగ‌లు ఊళ్లు పంచుకున్న సామెత గుర్తుకు రాక మాన‌దు.

త‌ప్పులు చేసిన‌ప్పుడు ఎవ‌రైనా స‌రే వేలెత్తి చూపించి.. క‌డిగి పారేయాలి. ప్ర‌జా సంక్షేమ‌మే ముఖ్య‌మ‌ని భావించిన‌ప్పుడు త‌ప్ప‌నిస‌రిగా చేయాల్సిన ప‌నిని చేయ‌కుండా.. అప్ప‌టికి కామ్ గా ఉండిపోయి.. లెక్క‌లు తేడా వ‌చ్చినంత‌నే ఎన్ని ఘోరాలు జ‌రిగిపోయాయో తెలుసా? అంటూ గుండెలు బాదుకోవ‌టం స‌మంజ‌సం కాదు.

ప్ర‌స్తుతం ఏపీలో బీజేపీ వ్య‌వ‌హ‌రిస్తున్న వైఖ‌రి ఇదే రీతిలో ఉంది. అదే స‌మ‌యంలో కేంద్రం త‌మ‌ను అన్యాయం చేసింద‌ని.. ద్రోహం చేసిందంటూ టీడీపీ నేత‌లు విరుచుకుప‌డ‌టం కూడా స‌బ‌బు కాదు. ఇచ్చేవాళ్లు అయితే ఏడాది లేదంటే రెండేళ్లు చూస్తే అర్థ‌మైపోతుంది. ఒక‌వైపు మోడీ స‌ర్కారు ఏపీకి చేసేదేమీ లేద‌న్న విష‌యంపై ప్ర‌జ‌ల‌కు క్లారిటీ వ‌చ్చినా.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మాత్రం ఆశ‌తో ఎదురుచూసిన‌ట్లుగా.. ఓపిగ్గా అవ‌మానాల్ని భ‌రించిన‌ట్లుగా చేస్తున్న‌దంతా క‌వ‌రింగ్ సంభాష‌ణ‌గా చెప్ప‌క త‌ప్ప‌దు.

ఒక‌వేళ‌.. తామెంత ప్ర‌య‌త్నించినా కేంద్రం నుంచి సానుకూల స్పంద‌న లేని ప‌క్షంలో.. ఆ విష‌యాన్ని ప‌రోక్షంగా అయినా చెప్పే వీలుంది. కానీ.. అలాంటిదేమీ చెప్ప‌కుండా హోదా కాడిని వ‌దిలేసి.. ప్యాకేజీ మీద మ‌క్కువ ప్ర‌ద‌ర్శించిన బాబు ఇప్పుడు ఏపీకి మోడీ దారుణ‌మైన మోసం చేసిన‌ట్లుగా గుండెలు బాదేసుకోవ‌టంలో అర్థం లేదు. ఎందుకంటే.. ఏపీకి మోడీ హ్యాండ్ ఇస్తున్నార‌న్న విష‌యం రాష్ట్రంలోని చిన్న పిల్లోడికి సైతం అర్థ‌మ‌య్యాక కూడా బాబుకు చాలా కాలం అర్థం కాక‌పోవ‌టాన్ని మ‌ర్చిపోకూడ‌దు.

ఏపీలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల్లో అంతులేని అవినీతి జ‌రుగుతోంద‌ని ఆరోపించిన బీజేపీ నేత‌ల మాట‌ల్ని లెక్క‌లోకి తీసుకోవాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే.. అవినీతి జ‌ర‌గ‌టం ఎంత వాస్త‌వ‌మో.. దాని గురించి తెలిసి కూడా మౌనంగా ఉన్న బీజేపీ నేత‌లు ఏపీ ప్ర‌జ‌ల‌కు చేయాల్సిన ద్రోహాన్ని మొహ‌మాటం లేకుండా చేశార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇదే విష‌యాన్ని చెబుతూ.. ఏపీ మేధావుల సంఘం అధ్య‌క్షుడు చ‌ల‌సాని శ్రీ‌నివాస్ తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు.

మూడేళ్లుకు పైనే ఏపీ ప్ర‌భుత్వంలో భాగ‌స్వామిగా ఉండి.. ఇప్పుడు అవినీతి ఆరోప‌ణ‌లు చేయ‌టం విడ్డూరంగా ఉంద‌న్న ఆయ‌న‌.. ప్రాజెక్టుల్లో అవినీతి జ‌రిగి ఉంటే.. అందులో బీజేపీకి వాటా ఉన్న‌ట్లేన‌ని ఆరోపించారు. ఏపీకి అన్యాయం జ‌రిగితే చూస్తూ ఊరుకోమ‌న్న ఆయ‌న‌.. క‌డ‌ప ఉక్కు క‌ర్మాగారం కోసం ఈ నెల 29న బంద్‌న‌కు పిలుపునివ్వాల‌న్నారు.టీడీపీ.. బీజేపీల వైఖ‌రిపై ఆయ‌న తీవ్రంగా మండిప‌డ్డారు.