Begin typing your search above and press return to search.

చివరి ఎన్నికలు : 2024 భయపెడుతోంది.... ?

By:  Tupaki Desk   |   10 May 2022 12:30 PM GMT
చివరి ఎన్నికలు :  2024  భయపెడుతోంది.... ?
X
ఏపీలో ఇప్పటికిపుడు ఎన్నికలు అయితే లేవు. ఆ మాటకు వస్తే ఈ ఏడు కానీ వచ్చే ఏడు కానీ ఎన్నికలు జరిగే సీన్ కూడా లేదు. 2024కి ఇంకా గట్టిగా బిగిసి రెండేళ్ళు ఉంది. మరి ఇపుడే ఎందుకు అంత తొందర. ఎందుకు ఈ భారీ స్టేట్మెంట్స్ అంటే. ఇది రాజకీయం. ఎనీ టైమ్ పాలిటిక్స్ అన్నట్లుగా కధ నడిచే రంగం ఇది. ఇంకా అర్ధమయ్యేట్లుగా చెప్పుకోవాలీ అంటే అసలు ఏపీలో ఎపుడు రాజకీయం కామ్ గా ఉందని అన్న ప్రశ్న కూడా వేసుకోవాలి.

ఏపీలో టీడీపీ ఓడి వైసీపీ గెలిచిన మరుసటి ఘడియ నుంచే విపక్షం అలెర్ట్ అయింది. నాటి నుంచి ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు ఏపీలో పెద్ద ఎత్తున సాగుతూనే ఉన్నాయి. ఇక అది కాస్తా ముందుకెళ్ళి ఇపుడు అధికార పక్షం కూడా జోరు చేయడంతో కాక బాగా పెరిగింది అనుకోవాలి. అందుకే రేపు ఎన్నికలు వచ్చినా రెడీ అని అన్ని పార్టీలు బిగ్ సౌండ్ చేస్తున్నాయి.

విషయం ఇలా ఉంటే 2024 ఎవరిని భయపెడుతోంది అన్నదే ఇపుడు చర్చ. 2024లో ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయి. అయిదేళ్ళకు ఒక మారు జరిగే ప్రజాస్వామిక ప్రక్రియ ఇది. అయితే ఈసారి ఎన్నికల్లో ఓడిన పార్టీని ఇక చరిత్రలోనే చూసుకోవచ్చు అని ప్రత్యర్ధులు అంటున్నారు. దీని మీద మాజీ మంత్రి కొడాలి నాని అయితే టీడీపీకి రాజకీయ సమాధి కట్టే ఎన్నికలు 2024లో రాబోతున్నాయి అని చెబుతున్నారు.

2019 ఎన్నికల్లో లోకేష్, పవన్ కళ్యాణ్ ఓడిపోయారు కానీ 2024లో కుప్పంలో చంద్రబాబుని కూడా ఓడించి రాజకీయ సమాధి కడతామని కూడా గట్టిగా చెబుతున్నారు. అలాగే ఈసారి ఎన్నికల్లో ఓడితే జనసేన టీడీపీ దుకాణాలు మూసుకోవాల్సిందే అని ఆయన అంటున్నారు. చంద్రబాబుకు చిట్ట చివరి ఎన్నికలు 2024లో రాబోతున్నాయి. దాంతో టీడీపీ పని ఫినిష్ అని కూడా కొడాలి నాని అంటున్నారు.

ఇక ఇదే విషయం మీద చంద్రబాబు కూడా తిరుపతి టూర్లో మాట్లాడారు. జగన్ కి ఓటమి భయం పట్టుకుంది 2024 ఎన్నికలతో తన అధికారం మొత్తం పోతుంది అన్న కంగారు ఆయనలో కనిపిస్తోంది అని పంచ్ డైలాగులు పేల్చారు. జగన్ ఈసారి ఓడితే వైసీపీ అన్న పార్టీయే రాజకీయాల్లో ఎక్కడా ఉండదని, అది కాలగర్భంలో కలసిపోతుందని కూడా బాబు జోస్యం చెబుతున్నారు.

సరే ఇలా రెండు పార్టీల నుంచి విమర్శలు చేసుకోవడం మామూలే అనుకున్నా నిజంగా అలాగే జరుగుతుందా అన్నదే చర్చగా ఉంది. నిజానికి ఎన్నికలలో ఏ పార్టీ ఓడినా అది తాత్కాలికమే. ప్రజలతో కనెక్ట్ అయి ఉన్నంతవరకూ ఏ రాజకీయ పార్టీని ఎవరూ ఏమీ చేయలేరు. ఆ మాటకు వస్తే 2019 ఎన్నికల్లో 23 సీట్లతో టీడీపీ కునారిల్లితే ఇక పని అయిపోయింది అన్నారు. కానీ అలా జరగలేదు కదా 2024 ఎన్నికలకు టీడీపీ సమరోత్సాహంతో రెడీ అవుతోంది.

అలాగే 2014లో వైసీపీ ఓడితే ఇక ఆ పార్టీ ఖతం అన్నారు. అది కూడా తప్పే అయింది కదా. ఇక రెండు సీట్లలో పవన్ కళ్యాణ్ ఓడితే జనసేన దుకాణం బంద్ అన్నారు. కానీ 2024 ఎన్నికల్లో జనసేన అతి కీలకమైన భూమిక పోషించేందుకు తయారు అవుతోంది. ఇక్కడ ఏ రాజకీయ పార్టీనీ కూడా మరో పార్టీ ఫినిష్ చేయలేదు, జనాల చేతుల్లోనే అది ఉంటుంది. అలా జరగకుండా చూసుకోవాల్సింది ఆ పార్టీలే. మొత్తానికి చూస్తే క్యాడర్ లో జోష్ పెంచేందుకే ఈ తరహా స్టేట్మెంట్స్ అని కూడా చెప్పుకోవాలి.