Begin typing your search above and press return to search.

రెడ్ జోన్ గా చందా నగర్..41లో 19 కరోనా కేసులు అక్కడివే

By:  Tupaki Desk   |   27 March 2020 4:12 PM GMT
రెడ్ జోన్ గా చందా నగర్..41లో 19 కరోనా కేసులు అక్కడివే
X
నిజమే.. ఇప్పుడు చందానగర్ - లింగంపల్లి వైపు వెళ్లేవారంతా కాస్తంత ఆగి ఒకటికి పదిసార్లు ఆలోచించి మరీ యూటర్న్ తీసుకోక తప్పదు. ఎందుకంటే... చందానగర్ ను జీహెచ్ ఎంసీ అధికారులు ఇప్పుడు రెడ్ జోన్ గా ప్రకటించారు. కరోనా మహమ్మారి పగడ విప్పి ఆడుతున్న వేళ... తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటికే తెలంగాణలో 45కు పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా... హైదరాబాద్ లో 41 కేసులు నమోదయ్యాయి. ఈ 41 కేసుల్లో ఏకంగా 19 కేసులు ఒక్క చందా నగర్ ప్రాంతంలో బయటపడినవేనట. అందుకే చందానగర్ ను అధికారులు రెడ్ జోన్ గా ప్రకటించారు.

సాధారణంగా కరోనా పాజిటివ్ కేసు నమోదైన ప్రాంతాన్ని అధికారులు రౌండప్ చేస్తారు. సదరు ప్రాంతం నుంచి జనాలు ఇతర ప్రాంతాలకు వెళ్లడం - ఇతర ప్రాంతాలకు చెందిన వారు ఆ ప్రాంతానికి వెళ్లడంపై పూర్తి స్థాయిలో నిసేధం విధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరహా నిషేదాజ్ఝలు పక్కాగా అమలైతేనే... కరోనా కట్టడి సాధ్యమన్నది వైద్యాధికారుల భావన. వైరస్ వ్యాప్తిని ఈ తరహా నిషేధాజ్ఝలతో నిలువరించే వీలుంటుందన్న మాటను జనానికి చెబుతూ సదరు ప్రాంతాన్ని అధికారులు రౌండప్ చేస్తున్న వైనం చూస్తూనే ఉన్నాం. అలాంటిది చందా నగర్ లో ఏకంగా 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయంటే... ఆ ప్రాంతం ఎంత ప్రమాదకరమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా.

ఈ నేపథ్యంలో చందా నగర్ ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటించిన అధికారులు... ఆ ప్రాంతం వైపు రావొద్దంటూ భాగ్యనగరి జనానికి గేట్లు మూసేస్తున్నారు. అయినా చందా నగర్ కు ఈ తరహా దుస్థితి ఎందుకు వచ్చిందంటే.. సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ అధికంగా నివసించే ఈ ప్రాంతం నుంచి విదేశాలకు రాకపోకలు ఓ రేంజిలో సాగుతుంటాయి. విదేశాలకు వెళ్లడం, అక్కడి రావడం ఇక్కడ నిత్యం జరుగుతూనే ఉంటోంది. ఈ క్రమంలోనే ఇటీవల విదేశాల నుంచి వచ్చిన వారిలో చాలా మంది కరోనాకు చిక్కి ఉంటారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏదైతేనేం... కరోనా కారణంగా ఇప్పుడు చందా నగర్ పై రెడ్ జోన్ ముద్ర పడిపోయింది.