Begin typing your search above and press return to search.

అగ్ర రాజ్యంలో ఆర్థిక మాంద్యం త‌ప్ప‌దా?

By:  Tupaki Desk   |   11 Oct 2022 7:06 AM GMT
అగ్ర రాజ్యంలో ఆర్థిక మాంద్యం త‌ప్ప‌దా?
X
2020, 2021లో ప్ర‌పంచాన్ని క‌రోనా అత‌లాకుత‌లం చేసింది. చిన్న దేశాల నుంచి పెద్ద దేశాల ఆర్ధిక వ్య‌వ‌స్థ‌ల వ‌ర‌కు క‌రోనా ధాటికి చిన్నాభిన్న‌మ‌య్యాయి. ఇక 2022లో క‌రోనా నుంచి కోలుకుని గాడిన‌పడుతున్న ద‌శ‌లో పులి మీద పుట్ర‌లా ర‌ష్యా - ఉక్రెయిన్ యుద్ధం దాపురించింది. దీంతో అంత‌ర్జాతీయంగా క్రూడాయిల్ ధ‌ర‌లు భ‌గ్గుమ‌న్నాయి. వివిధ దేశాల‌కు చ‌మురు, గోధుమ‌లు, పామాయిల్ ఉత్ప‌త్తులు నిలిచిపోయాయి. రష్యా, ఉక్రెయిన్‌లే పావు శాతం వ‌ర‌కు ప్ర‌పంచ దేశాల‌ గోధుమ‌లు, పామాయిల్ అవ‌స‌రాలు తీరుస్తున్నాయి. ఉక్రెయిన్ - ర‌ష్యా యుద్ధంతో ఈ ఉత్ప‌త్తులు నిలిచిపోయాయి.

ఈ నేప‌థ్యంలో ఆయా దేశాల్లో ద్ర‌వ్యోల్బ‌ణం (నిత్యావ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌ల పెరుగుద‌ల‌) భ‌గ్గుమంది. దీంతో ప్రజల ఆదాయం పడిపోయి ప్రపంచవ్యాప్తంగా వృద్ధి మందగించిందని వేరు వేరు నివేదికలు చెబుతున్నాయి.

దీంతో మ‌రోమారు 2008లో దాపురించిన ఆర్థిక మాంద్యం మాంద్యం భ‌యాలు క‌మ్ముకుంటున్నాయి. ప్ర‌పంచ ఆర్థిక నిపుణులు సైతం ఇదే విష‌యాన్ని హెచ్చ‌రిస్తున్నారు. చివ‌ర‌కు ప్ర‌పంచానికి పెద్ద‌న్నలాగా భావించే అగ్ర రాజ్యం అమెరికాలో కూడా మాంద్యం ముప్పు పొంచి ఉంద‌ని అప్ర‌మ‌త్తం చేస్తున్నారు. చివ‌ర‌కు అమెరికా రిజ‌ర్వ్ బ్యాంక్ అయిన ఫెడ‌ర‌ల్ రిజ‌ర్వ్‌ బ్యాంక్ కూడా త‌మ దేశంలో ఆర్థిక మాంద్యం త‌ప్ప‌ద‌ని స్ప‌ష్టం చేసింది. అంత‌ర్జాతీయ ద్ర‌వ్య‌నిధి సంస్థ (ఐఎంఎఫ్‌) కూడా ఇదే విష‌యాన్ని నొక్కి వ‌క్కాణించింది.

ఈ మాంద్యంతో ప్రపంచ దేశాల జీడీపీ 2026 నాటికి దాదాపు నాలుగు లక్షల కోట్ల డాలర్ల మేరకు తగ్గిపోతోంద‌ని ఐఎంఎఫ్ తెలిపింది. ఆర్ధిక మాంద్యానికి దారితీసే రిస్క్‌ ఎక్కువవుతుందని ఐఎంఎఫ్ అధికారులు చెబుతున్నారు. 2022లో వ‌చ్చే ఆరు నెల‌ల్లోపు అమెరికా ఆర్థిక మాంద్యంలో చిక్కుకుంటుంద‌ని నిపుణులు అంటున్నారు. అయితే ఈ ఏడాది చివరిలోపే అమెరికాలో ఆర్థిక మాంద్యం మొద‌ల‌వుతుంద‌ని మ‌రికొంత‌మంది ఆర్థిక నిపుణులు స్ప‌ష్టం చేస్తున్నారు.

ఇప్పుడు వచ్చే మాంద్యం సామాన్యమైనది కాదని.. దీని తీవ్రత దీర్ఘకాలం ఉంటోంద‌ని అంటున్నారు. మరోవైపు ఈ సంవత్సరం ప్రపంచ జీడీపీ వృద్ధిరేటును కూడా ఐఎంఎఫ్‌ 3.2 శాతానికి కుదించ‌డం గ‌మ‌నార్హం.

ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు వడ్డీరేట్లు పెంచాల్సి రావ‌డం, అభివృద్ధి నెమ్మదించడం, అధిక నిరుద్యోగిత వంటి కార‌ణాల‌తో అమెరికాలో ఆర్థిక మాంద్యం నెలకొనే అవకాశాలు ఉన్నాయ‌ని అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ పేర్కొంది. ఇప్ప‌టికే అమెరికాలో 40 ఏళ్ల గరిష్ఠ స్థాయిలకు ద్ర‌వ్యోల్బ‌ణం చేర‌డం గ‌మ‌నార్హం. దీన్ని నియంత్రించేందుకు కీలక రేట్లను ఫెడర‌ల్ రిజ‌ర్వ్ బ్యాంక్‌ పెంచుతూ వస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఫెడ‌ర‌ల్ రిజ‌ర్వ్ బ్యాంక్‌ ఛైర్మన్‌ పావెల్‌ మాట్లాడుతూ... 'సాఫ్ట్‌ ల్యాండింగ్‌కు అవకాశాలు తక్కువగానే ఉన్నాయని అన్నారు. ఇక్కడ సాప్ట్‌ల్యాండింగ్‌ అంటే.. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే క్రమంలో వృద్ధి నెమ్మదించినప్పటికీ అది ఆర్థిక మ్యాంద్యానికి దారి తీయకుండా చూసుకోవడం. ఆ పరిస్థితి ఏర్పడే అవకాశాలు స‌న్న‌గిల్లుతున్నాయ‌ని పావెల్ చెబుతున్నారు.

2022 ఆగస్టులో 8.3 శాతంగా నమోదైన ద్రవ్యోల్బణాన్ని తిరిగి తాము లక్షిత స్థాయి అయిన 2 శాతానికి తీసుకెళ్లాల్సి ఉందని పావెల్ చెబుతున్నారు. ఇందుకోసం తాము తీసుకునే చర్యల ఫలితంగా ఎలాంటి దుష్ఫలితాలూ చోటుచేసుకూడ‌ద‌నే తాము కోరుకుంటున్నామని ఆయ‌న అంటున్నారు. అమెరికాలో ద్ర‌వ్యోల్బ‌ణాన్ని త‌గ్గించ‌డానికి వడ్డీరేట్లను మరింత పెంచి.. ఈ ఏడాది ఆఖరుకు 4.4 శాతానికి చేరుస్తారనే అంచనాలున్నాయి.

వచ్చే ఏడాదిలోనూ అమెరికాలో వడ్డీరేట్ల పెంపు కొనసాగి 4.6 శాతానికి చేరుతుందని చెబుతున్నారు. 2007 తరవాత అమెరికాలో ఇదే గరిష్ఠం అవుతుందని పేర్కొంటున్నారు. అమెరికాలో కొన్ని నెలల పాటు కనుక నిరుద్యోగిత రేటు 0.5 శాతం చొప్పున పెరిగితే ఆర్థిక మాంద్యం తప్పదని ఆర్థిక వేత్తలు తేల్చిచెబుతున్నారు.

కాగా 2008-09 లో వ‌చ్చిన ఆర్థిక మాంద్యంతో అమెరికాలో ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయారు. దాని బారి నుంచి కోలుకోవడానికి సమయం పట్టింది. ఇప్పుడు మరోసారి రాబోయే ఆర్థిక మాంద్యం ఆ స్థాయిలో ఉంటుందా లేక అంతకంటే ఎక్కువగా ఉంటుందా అనే దాని మీద నిపుణులు స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేక‌పోతున్నారు.

మ‌రోవైపు భార‌త్‌లో మాంద్యం ప్ర‌భావం ఏమీ ఉండ‌ద‌ని నిపుణులు చెబుతుండ‌టం విశేషం. రిజ‌ర్వ్ బ్యాంక్ సైతం ఇటీవ‌ల ఇదే విష‌యాన్ని వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం రూపాయి.. డాల‌ర్‌తో పోలిస్తే ప‌డిపోతోంది. ప్ర‌స్తుతం ఒక అమెరిక‌న్ డాల‌ర్ విలువ 83 ఇండియ‌న్ రూపాయిలుగా ఉంది. అయిన‌ప్ప‌టికీ భార‌త్ ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు వ‌చ్చిన ముప్పేమీ లేద‌ని ఆర్థిక నిపుణులు చెబుతుండ‌టం విశేషం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.