Begin typing your search above and press return to search.

ఆంధ్రా మేధావిని ఉక్కిరిబిక్కిరి చేసిన ఏపీ ప్రజలు

By:  Tupaki Desk   |   7 Jun 2017 7:30 AM GMT
ఆంధ్రా మేధావిని ఉక్కిరిబిక్కిరి చేసిన ఏపీ ప్రజలు
X
వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక అసెంబ్లీ వర్షపు నీటిలో చిక్కుకోవడం, విపక్ష నేత వైఎస్ జగన్‌ చాంబర్ లోకి నీరు రావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ చానల్ చర్చావేదిక నిర్వహించగా అందులో పాల్గొన్న ఏపీ మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ వ్యక్తం చేసిన అభిప్రాయాలపై ప్రజలు మండిపడ్డారు. అసెంబ్లీలో వర్షపు నీటి లీకేజ్ పెద్ద విషయమేమి కాదని చలసాని శ్రీనివాస్ అనడంపై అందరి నుంచీ అభ్యంతరం వ్యక్తమైంది. నీళ్లు కారడం... జగన్ చాంబర్లోకి నీరు రావడం పెద్ద విషయమేమీ కాదని, సచివాలయం వద్ద సందర్శకుల కోసం కనీస ఏర్పాట్లు లేకపోవడమే పెద్ద సమస్యని ఆయన అభిప్రాయపడ్డారు.

ఎంతో ఖర్చు పెట్టి కట్టినా సందర్శకులను ఎప్పుడు కూలిపోతుందో తెలియని టెంట్లలో కూర్చోబెడుతున్నారని విమర్శించారు. వాటర్ లీకేజ్‌ ను మాత్రం పెద్ద విషయం కాదని పదేపదే ఆయన చెప్పడంతో చర్చలో పాల్గొన్న వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తంచేశారు. కానీ... చలసాని మాత్రం భవనాలు బాగానే ఉన్నాయంటూ ప్రభుత్వాన్ని సమర్థించుకుంటూ వచ్చారు. ఈలోగా చర్చా కార్యక్రమానికి ఫోన్ చేసిన కాలర్లు చలసాని వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అన్ని వేల కోట్లు పెట్టి కట్టిన అసెంబ్లీ చిన్నపాటి వర్షానికే కారుతుంటే అది పెద్ద విషయం కాదని మేధావి చలసాని ఎలా అంటారని ఒక కాలర్ ప్రశ్నించారు. అసలు విషయాన్ని పక్కదారి పట్టించి.. సందర్శకుల టెంట్ల అంశాన్ని చలసాని తెరపైకి తెస్తున్నారని కాలర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అతేకాదు... చదరపు అడుగుకు 10వేలు తీసుకుని కట్టిన భవనం కారుతుంటే దాన్ని చిన్నవిషయమని చలసాని శ్రీనివాస్ చెప్పడం ఆశ్చర్యంగా ఉందని ఒక బిల్డర్ ఫోన్‌ లైన్లో విమర్శించారు. ఇలా కాలర్స్ వరుసగా నిలదీయడంతో ఒకదశలో చలసాని శ్రీనివాస్ అసహనానికి గురయ్యారు. అయినా అసెంబ్లీలో వర్షపు నీరు చొరబడడం చిన్న విషయంగా తేల్చిన మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌ పై ఏపీ ప్రజలు మండిపడడం కనిపించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/