Begin typing your search above and press return to search.

జగన్ వెళ్ళేది అక్కడికేనట... బాబు సంచలన కామెంట్స్

By:  Tupaki Desk   |   3 Nov 2022 2:30 PM GMT
జగన్ వెళ్ళేది అక్కడికేనట... బాబు సంచలన కామెంట్స్
X
ఏపీలో రాజకీయ విమర్శలు తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అయితే తన టోన్ ని బాగా పెంచేశారు. గతానికి భిన్నంగా ఆయన అఫెన్సివ్ మోడ్ లోకి వెళ్తున్నారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిని అరెస్ట్ చేసిన విషయం మీద మీడియాతో ఆయన మాట్లాడుతూ జగన్ సర్కార్ మీద సంచలన కామెంట్స్ చేశారు. ఏదో జనాలు ఒక చాన్స్ ఇద్దామని ఇచ్చారు. దాంతో మొత్తం వ్యవస్థలను అన్నింటినీ సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని జగన్ అథోగతి పాలు చేశాడని బాబు మండిపడ్డారు.

ఇంత దారుణంగా ఏపీని చేశాక మళ్లీ ఎన్నికల్లో 175 కి 175 సీట్లు వస్తాయని జగన్ పగటి కలలు కంటున్నాడని ఎద్దేవా చేశారు. ఏపీ జనాలు మరోసారి జగన్ కి ఓటేసే సీన్ లేదని ఆయన ఖండితంగా చెప్పేశారు. ఏపీలో ఈసారి ఎన్నికలు ఎపుడు జరిగినా వైసీపీని బంగాళాఖాతంలోకి కలిపేయడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. అలాగే ఎన్నికల తరువాత జగన్ శాశ్వతంగా జైలుకు వెళ్తారని ఆయన అంటున్నారు. జరగబోయేది ఇదీ గుర్తు పెట్టుకో జగన్ రెడ్డీ అంటూ ఆయన ఫైర్ అయ్యారు.

అందరికీ అరెస్ట్ చేసి లోపల వేయడం కాదు, రేపు ఎన్నికల తరువాత మీదీ జైలు దారే అని మరచిపోవద్దు అని హెచ్చరించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా , బెదిరిస్తారా ఇదెక్కడి ప్రజాస్వామ్యమని ఆయన నిలదీశారు. ఎక్కడో హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ ఉంటే ఆయన మీద కూడా దాడి చేసే పరిస్థితికి వచ్చారూ అంటే ఈ ప్రభుత్వం మీద ఎవరూ మాట్లాడకూడదా, గొంతు లేవకుండా చేస్తారా అని బాబు గర్జించారు.

ఆ విషయాలు పక్కన పెడితే 2024 ఎన్నికల తరువాత జగన్ వెళ్లేది జైలుకే అని బాబు చెప్పడం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. మరి బాబు ఏ ఉద్దేశ్యంతో ఈ మాటలు అన్నారో ఆలోచించాలి. ముందస్తు ఎన్నికలు పెట్టినా లేక షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగినా అంటున్నారు. ఆ విధంగా చూస్తే జగన్ మీద ప్రస్తుతం ఉన్న సీబీఐ కేసులలో తీర్పు వచ్చి జగన్ జైలుకు వెళ్తారని బాబు ఊహించి ఈ కామెంట్స్ చేస్తున్నారా అని అనుకోవడానికి లేదు.

ఎందుకంటే ఎపుడు ఎన్నికలు జరిగినా ఆ మరుక్షణం వైసీపీ ఓడి జగన్ జైలుకు వెళ్తారని చెబుతున్నారు. అంటే జగన్ మీద కేసులు వేరేవి ఉన్నాయా లేక పెడతారా లేక అయిదేళ్లలో ఆయన ప్రభుత్వం చేసిన దాని మీద విచారణ జరిపించి జైలు దారి చూపిస్తారా ఏమో ఇవన్నీ తెలియదు కానీ జగన్ శాశ్వతంగా జైలుకే అంటున్నారు చంద్రబాబు. మొత్తానికి జగన్ జైలు అన్న మాటలను కలిపి చాలా కాలానికి బాబు వినిపించడం ఇపుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.