Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబు నాయుడు.. వ‌కీల్ సాబ్ పాలిటిక్స్‌!

By:  Tupaki Desk   |   10 April 2021 4:36 AM GMT
చంద్ర‌బాబు నాయుడు.. వ‌కీల్ సాబ్ పాలిటిక్స్‌!
X
పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో టీడీపీకి దారుణ ఫ‌లితాలు వ‌చ్చాయి. మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లోనూ ఘోర ప‌రాభ‌వం ఎదురైంది. ఆ త‌ర్వాత ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌ను బ‌హిష్క‌రించారు. ఓట‌మి పున‌రావృతం అవుతుంద‌న్న భ‌యంతోనే బ‌హిష్క‌ర‌ణ పేరుతో త‌ప్పుకున్నార‌నే విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. ప్రస్తుతం.. ఆ పార్టీ తిరుప‌తి ఉప‌ ఎన్నిక బ‌రిలో ఉన్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆయ‌న శుక్ర‌వారం నెల్లూరు జిల్లా ప‌ర్య‌ట‌న‌లో మాట్లాడారు.

‘వ‌కీల్ సాబ్’ సినిమాకు బెనిఫిట్ షోలకు ఎందుకు అవ‌కాశం ఇవ్వ‌లేద‌ని ప్ర‌శ్నించారు. పెద్ద హీరోల‌కు చిత్రాల‌కు బెనిఫిట్ షోల‌కు ప‌ర్మిష‌న్ ఇవ్వ‌డం స‌హ‌జంగా జ‌రిగేదే అని, టికెట్ రేట్లు పెంచ‌డం కూడా సాధార‌ణ‌మేన‌ని అన్నారు. అంద‌రికీ అవ‌కాశం ఇచ్చి, ప‌వ‌న్ కు మాత్రం ఎందుకు అనుమ‌తించ‌లేద‌ని ప్ర‌శ్నించారు. ప‌వ‌న్ ఆర్థిక మూలాల‌ను దెబ్బ‌తీసేందుకే ఇలా చేశార‌ని ఆరోపించారు. త‌మ పాల వ్యాపారాన్ని కూడా దెబ్బ తీసేందుకు జ‌గ‌న్ గుజ‌రాత్ నుంచి వ్యాపారుల‌ను దించార‌ని అన్నారు.

అయితే.. చంద్ర‌బాబు చేసిన ఈ వ్యాఖ్య‌లు తిరుపతి ఉప ఎన్నిక‌ కోస‌మేన‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. తిరుప‌తిలో వైసీపీ విజ‌యం ఖ‌రారైంద‌నే అభిప్రాయం మొద‌టి నుంచీ ఉంది. తేలాల్సింది మెజారిటీ మాత్ర‌మే అని అంటున్నారు. అయితే.. అక్క‌డ రెండో స్థానం కోసం టీడీపీ-బీజేపీ పోటీ ప‌డుతున్నాయ‌ని అంటున్నారు విశ్లేష‌కులు.

ఈ ఎన్నిక‌లో సెకండ్ ప్లేస్ సాధించ‌డం ద్వారా వైసీపీకి తామే ప్ర‌త్యామ్నాయం అని చాటుకోవాల‌ని బీజేపీ ఉవ్విళ్లూరుతోంద‌ని అంటున్నారు. ఇందులో భాగంగానే ప‌వ‌న్ సీఎం అభ్య‌ర్థి అని ప్ర‌క‌టించార‌ని చెబుతున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో త‌మ ప్రాబ‌ల్యాన్ని కాపాడుకోవ‌డం టీడీపీకి అనివార్య‌మైంద‌ని అంటున్నారు. స్థానిక ఎన్నిక‌ల్లో డీలాపడిన వేళ‌.. తిరుప‌తిలో మూడోస్థానానికి ప‌డిపోతే పార్టీ భ‌విష్య‌త్ మ‌రింత ఇర‌కాటంలో ప‌డుతుంద‌నే భ‌యం కూడా కేడ‌ర్ లో ఉంది.

అందువ‌ల్ల‌.. తిరుప‌తిలో సెకండ్ ప్లేస్ సాధించాల్సిన అవ‌స‌రం చాలా ఉంది. ఈ నేప‌థ్యంలో..ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల సానుభూతి పొందేందుకు వ‌కీల్ సాబ్ సినిమా అంశాన్ని చంద్రబాబు ఎత్తుకున్నార‌ని అంటున్నారు. వ‌కీల్ సాబ్ సినిమాకు అనుకూలంగామాట్లాడ‌డం ద్వారా.. కొన్ని ఓట్లైనా త‌మ‌కు ప‌డ‌క‌పోతాయా అనే ఉద్దేశంతోనే ఈ వ్యాఖ్య‌లు చేశార‌ని స్థానికంగా అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.