Begin typing your search above and press return to search.

కొచ్చ‌ర్ ఫ్యామిలీలో 'వీడియోకాన్‌' చిచ్చు!

By:  Tupaki Desk   |   4 Oct 2018 11:51 AM GMT
కొచ్చ‌ర్ ఫ్యామిలీలో వీడియోకాన్‌ చిచ్చు!
X
వీడియోకాన్‌ గ్రూప్‌ నకు వేలకోట్ల రుణాలిచ్చి భారీ లబ్ధి పొందారన్న ఆరోపణలతో ఐసీఐసీఐ బ్యాంకు సీఈఓ చందా కొచ్చర్ స‌త‌మ‌త‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. 2012లో వీడియోకాన్‌ సంస్థకు రూ.3,250 కోట్ల రుణం ఇప్పించేందుకు చందా కొచ్చర్ సాయం చేసి క్విడ్ ప్రోకో ద్వారా ప్ర‌తిఫ‌లం పొందార‌ని విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. వీడియోకాన్ గ్రూప్ ఛైర్మన్ వేణుగోపాల్ ధూత్‌, దీపక్ కు చెందిన న్యూపవర్‌ రెన్యువబుల్స్‌ కంపెనీకి ఆమె లాభం చేకూర్చేలా వ్య‌వ‌హ‌రించార‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. వీడియోకాన్ కు రుణం ఇప్పించినందుకు ప్ర‌తిఫ‌లంగా దీప‌క్ కంపెనీలో రూ.64 కోట్లను ధూత్‌ పెట్టుబడిగా పెట్టినట్టు ఆరోప‌ణ‌లున్నాయి. దీనిని క్విడ్‌ ప్రోగా భావించి సీబీఐ విచార‌ణ జ‌రుపుతోంది. ఈ వ్య‌వ‌హారంలో చందా కొచ్చర్‌ పేరును సీబీఐ ప్రస్తావించలేదు. మ‌రోవైపు, క్విడ్ ప్రోకో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటోన్న చందా కొచ్చర్ కు ఐసీఐసీఐ బ్యాంకు డైరక్టర్ల బోర్డు కూడా బాసటగా నిలిచింది. ఈ నేప‌థ్యంలో హ‌ఠాత్తుగా చందా కొచ్చ‌ర్ త‌న ప‌దవికి రాజీనామా చేసి షాకింగ్ నిర్ణ‌యం తీసుకున్నారు.

వీడియోకాన్ రుణ వ్య‌వ‌హారంపై ఐసీఐసీఐ బోర్డు స్వతంత్ర విచారణకు ఆదేశించింది. ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటోన్న చందా కొచ్చ‌ర్ ను... విచారణ జరిగేంత వరకు సెలవులు కూడా మంజూరు చేసింది. కానీ, దీప‌క్ కొచ్చర్ పై ఆరోప‌ణ‌ల‌తో చందా కొచ్చర్ కు కంపెనీలో అనుకూల, వ్య‌తిరేక వ‌ర్గాలు ఏర్ప‌డ్డాయి. ఆమె వ్య‌వ‌హారంలో కంపెనీ బోర్డు రెండుగా చీలిపోయింది. ఆమె రాజీనామా చేయాల‌ని కొంద‌రు డిమాండ్ చేశారు. దీంతో, కొచ్చర్ స్వ‌చ్ఛందంగా రాజీనామాను సమర్పించారు. కానీ, అనారోగ్యం కారణంగా తాను రాజీనామా చేస్తున్నాన‌ని లేఖలో పేర్కొన్నారు.అయితే, కొచ్చర్ రాజీనామాకు కంపెనీ బోర్డు స‌భ్యులు ఆమోదం తెలిపారు. కొచ్చర్ రాజీనామాను నేడు రెగ్యులేటరీ ఫైలింగ్ ద్వారా బీఎస్ఈకి తెలియజేశారు. సందీప్ భక్షీని కొత్త ఎండీ, సీఈవోగా ఐసీఐసీఐ బోర్డు నియమించింది. 2023, అక్టోబర్ 2 వరకూ భ‌క్షీ ప‌ద‌విలో కొనసాగనున్నారు.