Begin typing your search above and press return to search.

గుర్తుకొస్తున్నాయి : నాడు బాబు...నేడు కేసీయార్...రిజల్ట్...?

By:  Tupaki Desk   |   27 May 2022 1:30 PM GMT
గుర్తుకొస్తున్నాయి : నాడు బాబు...నేడు కేసీయార్...రిజల్ట్...?
X
కేంద్రం మీద దండెత్తడం అన్నది ఒక ఫ్యాషన్ అయిపోయింది అంటే ప్రాంతీయ పార్టీల పెద్దన్నలకు కోపం రావచ్చు. కానీ అదే నిజం. మన దేశం సమాఖ్య వ్యవస్థగా ఉంది. రాష్ట్రాలకు ఎన్నో అధికారాలు ఉన్నాయి. అయినా కానీ కేంద్రం కూడా ఒక పెద్దన్నగా ఉంటుంది. కేంద్రం చేయాల్సినవి కేంద్రం చేస్తుంది. కానీ రాష్ట్రం చేయాల్సినవి కూడా అనేకం ఉన్నాయి. అవి చేయకుండా అన్నింటికీ పాపాలభైరవుడుగా కేంద్రాన్ని చూపిస్తే జనాలు నమ్మరు కాక నమ్మరు.

ఇది గతంలో రుజువు అయింది. ఏపీలో నాలుగేళ్ల పాటు కేంద్రంతో దోస్తీ కట్టిన చంద్రబాబు 2018 మార్చిలో తెగదెంపులు చేసుకున్నారు. నాడు ఆయన చెప్పిన కారణం ప్రత్యేక హోదా ఇవ్వలేదని, విభజన హామీలు అమలు చేయలేదని, ఇదే చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు హోదా వద్దు ప్యాకేజి ముద్దు అని మీడియా ముందు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇక నాలుగేళ్ళలో పాలూ నీళ్ళుగా కలసిపోయి చివరాఖరు ఏడాది తప్పు అంతా కేంద్రానిది నాదు కాదు సుమా అని తోసేస్తే జనాలు నమ్మలేదు. అందుకే చంద్రబాబుని ఓడించేశారు.

అయితే చంద్రబాబు చివరి ఏడాది కేవలం ఏపీలోనే కూర్చోకుండా దేశమంతా తిరిగారు, నాడు ఆయన బెంగుళూరు వెళ్ళి కుమారస్వామిని దేవేగౌడను కలిశారు. అలాగే అరవింద్ కేజ్రీవాల్, శరద్ పవార్, కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా వంటి వారిని కలిశారు. పశ్చిన బెంగాల్ వెళ్లి మమతా బెనర్జీతో కలసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక కాంగ్రెస్ నేత రాహుల్ తో కలసి వేదికలను పంచుకున్నారు.

మోడీ హఠావో అన్న ఘనమైన నినాదాన్ని కూడా నాడు దేశమంతా వినిపించారు. అయినా సరే జనాలు మోడీని గెలిపించారు. బాబు అధికారంలో ఉన్న ఏపీలోనూ మాజీ సీఎం ని చేశారు. ఇదంతా కళ్ల ముందున్న కధ. ఉమ్మడి ఏపీలో సగమైన తెలంగాణాను పాలిస్తున్న కేసీయార్ కి ఈ చరిత్ర తెలియనిది కాదు. కానీ ఆయన కూడా సేమ్ టూ సేమ్ బాబు బాటలోనే కేంద్రాన్ని విమర్శిస్తున్నారు. నాడు ఏపీలో మోడీకి టీడీపీ నల్ల జెండాల స్వాగతం పలికితే నేడు కేసీయార్ తాను స్వాగతం పలకకుండా వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతున్నారు.

మోడీ వద్దు బీజేపీ వద్దు అని దేశమంతా తిరిగి స్ట్రాంగ్ స్లోగన్స్ వినిపిస్తున్నారు. అయితే నాడు చంద్రబాబు అయినా నేడు కేసీయార్ అయినా ఇంతటి సువిశాలమైన దేశంలో పరిమితమైన స్థాయిలో మాత్రమే తమ రాజకీయాలను చేయగలరు, చూపించగలరు. బాబుకు నాడు పాతిక సీట్లు అయినా ఉన్నాయి. మరి పదిహేడు సీట్లతో కేసీయార్ ఢిల్లీలో చక్రం తిప్పుతానూ అంటే నమ్మేవారుంటారా. బెంగాల్ పులి మమతా బెనర్జీకి 42 సీట్లు ఉన్నాయి. కేజ్రీవాల్ కి పంజాబ్ తో కలిపి చూస్తే పాతిక దాకా ఎంపీ సీట్లు ఉంటాయి. దేవెగౌడకు కర్నాటకలో 28 సీట్లు ఉన్నాయి.

మహారాష్ట్రకు 48 ఎంపీ సీట్లు ఉన్నాయి. మరి అందరిలో తక్కువ సీట్లు ఉన్న రాష్ట్రం నుంచి వెళ్ళి కేసీయార్ ఢిల్లీలో ఏమి సాధిస్తారు. ఆయన మాట వినేవారు ఎవరు. మరో వైపు చూస్తే బాబు తొలి అయిదేళ్ళకే జనాలకు బోర్ కొట్టి గద్దె దిగిపోయారు. కేసీయార్ రెండు సార్లు అధికారంలో ఉన్నారు. తెలంగాణా జనాలకు ఆయన ఇంకా బోర్ కొడితే రేపటి రోజున ఉన్న చోటనే అధికారం పోయినా పోవచ్చు.

ముందు ఇంట గెలిచి రచ్చ గెలవాలి. ఆ పని చేయకుండా చంద్రబాబు నాడు దేశమంతా తిరిగి చివరిని ఫలితాలు వచ్చిన తరువాత ఎవరికీ ముఖం చూపించలేక ఏపీకే పరిమితం అయ్యారు. మరి కేసీయార్ కూడా అంతేనా అన్న చర్చ అయితే వస్తోంది. దీని మీద బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అయితే ఒక సెటైర్ వేశారు కూడా. బాబుని చూసి అయినా ఆలోచించలేరా అని కేసీయార్ మీద ఫైర్ అయ్యారు. నాడు మోడీని తిట్టి దేశాలు పట్టిన బాబు ఉన్న చోటనే ఓడారు, మరి ఇపుడు కేసీయార్ కూడా అలాగే అవుతారు అని కూడా జీవీఎల్ చెప్పాల్సింది చెప్పేశారు.

అయినా కళ్ల ముందు బట్టతల కనిపిస్తూంటే ఎవరైనా చెప్పాలా ఏంటి. ఏది ఏమైనా బీజేపీతో లడాయి, మోడీతో ఫైటింగ్ అంటూ దేశాలు పడుతున్న కేసీయార్ జాతీయ స్థాయిలో చక్రాలు తిప్పడం మాట అటుంచి తెలంగాణలో కారు చక్రాలు ఊడిపోకుండా చూసుకోవడం బెటర్ అన్న మాట విపక్షాల నుంచి మాత్రమే కాదు, జనాల నుంచి వస్తోంది.