Begin typing your search above and press return to search.

హోదాకు మ‌ద్ద‌తివ్వ‌క‌పోతే...తెలుగువారు కానట్లే

By:  Tupaki Desk   |   7 Feb 2017 5:17 AM GMT
హోదాకు మ‌ద్ద‌తివ్వ‌క‌పోతే...తెలుగువారు కానట్లే
X
ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు ఏపీ ప్ర‌భుత్వంపై మండిప‌డ్డారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం ప్ర‌జాస్వామ్య‌యుతంగా సాగుతున్న ఆందోళ‌న‌లు, ఉద్య‌మ రూపాల‌ను ప్ర‌భుత్వం అణిచివేస్తోంద‌ని మండిప‌డ్డారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడుతూ విశాఖలోని ఆర్కే బీచ్‌లో నిరసన శిబిరం కోసం గత నెల 26 నుంచి మూడు రోజులు మినహా ఏ రోజైనా అనుమతి ఇస్తానని చెప్పిన డీజీపీ సాంబ‌శివ‌రావు ఇపుడు అనుమతి నిరాకరిస్తున్నారని తెలిపారు. డీజీపీ స్థాయిలో ఉన్న వ్య‌క్తి చెప్పిన మాటకే విశ్వసనీయత లేకపోతే ఇక ఎవరికి చెప్పుకోవాలని చలసాని ప్రశ్నించారు. అయిన‌ప్ప‌టికీ విశాఖ‌ బీచ్‌ రోడ్డులో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద అల్లూరి మేనల్లునితో కలిసి రిలే దీక్షలు చేపడుతున్నామన్నారు. ఈ మేరకు 9వ తేదీ నుంచి రిలే దీక్షలు కొన‌సాగుతాయ‌ని ప్ర‌క‌టించారు. నిజమైన తెలుగు వాళ్లయితే అన్ని పార్టీలు హోదా, ప్రత్యేక ప్యాకేజీలు, విభజన హామీలను సాధించడానికి చేసే ఉద్యమంలో ముందుండాలని కోరుతున్నామని చ‌ల‌సాని అన్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు స్పెష‌ల్ స్టేట‌స్ సాధించడానికి అన్ని పార్టీలు రాజకీయాలకు అతీతంగా ఐక్య ఉద్యమానికి ఏకతాటిపైకి రావాలని చ‌ల‌సాని శ్రీ‌నివాస్‌ కోరారు. ప్రత్యేక హోదా ఉద్యమంలో ఎవరిదారి వారిదే అయితే పాలకులు పట్టించుకునే పరిస్థితి ఉండదన్నారు. వైసీపీ-వామపక్షాలు-జనసేన- అమ్ ఆద్మీ తదితర అన్ని పార్టీలు, సంస్థలు ఏకమై ఉద్యమించాలన్నారు. అవసరమైతే తాను తప్పుకుంటానని, వేరొకరికి బాధ్యతలు అప్పగించి ఉద్యమాన్ని ముందుకు నడిపించాలని చ‌ల‌సాని అన్నారు. కేంద్ర మంత్రి సుజనా చౌదరి 15 రోజుల్లో కేబినెట్ ఆమోదంతో చట్టబద్ధత సాధిస్తామనడం చాలా సంతోషమని, అయితే ఇది దేనికోసమో అర్ధం కావడం లేదన్నారు. పోలవరం చట్టం ప్రకారం నూటికి నూరు శాతం నిధులు ఇవ్వాలని ఉందని, అయితే 16వేల కోట్లకు అంగీకరిస్తే ఆఖరికి విడుదలయ్యేది కేవలం రూ.3వేల కోట్లేనని, దీనికి చట్టబద్ధత సాధిస్తారా అని చ‌ల‌సాని ప్రశ్నించారు. చట్టబద్ధత అంటూ చాలా దుర్మార్గానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. చట్టబద్ధంగా వచ్చే నిధులను అడ్డుకునేందుకు చేస్తున్న ప్రయత్నంగా ఉందని ఆరోపించారు. రాయలసీమ, ఉత్తరాంధ్రా జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీలకు రూ.50 కోట్లతోనే సరిపెట్టడం ఎంతవరకు సమంజమో ఆలోచించాలని చ‌ల‌సాని ప్ర‌శ్నించారు. అలాంట‌పుడు హోదా అడిగినవాళ్ళంతా అజ్ఞానులా అని నిల‌దీశారు. ఆ లెక్క‌న గ‌తంలో ప్ర‌త్యేక హోదా పది సంవత్సరాలు ఇవ్వాల‌ని ఒక‌రు, పదిహేను సంవత్సరాలు అని ఇంకొక‌రు అన్నరాని ప‌రోక్షంగా ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంక‌య్య నాయుడును ప్ర‌స్తావిస్తూ వాళ్ళంతా అజ్ఞానులేనా అని ప్రశ్నించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/