Begin typing your search above and press return to search.

సీన్ రివ‌ర్స్‌: క‌ల‌క‌లం రేపుతున్న బాబు కామెంట్లు

By:  Tupaki Desk   |   11 May 2021 7:30 AM GMT
సీన్ రివ‌ర్స్‌:  క‌ల‌క‌లం రేపుతున్న బాబు కామెంట్లు
X
టీడీపీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు, మాజీ సీఎం చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో క‌ల‌క‌లం రేపుతున్నాయి. క‌రోనా వ్యాక్సిన్ విష‌యంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం చేతులు ఎత్తేసింద‌ని.. అందుకే క‌రోనా వ్యాక్సినేష‌న్ కేంద్రాల‌ను మూసేశార‌ని.. చంద్ర‌బాబు అన్నారు. అదేస‌మ‌యంలో కేంద్రం ఇస్తే.. మేం కాదంటామా? అంటూ.. రాష్ట్రం ప్ర‌క‌టించ‌డంపైనా మండిప‌డ్డారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. మీరు కూడా ప్ర‌తిప‌క్ష నేత‌గా ఎందుకు ప్ర‌య‌త్నించ‌కూడ‌దు.. కేంద్రానికి అనేక లేఖ‌లు రాశారు క‌దా.. ఇప్పుడు వ్యాక్సిన్ విష‌యంలోనూ ఎందుకు లేఖ‌రాయ‌రు? అంటూ.. అధికార ప‌క్షం నుంచి చంద్ర‌బాబుకు ఘాటు విమ‌ర్శ ఎదురైంది.

దీంతో చంద్ర‌బాబు ఒకింత ఆవేశానికి గుర‌య్యారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు వ్యాక్సిన్ అందించకుండా బాధ్యతల నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాలు సొంతగా వ్యాక్సిన్ కోసం ఆర్డర్లు పెట్టినా.. ఏపీలో ప్రభుత్వం ఆ ప్రయత్నం చేయడం లేదని దుయ్యబట్టారు. వేరే రాష్ట్రాల్లో 18 - 45 ఏళ్ల యువతకు వ్యాక్సినేషన్‌ ఇస్తున్నా.. ఏపీలో మాత్రం ఇవ్వడం లేదని విమర్శించారు. మహారాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్‌ టెండర్లు సైతం పిలిచిందని గుర్తుచేసిన చంద్రబాబు.. జగన్‌ ప్రభుత్వం ఎందుకు వ్యాక్సిన్‌ కోసం ఆర్డర్లు పెట్టలేదని నిలదీశారు.

తాను వ్యాక్సిన్‌ తెప్పిస్తే మరి జగన్‌ ఎందుకు ముఖ్యమంత్రిగా ఉండడమని చంద్రబాబు మండిపడ్డారు. మంత్రివర్గం.. వ్యాక్సిన్‌కు 45 కోట్ల రూపాయలు మంజూరు చేసిందంటేనే ప్రభుత్వ నిర్లక్ష్యం తీరు అర్ధం అవుతుందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. కరోనా బాధిత ప్రజలకు ప్యాకేజీ ఇవ్వాలన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ అమ్మ క్యాంటీన్లు కొనసాగించాలని తీసుకొన్న నిర్ణయం అభినందనీయమని, ఏపీలోనూ అన్న క్యాంటీన్ల‌ను ఇప్ప‌టికైనా తెర‌వాల‌ని సూచించారు. అయితే.. చంద్ర‌బాబు చేసిన ఈ వ్యాఖ్య‌ల‌పై నెటిజ‌న్లు మిశ్ర‌మంగా స్పందిస్తున్నారు. రేపు మీరు ముఖ్య‌మంత్రి అయ్యేందుకు ఇదే మంచి అవ‌కాశం సార్‌! అంటున్నారు.