Begin typing your search above and press return to search.

ఎంపీ వద్దు.. ఎమ్మెల్యేలే ముద్దు..

By:  Tupaki Desk   |   2 Jan 2019 5:30 AM GMT
ఎంపీ వద్దు.. ఎమ్మెల్యేలే ముద్దు..
X
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి సీట్ల పంపకం పెద్ద తలనొప్పిగా మారునుందా...? పార్టీలో సీనియర్లు, జూనియర్ల మధ్య వివాదాలు తలెత్తనున్నాయా..? వీరే కాదు పార్టీ లోక్‌సభ సభ్యులకు, శాసనసభ్యులకు మధ్య ఈసారి సీట్ల వివాదం పెరగనుందా.. ?ఈ ప్రశ్నలన్నింటికి అవుననే సమాధానం వస్తోందంటున్నారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసే వారిలో చాలా మందిని మార్చే ఉద్దేశ్యంలో అధినేత చంద్రబాబు నాయుడు ఉన్నారంటున్నారు. తన కుమారుడ్ని ముఖ్యమంత్రిని చేయడంలో భాగంగా సీనియర్లకు అడ్డుకట్ట వేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో తనకు అత్యంత వీర విధేయులైన వారికి మాత్రమే శాసనసభ టిక్కట్లు ఇచ్చే అవకాశాలున్నాయంటున్నారు.

ముఖ్యంగా తనకు ఇబ్బంది కలిగించే వారిని లోక్‌సభకు పంపుతారంటున్నారు.అలాగే యువ నాయకుల్లో కొందరిని శాసనసభకు తీసుకువస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ముఖ్యంగా శ్రీకాకుళం లోక్‌సభ సభ్యుడు కింజారపు రాంమ్మోహన్ నాయుడు, గుంటూరు లోక్‌సభ సభ్యుడు గల్లా జయదేవ్ వంటి వారికి ఈసారి శాసనసభకు పంపాలన్నది చంద్రబాబు నాయుడు వ్యూహంగా చెబుతున్నారు. వీరిద్దరు యువకులే కాకుండా తనకు నమ్మిన వారిగా ఉన్నారు. అలాగే రాజమండ్రి లోక్‌సభ సభ్యుడు, సినీనటుడు మురళీ మోహన్, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజులు కూడా ఈసారి శాసనసభకు పోటీ చేసే అవకాశాలున్నా యంటున్నారు. దీనికి కారణం వారు ఇద్దరు సీనియర్లే అయినా తన మాట జవదాటరనే చంద్రబాబు నాయుడి ఉద్దేశ్యం.

ఇక పార్టీలో సీనియర్ నాయకులైన యనమల రామక్రిష్ణుడు, కె.ఈ.క్రిష్ణమూర్తి, చింతకాయల అయ్యన్నపాత్రుడు, బుచ్చయ్య చౌదరి, కింజారపు అచ్చెన్నాయుడు వంటి వారిని లోక్‌సభకు పంపాలన్నది చంద్రబాబు నాయుడి ఆలోచనగా చెబుతున్నారు. వీరిలో యనమల రామక్రిష్ణుడు, కె.ఈ.క్రిష్ణమూర్తిల నుంచి తన కుమారుడికి ఇబ్బందులు కలగవచ్చునన్నది చంద్రబాబునాయుడి అంచనా. విశాఖపట్నం రాజకీయాల్లో తనకు తలనెప్పిగా మారడంతో ఈ జిల్లాకు చెందిన చింతకాయల అయ్యన్న పాత్రుడ్ని లోక్‌సభకు పంపితే ఆ తలనొప్పులు తగ్గుతాయని ఆయన భావిస్తున్నారు. శ్రీకాకుళం రాజకీయాలలో కూడా కొద్ది పాటి మార్పులు చేయాలని, అందులో భాగంగానే అచ్చేన్నాయుడ్ని లోక్‌సభకు పంపుతారని పార్లీలో ప్రచారం జరుగుతోంది. రాజమండ్రీ లోక్ సభ సభ్యుడు మురళీ మోహన్ తనకు నమ్మిన బంటులా ఉన్నారని, దీంతో ఆయన్ని రాజమండ్రి నుంచే శాసనసభకు పంపాలన్నది చంద్రబాబు నాయుడి ఆలోచనగా చెబుతున్నారు. ఇక్కడున్న బుచ్చయ్య చౌదరిని లోక్‌సభకు పంపితే ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా ఉంటుందన్నది ఆయన ఆలోచనగా చెబుతున్నారు. మొత్తానికి రానున్న ఎన్నికలు తెలుగుదేశం పార్టీలో సంక్షోభమే తీసుకువచ్చేలా ఉన్నాయంటున్నారు.