Begin typing your search above and press return to search.

ఉత్తరాంధ్ర పై బాబు ఫోకస్.. జగన్ అడ్డంకులు

By:  Tupaki Desk   |   27 Feb 2020 5:30 AM GMT
ఉత్తరాంధ్ర పై బాబు ఫోకస్.. జగన్ అడ్డంకులు
X
రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ లోని ఉతరాంధ్ర కీలక ప్రాంతమైనది. సముద్ర తీర ప్రాంతం ఉన్న విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాపై ప్రస్తుతం టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారు. గత ఎన్నికల్లో దారుణంగా దెబ్బతిన్న పార్టీకి మళ్లీ జవసత్వాలు తీసుకొచ్చేలా బాబు ప్రయత్నాలు మొదలుపెట్టారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా ఇప్పటి నుంచే కార్యక్రమాలు మొదలుపెట్టాడు. అందులో భాగంగా ప్రజా చైతన్య యాత్ర పేరిట రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నాడు. ఇందులో భాగంగా ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో పర్యటన కు అధిక ప్రాధాన్యం ఇచ్చారు.

అధికార వికేంద్రీకరణలో భాగంగా అమరావతితోపాటు విశాఖపట్టణంలో మరో రాజధాని ఉంటదని జగన్ పర్యటించాడు. ఈ సమయంలో ఉత్తరాంధ్ర ప్రజలు అధికార పార్టీకి కొంత మద్దతుగా ఉన్నారు. అమరావతిని కాదని విశాఖను ఎంపిక చేయడంతో ఉత్తరాంధ్రలో కొంత టీడీపీ గ్రాఫ్ పడిపోయింది. ఈ నేపథ్యంలో పార్టీని పటిష్టం చేస్తూనే విశాఖపట్టణంలో కూడా బలంగా తయారుకావాలనే ఉద్దేశంతో చంద్రబాబు యాత్రలో భాగంగా గురువారం నుంచి పర్యటించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఒక్కసారిగా పోలీసులు షాకిచ్చారు. చంద్రబాబు పర్యటనకు అనుమతి కోసం పోలీసులకు దరఖాస్తు చేసుకోగా టీడీపీ నాయకులు ముప్పుతిప్పలు పెట్టారు. చంద్రబాబు పర్యటనకు అనుమతి ఇస్తూనే ఆంక్షలు విధించడంతో టీడీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

విశాఖపట్టణంలో అధికార పార్టీకి దీటుగా ఎదగాలని భావిస్తూ తెలుగుదేశం పార్టీ అధినేత కార్యాచరణ రూపొందించారు. ఈ క్రమంలో విశాఖ పర్యటనలో చంద్రబాబు వెంట 50 మంది నాయకులకు మించి ఉండకూదని.. కాన్వాయ్‌లోనూ వాహనాలు చాలా పరిమితంగా మాత్రమే ఉండాలని తదితర నిబంధనలు విధించింది. దీనికితోడు చంద్రబాబు పర్యటనకు అడ్డంకులు సృష్టించేలా అధికార పార్టీ నాయకులు చేస్తున్నారు. దీంతో విశాఖపట్టణంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వివాదం ఏర్పడే అవకాశం ఉంది. చంద్రబాబు పర్యటనను వ్యతిరేకించాలని, అతడి తీరుకు నిరసనగా ఆందోళనలు చేయాలని వైఎస్సార్సీపీ పరోక్షంగా సైగలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆ పార్టీ నాయకులు చంద్రబాబు పర్యటనకు అడుగడుగున అడ్డంకులు సృష్టించేలా చేస్తున్నారు. వారి తీరుతో తెలుగుదేశం పార్టీ నాయకులు అప్రమత్తమయ్యారు.

ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయంపై ఫోకస్ చేస్తూ ప్రజలకు విరుద్ధంగా ఉన్న ప్రతి అంశాన్ని చంద్రబాబు వినియోగించుకుంటూ అధికార పక్షంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఏ అవకాశమొచ్చినా వదలకుండా చంద్రబాబు సద్వినియోగం చేసుకుంటూ జగన్ ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. ఇప్పుడు తన పర్యటనను అడ్డుకుంటుండడాన్ని చంద్రబాబు వ్యక్తిగతంగా తీసుకుని తనను చూసి జగన్ ప్రభుత్వం భయపడుతోందని విమర్శిస్తున్నారు. ఈ విధంగా ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని 2024లో పార్టీ అధికారంలోకి వచ్చేలా తీవ్ర కృషి చేస్తున్నారు. అందుకే ఉత్తరాంధ్రలో బలపడేలా చర్యలు చేపట్టారు.