Begin typing your search above and press return to search.

రూ.2వేలు చేతిలో పెడితే.. ఏపీలో ఎక్కడికైనా వెళ్లొచ్చా?

By:  Tupaki Desk   |   2 Jun 2020 5:00 AM GMT
రూ.2వేలు చేతిలో పెడితే.. ఏపీలో ఎక్కడికైనా వెళ్లొచ్చా?
X
లాక్ డౌన్ సడలింపులు పెద్ద ఎత్తున చేపట్టినా.. ఏపీకి వెళ్లే విషయంలో మాత్రం ఇప్పటికి పరిమితులు పెద్ద ఎత్తున ఉంటున్నాయి. ఏపీ ప్రభుత్వం జారీ చేసే స్పందన పాస్ మినహాయిస్తే.. మిగిలిన పాసుల్ని ఆ రాష్ట్ర పోలీసులు నో చెబుతున్నట్లు తెలుస్తోంది. దేశంలోని వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలకు భిన్నంగా ఏపీ తీరు ఉందన్న మాట వినిపిస్తోంది.

లాక్ డౌన్ వేళ వివిధ రాష్ట్రాల్లో చిక్కకుపోయిన ఆంధ్రోళ్లు.. ఇప్పుడు సొంత రాష్ట్రానికి వెళ్లేందుకు కిందా మీదా పడాల్సి వస్తోంది. కనుచూపు మేర పరిస్థితులు చక్కబడే అవకాశం లేకపోవటంతో.. వివిధ రాష్ట్రాల్లో ఉన్న వారు సొంత రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలో ఏపీకి వచ్చేస్తున్న వారి సంఖ్య ఎక్కువ అవుతోంది.

ఇదిలా ఉంటే.. ఏపీలోని వివిధ సరిహద్దుల్లో గందరగోళ పరిస్థితులు ఉండటం గమనార్హం. ఎవరికి వారికి.. వారి సమస్యలు చెప్పుకోవటం.. తమను రాష్ట్రంలోకి అనుమతించాలని ప్రాధేయపడే సీన్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో.. సరిహద్దు చెక్ పోస్టుల వద్ద పెద్ద ఎత్తున వాహనాలు నిలిచి ఉంటున్నాయి. జూన్ ఒకటి నుంచి లాక్ డౌన్ సడలింపు అమల్లోకి రావటంతో వివిధ రాష్ట్రాల నుంచి ఏపీకి వెళ్లిన వారంతా ఇబ్బందులకు గురవుతున్నారు.
ఇలాంటివేళ..కొన్ని చెక్ పోస్టుల వద్ద ఉన్న సిబ్బంది చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నట్లు చెబుతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం చాలా చెక్ పోస్టుల దగ్గర రూ. 2వేలు చేతిలో పెడితే.. వాహనాల్ని వదిలేస్తున్నారని చెబుతున్నారు. ఏపీలోకి రావాలంటే గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల వద్దకు తెలంగాణ నుంచి వచ్చే వారు ఉంటున్నారు. అదే సమయంలో తెలంగాణ నుంచి ఏపీలోకి ప్రవేశించాలంటే క్రిష్ణా జిల్లా గరికపాడు వద్ద మరో చెక్ పోస్టును ఏర్పాటు చేశారు.

కర్ణాటక.. తమిళనాడు నుంచి వచ్చే వారిలో అత్యధికులు చిత్తూరు జిల్లా పలమనేరు మండలం నంగిలి.. సత్యవేడు మండలం రాచకండ్రిగ..మదనపల్లి మండలం చీలకబైలు.. కుప్పం మండలంలోని పలు సరిహద్దు చెక్ పోస్టులు ఉన్నాయి. ఇక్కడ స్థానిక నేతల సిపార్సులు కూడా అమలువుతున్నట్లు చెబుతున్నారు. ఉన్నతాధికారులు వచ్చినప్పుడు మాత్రం నిబంధనల్ని పక్కాగా పాటిస్తున్నట్లు తెలుస్తోంది. ఏమైనా.. ఏపీ ప్రభుత్వ తీరుతో సొంత రాష్ట్రంలోకి అడుగు పెట్టాలన్నా ఎవరో ఒకరికి చేతులు తడపక తప్పట్లేదన్న మాట పెద్ద ఎత్తున వినిపిస్తోంది.