Begin typing your search above and press return to search.

హోదా కోసం మేధావి మూడు రోజుల దీక్ష‌

By:  Tupaki Desk   |   29 Jan 2017 10:17 AM GMT
హోదా కోసం మేధావి మూడు రోజుల దీక్ష‌
X

ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా కోసం దీక్ష చేప‌ట్ట‌నున్న‌ట్లు ఆంధ్రా మేధావుల ఫోరం నాయ‌కుడు చలసాని శ్రీనివాస్‌ తెలిపారు. ఫిబ్రవరి 9 - 10 - 11 తేదీల్లో విశాఖ‌ బీచ్‌ లో దీక్షలు చేపడతామని ఆయ‌న వివ‌రించారు. గత రెండేళ్లుగా ప్రత్యేక హోదా కోసం అవిరామంగా పోరాటం చేస్తున్నామని చ‌ల‌సాని శ్రీ‌నివాస్ చెప్పారు. ఈ నెల 26న హోదా ఉద్యమానికి యువత సన్నద్ధమైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధాలకు పూనుకుందని విమర్శించారు. అందుకే ప్ర‌జాస్వామ్య‌యుతంగా మ‌రోమారు గ‌ళం విప్పేందుకు మూడు రోజుల దీక్ష చేప‌ట్ట‌నున్న‌ట్లు వివ‌రించారు.

ఇదిలాఉండ‌గా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని నిరసనలు తెలిపే ప్రతిపక్షాల నోరు నొక్కేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించడం సరికాదని కేంద్ర మాజీ మంత్రి - కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు కిల్లి కృపారాణి పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఆమె మీడియాతో మాట్లాడారు. పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పోలీస్‌స్టేషన్లను తెలుగుదేశం పార్టీ కార్యాలయాలుగా మార్చేశారని విమర్శించారు. ప్రత్యేకహోదాను ప్యాకేజీతో ముడిపెట్టడం తగదని కృపారాణి అన్నారు. ఏపీ మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షులు సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ....ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అవహేళన చేసిన కేంద్ర మంత్రి సుజనాచౌదరి ప్రజలకు వెంటనే క్షమాపణలు చెప్పి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ, టీడీపీ ప్రభుత్వాల వైఖరికి నిరసనగా మహిళా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మశ్రీ మాట్లాడుతూ ప్రజల హక్కులను కాలరాసే విధంగా చంద్రబాబు రాక్షస పాలన సాగుతోందని ధ్వజమె త్తారు. రాజ్యంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులను హరించే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలన ఉందని మండిప‌డ్డారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, ఆ హక్కు సాధన కోసం జనవరి 26 రిపబ్లిక్‌ డే రోజు కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో శాంతియుతంగా చేసిన పోరాటాన్ని అడ్డుకున్న చంద్రబాబు వైఖరిని తప్పుబట్టారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/