Begin typing your search above and press return to search.

కొండా రాక‌తో చ‌ల్లాకు చుక్క‌లే!

By:  Tupaki Desk   |   1 Oct 2018 9:49 AM GMT
కొండా రాక‌తో చ‌ల్లాకు చుక్క‌లే!
X
వ‌రుస‌గా రెండు ఎన్నిక‌ల్లో ఓట‌మి ఎదురైనా కుంగిపోలేదు. తెలంగాణ ఆవిర్భ‌వించాక చాలామంది నేత‌లు టీఆర్ ఎస్‌ లోకి జంప్ అయినా ఆయ‌న మాత్రం మార‌లేదు. టీడీపీలోనే కొన‌సాగారు. ప‌ట్టుద‌ల‌తో ప‌నిచేశారు. పార్టీ క్యాడ‌ర్‌ ను కాపాడుకున్నారు. ఆ పార్టీ టికెట్‌ పైనే పోటీ చేశారు. బ‌ల‌మైన సెంటిమెంట్‌ ను తోసిరాజ‌ని మ‌రీ 2014 ఎన్నిక‌ల్లో గెలుపు బావుటా ఎగ‌రేశారు. ఆయ‌నే.. ప‌ర‌కాల ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారెడ్డి.

ఎన్నిక‌ల అనంత‌రం త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో చ‌ల్లా టీఆర్ ఎస్‌ లో చేరారు. అధికార పార్టీ అందించిన అండ‌తో త‌న నియోజ‌క‌వ‌ర్గంలో మంచి అభివృద్ధి ప‌నులు చేప‌ట్టారు. ప్ర‌జాభిమానాల‌ను మ‌రింతగా చూర‌గొన్నారు. దీంతో ఈ ద‌ఫా కూడా ప‌ర‌కాల నుంచి ఆయ‌నే టీఆర్ ఎస్ త‌ర‌ఫున బ‌రిలో దిగుతార‌ని ప్ర‌జ‌లు విశ్వ‌సించారు. వారి న‌మ్మ‌కాన్ని అధికార పార్టీ వ‌మ్ము చేయ‌లేదు. చ‌ల్లా విజ‌యంపై ఎలాంటి అనుమానం లేక‌పోవ‌డంతో తిరిగి టికెట్‌ ను ఆయ‌న‌కే కేటాయించింది. ప‌ర‌కాల‌లో ఆయ‌న్ను ఢీకొట్టే అభ్య‌ర్థులెవ‌రూ ప్ర‌త్య‌ర్థి పార్టీల్లో లేర‌ని అంచ‌నా వేసింది.

ఇక్క‌డే అనూహ్య మ‌లుపు. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో టీఆర్ ఎస్‌ లో ఉన్న కొండా దంప‌తులు ఇప్పుడు సొంత‌గూడు కాంగ్రెస్‌ కు చేరుకున్నారు. టీఆర్ ఎస్‌ పై యుద్ధం ప్ర‌క‌టించారు. ప‌ర‌కాల‌లో తాను స్వ‌యంగా బ‌రిలో దిగ‌నున్న‌ట్లు కొండా సురేఖ తాజాగా ప్ర‌క‌ట‌న కూడా చేశారు. దీంతో ఒక్క‌సారిగా ప‌ర‌కాల‌లో రాజ‌కీయం వేడెక్కింది. టీఆర్ ఎస్‌ కు ప్ర‌తికూల ప‌వ‌నాలు మొద‌ల‌య్యాయి.

వాస్త‌వానికి ప‌ర‌కాల టికెట్‌ ను కాంగ్రెస్ నుంచి ఇన‌గాల వెంక‌ట్రామిరెడ్డి - అవేలి దామోద‌ర్ ఆశించారు. వారిద్ద‌రిలో ఎవ‌రు పోటీ చేసినా చ‌ల్లాకు విజ‌యం అంత క‌ష్టం కాక‌పోయి ఉండేద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. కొండా రాక‌తో ప‌ర‌కాల రాష్ట్ర ప్ర‌జ‌ల దృష్టిని ఆక‌ర్షిస్తోంద‌ని చెబుతున్నారు. వాస్త‌వానికి కొండా సురేఖ సొంత నియోజ‌క‌వ‌ర్గం ప‌ర‌కాలే. గ‌త ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ త‌ర‌ఫున వ‌రంగ‌ల్ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆమె గెలుపొందినప్ప‌టికీ.. అంత‌కుముందు ప‌ర‌కాల ఎమ్మెల్యేగానే ప‌నిచేశారు.

నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌ర‌కాల‌ - గీసుగొండ‌ - ఆత్మ‌కూరు - సంగెం మండ‌లాల్లో కొండా కుటుంబానికి మంచి ప‌ట్టుంది. కొండా వ‌రంగ‌ల్‌ తూర్పుకు వెళ్లిపోయాక‌.. వారి అనుచ‌ర‌గ‌ణం త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో టీఆర్ ఎస్‌ లోకి వెళ్లింది. ఇప్పుడు కొండా తిరిగి రావ‌డంతో ప‌రిస్థితులు మారుతున్నాయి. పాత మిత్రులు - అనుచ‌ర‌గ‌ణం తిరిగి కొండాతో క‌లుస్తున్నారు. ఇక సురేఖ‌ను ప‌రకాల నియోజ‌క‌వ‌ర్గంలో చాలామంది మ‌హిళ‌లు త‌మ ఇంటి ఆడ‌ప‌డుచుగా చూస్తుంటారు. ఆ కోణంలోనూ చ‌ల్లాపై కొండాకు ఎడ్జ్ ఉంది. ధ‌న‌బ‌లంలోనూ కొండాకు సాటిలేదు. కాబట్టి ఈ ద‌ఫా ప‌ర‌కాల‌లో హోరాహోరీ త‌ప్ప‌ద‌ని.. చ‌ల్లాకు గెలుపు అంత ఈజీ కాబోద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.