Begin typing your search above and press return to search.

బాబు ఢిల్లీకి వెళ్లేది అడుక్కోవ‌డానికే!

By:  Tupaki Desk   |   10 Feb 2017 4:49 AM GMT
బాబు ఢిల్లీకి వెళ్లేది అడుక్కోవ‌డానికే!
X
"ఆంధ్రుడు ఢిల్లీకి వెళ్లాడంటే త‌న హక్కుల కోసం గ‌ళం వినిపించేందుకే. కానీ మన ముఖ్యమంత్రి చంద్ర‌బాబు అడుక్కోవడం కోసం వెళుతూ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెడుతున్నాడు. పునర్విభజన చట్టంలో ఏ ఒక్క అంశం అమలు చేయని కేంద్ర ప్రభుత్వాన్ని మన నేతలు నిలదీయకుండా లాలూచీ పడటం దుర్మార్గం" అని విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు, ఏపీ మేథావుల సంఘం అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. స‌మితి ఆధ్వర్యాన విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ విగ్రహం మూడు రోజుల వద్ద 'ఆంధ్రుల హక్కుల ఆత్మగౌరవ దీక్షలు' ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ...."ఎన్నికల ముందు ఐదు కాదు పదేళ్ల పాటు ప్ర‌త్యేక హోదా కావాలన్న రాష్ట్ర నేతలు ఇపుడు మాట తప్పి రాష్ట్రానికి మోసం చేస్తున్నారు. ప్రత్యేక హోదా కన్నా ప్యాకేజీనే కోరుకోవడం ఎంతవరకు సమంజసం? విశాఖ ఉక్కుకోసం నాడు దిక్కులు పిక్కటిల్లేలా ఈ ప్రాంత ప్రజలు ఉద్యమించారు. అల్లూరి సీతారామారాజు, ఆంధ్రకేసరి టంగుటూరి ప్ర‌కాశం వంటి ఎంతోమంది ఈ ప్రాంత పోరాటాలకు స్పూర్తి. అదే స్పూర్తితో ముందుకు సాగాలి. అధికారం చేపట్టి మూడేళ్ళు అయినా ఇప్పటి వరకు ఎంతవరకు నిరుద్యోగులకు ఉద్యోగాలా కల్పించారో చెప్పాలి. అందుకే రాష్ట్రం కోసం మ‌నం ముందుకు క‌ద‌లాలి. విద్యార్ధుల భవిష్యత్ కోసం అన్ని తరగతుల ప్రజలు హోదా ఉద్యమంలో పాల్గొనాలి. ప్రత్యేక హోదా పన్ను రాయితీలతో పరిశ్రమలు ఏర్పడితేనే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. అందుకే రాజకీయాలకతీతంగా అన్ని పార్టీల నాయకులు, హోదా ఉద్యమంలో పాల్గొనాలని లేకుంటే రాష్ట్రానికి దోహదం చేసినవారు అవుతారు. జెండాను వదిలి రాష్ట్ర అభివృద్దే ఎ జెండా కోసం పార్టీలకతీతంగా పోరాటం చేస్తేనే ప్రత్యేక హోదా సాధ్యపడుతుంది. ప్రత్యేక హోదా కోసం ప్రధాని ఇంటి ముందు ధర్నా చేయాలి" అని చ‌ల‌సాని శ్రీ‌నివాస్ పిలుపునిచ్చారు.

ఈ సంద‌ర్భంగా ఏపీకి రాయితీలతో కూడిన ప్రత్యేక హోదా సాధించేవరకూ ఉద్యమం ఆగదని పలువురు మేథావులు, రాజకీయ నేతలు స్పష్టం చేశారు. ప్రముఖ స్వాతంత్య్ర పోరాట యోధులు, మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు వంశానికి చెందిన గొట్టెముక్కల వెంకట సత్యనారాయణరాజు తొలిరోజు దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా వామ‌ప‌క్షాల నేత‌లు మాట్లాడుతూ సీఐఐ వంటి సదస్సుల వల్ల పరిశ్రమలు రావని, హోదా వస్తేనే పరిశ్రమలు వస్తాయని తెలిపారు. ఉత్తరాఖండ్‌కు హోదా కల్పించడం వల్ల ఆరు రెట్లు అధికంగా పరిశ్రమలు వచ్చాయన్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌, లోక్ స‌త్తా, వామ‌ప‌క్షాలు, వివిధ విద్యార్థి సంఘాల నేత‌లు ఈ దీక్ష‌లో పాల్గొన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/