Begin typing your search above and press return to search.

ఆ ఫ్యాక్ష‌నిస్ట్‌ ను బాబు ఎమ్మెల్సీని చేస్తారా?

By:  Tupaki Desk   |   25 Dec 2017 9:33 AM GMT
ఆ ఫ్యాక్ష‌నిస్ట్‌ ను బాబు ఎమ్మెల్సీని చేస్తారా?
X
చ‌ల్లా రామ‌కృష్ణారెడ్డి పేరు గుర్తుందా? ఎక్క‌డో విన్న‌ట్లుందా? దాదాపు పాతికేళ్ల క్రితం ఆయ‌నో సంచ‌ల‌నం. అది కూడా మామూలుగా కాదు. ఆయ‌న్ను ఇంట‌ర్వ్యూ చేసేందుకు మీడియా వాళ్లు సైతం వ‌ణికిపోయేవారు. ఆయ‌న వ్య‌వ‌హారం చాలా సిత్రం. ఆయ‌న ఊళ్లో ఎవ‌రైనా స‌రే.. ఆయ‌న ఇల్లుండే వీధిలోకి అడుగు పెట్టినంత‌నే కాళ్ల‌కున్న చెప్పుల్ని చేతుల్లో ప‌ట్టుకొని వెళ్లాల్సిందే.

ఒక‌వేళ మ‌ర్చిపోయి చెప్పులు వేసుకొని ఆ వీధిలో న‌డిస్తే.. ఇక అంతే సంగ‌తులు. ఫ్యాక్ష‌నిస్ట్ గా.. హ‌త్యా రాజ‌కీయాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా చ‌ల్ల‌రామ‌కృష్ణారెడ్డి మీద ఉన్న ఆరోప‌ణ‌లు అన్ని ఇన్ని కావు. అయితే.. ఆయ‌న మీద ఆరోప‌ణ‌లు చేసిన వారుఎవ‌రూ.. సాక్ష్యాల‌తో నిరూపించ‌లేరు. అప్పుడెప్పుడో స‌న్ నెట్ వ‌ర్క్ వారి తేజ న్యూస్ లో చ‌ల్లారామ‌కృష్ణా రెడ్డిని ఇప్ప‌టికి టీవీ 9 చీఫ్ ర‌విప్ర‌కాష్ ఓపెన్ ఇంట‌ర్వ్యూ చేయ‌టం.. సంచ‌ల‌నం సృష్టించింది.

ఆ మాట‌కు వ‌స్తే.. చ‌ల్లా పుణ్యంతో ర‌విప్ర‌కాష్‌ కు వ‌చ్చిన పాపులార్టీ అంతా ఇంతా కాదు. ఒక‌ప్పుడు క‌ర్నూలు జిల్లాలోని కోయిల కుంట్ల నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ఆయ‌న మాటే వేదంగా న‌డిచేది. కాద‌న్న వారికి ఊళ్లో ఉండే అవ‌కాశ‌మే ఉండేది కాద‌ని చెబుతారు. త‌న చిత్ర‌మైన మ‌న‌స్తత్వంతో విచిత్రంగా వ్య‌వ‌హ‌రించే చ‌ల్లారామ‌కృష్ణారెడ్డి మంత్రి కావాల‌న్న‌ది జీవితాశ‌యంగా చెబుతారు.

దివంగ‌త మ‌హానేత వైఎస్ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు మంత్రి ప‌ద‌వి కోసం చాలానే ప్ర‌య‌త్నించారు. అయితే.. ఆయ‌న‌పై ఉన్న ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇచ్చేందుకు వైఎస్ ఇష్ట‌ప‌డ‌లేదు. వైఎస్ మ‌ర‌ణం త‌ర్వాత‌.. విభ‌జ‌న ఎపిసోడ్ల నేప‌థ్యంలో టీడీపీలో చేరిన ఆయ‌న ఇప్పుడు ఎమ్మెల్సీ కోసం తెగ ప్ర‌య‌త్నిస్తున్నారు. తాజాగా సీఎం చంద్ర‌బాబును క‌లిసిన ఆయ‌న‌.. త‌న‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇవ్వాల్సిందిగా అభ్య‌ర్థించారు. అయితే.. ఈ విష‌యం మీద బాబు ఎలాంటి హామీ ఇవ్వ‌లేద‌ని చెబుతున్నారు.

ఏపీ సీఎం చంద్ర‌బాబును క‌లిసిన అనంత‌రం మీడియాతో మాట్లాడిన చ‌ల్లా.. త‌న‌కు టికెట్ ఇస్తే పోటీ చేస్తాన‌ని.. ఒక‌వేళ వేరే వారికి టికెట్ ఇస్తే వారిని గెలిపిస్తాన‌ని చెప్పారు. నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో టీడీపీ గెలిచేందుకు తాను చేసిన కృషి అంతా ఇంతా కాద‌న్నారు. పార్టీ కోసం తాను క‌ష్ట‌ప‌డుతున్నాన‌న్న విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. నంద్యాల‌లో పార్టీని గెలిపించి చంద్ర‌బాబుకు కానుక‌గా ఇచ్చాన‌ని చెప్పుకున్నారు. మ‌రి.. ఇంత క‌ష్ట‌ప‌డుతున్న చ‌ల్లాను చంద్ర‌బాబు ఎమ్మెల్సీని చేస్తారా? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.