Begin typing your search above and press return to search.
ప్రత్యేక హోదా ఉత్తరాది దారుల మూసివేత..సాధ్యమేనా?
By: Tupaki Desk | 13 April 2018 7:30 PM GMTప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ సంచలన వ్యూహాన్ని బయటపెట్టారు. అయితే, ఆ వ్యూహం వినడానికి గొప్పగా ఉన్నప్పటికీ సాధ్యాసాధ్యాలే కష్టమన్న అభిప్రాయం వినిపిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ తీరు మారకపోతే దక్షిణ భారతదేశంలోని తెలుగు ప్రజలందరినీ కూడగట్టి ఉత్తర భారత దేశానికి వెళ్లే రహదారులను మూసివేస్తామని ఆయన హెచ్చరించారు. ప్రత్యేక హోదా ఉద్యమ ప్రభావం దేశంపై పడేలా చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి ఇది మంచి వ్యూహమే అయినప్పటికీ ఎంతవరకు సక్సెస్ అవుతుందన్నదే అనుమానం. ముఖ్యంగా విభజన తరువాత ఏపీకి ఉత్తరాదితో సరిహద్దుల్లేవిప్పుడు. ఉన్నదంతా దక్షిణాదికి చెందిన పొరుగురాష్ట్రాలు - తూర్పు రాష్ట్రాలతో సరిహద్దు మాత్రమే. ఈ క్రమంలో చలసాని వ్యూహం అమలుకావాలంటే ఉత్తరాది ముఖద్వారమైన మహారాష్ర్టతో సరిహద్దు ఉన్న తెలంగాణ - కర్ణాటక రాష్ట్రాల పూర్తి సహకారం కచ్చితంగా అవసరం. అలాగే చత్తీస్ గఢ్ మీదుగా ఉత్తరాదిలోకి వెళ్లకుండా చేయాలన్నా కూడా తెలంగాణ అవసరం ఉంటుంది. ఈ రెండు రాష్ట్రాలు కూడా కేంద్రంతో తలపడుతున్నప్పటికీ ఈ విషయంలో ఎంతవరకు సహకరిస్తాయన్నది చెప్పలేం.
ఇక మిగిలి ఉన్నది ఒడిశా మీదుగా జార్ఖండ్ - చత్తీస్ గఢ్ రాష్ట్రాలు దాటి ఉత్తరాదిలోకి వెళ్లకుండా ఒడిశా సరిహద్దుల్లోని రోడ్లను దిగ్బంధించడం మాత్రమే వీలవుతుంది. దీనివల్ల తూర్పున పశ్చిమ బెంగాల్ తో పాటు ఈశాన్య రాష్ట్రాలకు ఇబ్బంది ఎదురవుతుంది.
అయితే... ఈ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందన్నది పక్కనపెడితే హోదా కోసం ఏమైనా చేయాలన్న ఉద్దేశం మాత్రం ఇందులో బలంగా కనిపిస్తోంది. ఏపీలోని అధికార పార్టీ చేష్టలుడిగి చూస్తున్న వేళ ఉద్యమకారులు వ్యూహ రచనలో మునగడం మంచి పరిణామమే.