Begin typing your search above and press return to search.

కరెక్ట్ రిటార్ట్ : బీజేపీకి బాబు మార్క్ పంచ్ ..?

By:  Tupaki Desk   |   1 July 2022 10:30 AM GMT
కరెక్ట్ రిటార్ట్ : బీజేపీకి బాబు మార్క్ పంచ్ ..?
X
చంద్రబాబు ఏమీ సాధారణ నాయకుడా. అయితే పరిస్థితులు కలసిరాక ఆయన కొంత తగ్గి ఉండవచ్చు. అంత మాత్రం చేత ఆయన్ని అసలు ఖాతరు చేయకుండా కనీసం పట్టించుకోకుండా మూడేళ్ళుగా కేంద్రంలోని బీజేపీ పెద్దలు వ్యవహరించిన తీరుని అంతా చూశారు. ఎన్నో సార్లు ఢిల్లీ దాకా వెళ్ళి మోడీ షాలను బాబు కలవాలనుకున్నారు. కానీ వారు అపాయింట్మెంట్లు ఇవ్వకుండా అవమానించారు అని తమ్ముళ్లు అంటారు.

ఈలోగా కాలం గిర్రున మూడేళ్ళు తిరిగేసింది. ఇపుడు చూస్తే దేశంలోనూ ఏపీలోనూ రాజకీయం మారుతోంది. ముఖ్యంగా ఆంధ్రాలో టీడీపీ బాగా పుంజుకుంది. పసుపు పార్టీ బలం పెరిగింది అనడానికి ఏ రకమైన సర్వేలు అవసరం లేదు. బాబు జనాలకు రాత్రీ పగలు లేకుండా గంటల కొద్దీ వచ్చి రోడ్ల మీద నిలబడుతున్న జనాలు చాలు. వారు తెచ్చిన వారు అయితే అంతలా ఎదురుచూసే సీన్ ఉండదు.

ఇక బాబు ఏం మాట్లాడినా ఆసక్తిగా ఉంటూ చప్పట్లు కొడుతున్నారు. ఒక విధంగా చూస్తే ఏపీలో జనాల మూడ్ చేంజి అయింది. మరి ఈ విషయాలు కేంద్ర పెద్దలకు తెలియకుండా ఉంటాయా అందుకే వారు మళ్ళీ బాబు వైపు చూస్తున్నారా అన్న డౌట్లు వచ్చేలా లేటెస్త్ గా ఒక ఆహ్వానం అయితే బాబుకు పంపించారు. భీమవరంలో ప్రధాని మోడీ అధ్యక్షతన జరుగుతున్న అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలకు బాబుని రమ్మని ఆహ్వానించారు. ఈ ఆహ్వానం కేంద్ర పెద్దల నుంచి వచ్చింది.

అదే విధంగా పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా బాబును ఫోన్ ద్వారా ఆహ్వానించారు. అయినా సరే బాబు మాత్రం ఒక్క మెట్టు కూడా తగ్గలేదు. అదే మునుపటి బాబు అయితే కచ్చితంగా వెళ్ళి ఉండేవారేమో. కానీ కమలం పార్టీ తనకు మూడేళ్ళుగా అసలు పట్టించుకోకుండా చేసిన అవమానానికి ఆయన కరెక్ట్ టైమ్ లో రిటార్ట్ ఇచ్చేశారు.

తాను రాకుండా ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడుని పంపిస్తున్నారు. అంటే తాను దూరంగానే ఉండి మోడీ మీటింగుని చూస్తారన్న మాట. నిజంగా బీజేపీకి టీడీపీతో రాజకీయ అవసరం ఎంతమేరకు ఉంది అన్నది కూడా బాబు అంచనా వేస్తారు అన్న మాట. అయినా సరే బాబు తనదైన రాజకీయం చేస్తూ ముందుకు సాగుతున్నారు.

మహానాడు సూపర్ హిట్ అయిన తరువాత ఆయన పొత్తుల గురించి ఎక్కడా మాట్లాడం లేదు. అలాగే కనీసంగా కూడా ఆయన వాటి మీద ప్రకటనలు చేయడంలేదు. ఇది టీడీపీలో వచ్చిన నిర్మాణాత్మకమైన మార్పు. దానిని బీజేపీకి తెలియచేసేలాగానే బాబు ఆ మీటింగునకు వెళ్ళడంలేదు అంటున్నారు.

ఇక బీజేపీకి ఇపుడు నిజంగా బాబుతో కానీ టీడీపీతో కానీ అవసరం ఉంటే వారే రేపటి నుంచి అటు నుంచి ఇటు తిరుగుతారు. మొత్తానికి అల్లూరి జయంతి సాక్షిగా బాబుని దగ్గర చేయాలన్న ఉద్దేశ్యాలు బీజేపీ పెద్దలకు ఏమైనా ఉంటే మాత్రం అలాంటివి మాతో అసలు కుదరవు అని బాబు చెప్పకనే చెప్పేశారు అంటున్నారు.

అవును మరి ఈ రోజు బాబుది. అందుకే ఆయన బెట్టు చేసి చెట్టెక్కారు. అవసరం మాది అనుకుంటే బీజేపీయే దిగి రావాల్సి ఉంటుందేమో. ఏమో ముందు ముందు ఏం జరుగుతాయో చూడాల్సి ఉంది. ఏది ఏమైనా తాను గానీ తన కుమారుడు లోకేష్ కానీ ఈ మీటింగుకు వెళ్తే పొత్తుల మీద జనంలో తప్పుడు సంకేతాలు కూడా వెళ్తాయని భావించే బాబు ఇలా చేశారు అంటున్నారు. మొత్తానికి బాబు మంచి పని చేశారు అని అంతా అంటున్నారు.