Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ నోట తీపి క‌బురు.. కంగారు ప‌డుతున్న బాబు బ్యాచ్

By:  Tupaki Desk   |   1 April 2019 6:10 AM GMT
జ‌గ‌న్ నోట తీపి క‌బురు.. కంగారు ప‌డుతున్న బాబు బ్యాచ్
X
ఐదేళ్లు వెన‌క్కి వెళితే.. 2014 ఎన్నిక‌ల ప్ర‌చారం సంద‌ర్భంగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు నోటి నుంచి వ‌చ్చిన ప్ర‌ధాన హామీల్లో బాబు వ‌స్తే జాబు వ‌స్తుంద‌ని. ఏపీలోని ప్ర‌తి కుటుంబానికి పెద్ద కొడుకుగా ఉంటాన‌ని.. వారిగా అండ‌గా నిలుస్తాన‌ని మాట ఇచ్చే వారు. అంతేనా.. ప్ర‌తి కుటుంబానికి ఉద్యోగ భ‌ద్ర‌త ప‌క్కా అంటూ ఆశ‌లు క‌ల్పించారు. 2014లో టీడీపీ గెలుపులో బాబు నోట వ‌చ్చిన జాబు మాట కూడా ప్ర‌ధాన కార‌ణంగా చెప్పాలి.

అలాంటి హామీని త‌న ఐదేళ్ల పాల‌న‌లో బాబు ప‌క్క‌న పెట్టేసిన తీరుతో ఏపీ ప్ర‌జ‌లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బాబు వ‌స్తే జాబు వ‌స్తుంద‌న్న మాట‌ను న‌మ్మాన‌ని.. ఆ హామీని త‌న ఇంటి వ‌ర‌కు మాత్ర‌మే అమ‌లు చేసుకున్నారంటూ మండిప‌డుతున్నారు. జాబు విష‌యంలో ఏపీ యువ‌త తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

చంద్ర‌బాబు ఏ విష‌యంలో ఫెయిల్ అయ్యారో.. ఇప్పుడ‌దే విష‌యాన్ని ప‌దే ప‌దే ప్ర‌స్తావిస్తున్న జ‌గ‌న్ తీరు ఏపీ ప్ర‌జ‌ల్లో కొత్త ఆశ‌లు ఉద‌యించేలా చేస్తున్నాయి. తాజాగా ఆయ‌న ఉద్యోగాల‌కు సంబంధించి చేసిన ప్ర‌క‌ట‌న ప్ర‌త్య‌ర్థి పార్టీలో చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్నాయి. తాము అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.30 ల‌క్ష‌ల ఉద్యోగాల భ‌ర్తీకి ఒకే నోటిఫికేష‌న్ వేస్తామ‌ని చెప్పారు. ఇప్ప‌టివ‌ర‌కూ ఏ పార్టీ చేయ‌ని రీతిలో తాము ప‌వ‌ర్లోకి వ‌చ్చిన వెంట‌నే ఉద్యోగ భ‌ర్తీపైన దృష్టి పెడ‌తామ‌న్న జ‌గ‌న్ మాట టీడీపీ వ‌ర్గాల గుండెల్లో రైళ్లు ప‌రిగెత్తించేలా మారింది.

ప‌రిశ్ర‌మ‌ల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికుల‌కే చెందేలా చ‌ట్టం చేస్తామ‌ని ఇస్తున్న హామీ కూడా ఆస‌క్తిక‌రమ‌ని చెప్పాలి. తాజా ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఉద్యోగాల విష‌య‌మై జ‌గ‌న్ చేస్తున్న కీల‌క ప్ర‌క‌ట‌న త‌మ పాలిట శాపంగా మారుతుంద‌న్న భ‌యాందోళ‌న‌ల్ని తెలుగు త‌మ్ముళ్లు వ్య‌క్తం చేస్తున్నారు.