Begin typing your search above and press return to search.

చంద్రబాబు చెప్పింది జరిగేదేనా ?

By:  Tupaki Desk   |   4 Jan 2022 4:30 AM GMT
చంద్రబాబు చెప్పింది జరిగేదేనా ?
X
తెలంగాణ లో తెలుగు దేశం పార్టీ బలోపేతమవ్వాలట. హైదరాబాద్ లో తనను కలసిన పార్టీ అధ్యక్షుడు బక్కని నర్సింహులు అండ్ కో తో చంద్రబాబు చెప్పిన మాటలివి. పార్టీ నేతలు, కార్యకర్తలతో తాను సమావేశమవుతానని, పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటామని చంద్రబాబునాయుడు చెప్పటమే విచిత్రం. పార్టీ తెలంగాణాలో పూర్తిగా కుదేలైపోయింది. తెలంగాణలో కేసీయార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు చంద్రబాబు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.

గడచిన ఏడాదిన్నరగా హైదరాబాద్ లో నే ఉంటున్న చంద్రబాబు ప్రభుత్వంపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తెలంగాణా ప్రభుత్వంలో జరుగుతున్న డెవలప్మెంట్లతో తనకు అసలు సంబంధమే లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కేసీయార్ పాలనపై ఒకవైపు ప్రతిపక్షాలు ఒంటి కాలిపై లేచి ఆందోళనలు, నిరసనలు తెలియజేస్తుంటే టీడీపీ మాత్రం తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. హైదరాబాద్ లో కూర్చుని ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలు చేయటమే పనిగా పెట్టుకున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటానని చంద్రబాబు చెబితే ఎవరైనా నమ్మడానికి ఆస్కారం ఉంటుందా ? ఒకపుడు టీడీపీ సీమాంధ్ర ప్రాంతంలో కన్నా తెలంగాణాలోనే బలంగా ఉండేది. బీసీ సామాజిక వర్గాల మద్దతు విషయం చూస్తే ఏపీ కన్నా తెలంగాణాలోనే గట్టిగా నిలబడేవారు. అలాంటిది రాష్ట్ర విభజన కారణంగా తెలంగాణాలో టీడీపీ పూర్తిగా దెబ్బతినేసిందే.

2014లో అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే హైదరాబాద్ నుండి విజయవాడకు వెళ్ళిపోయారు. మళ్ళీ అప్పటి నుండి తెలంగాణా విషయంలో జోక్యం చేసుకోవడం బాగా తగ్గిపోయింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ఘోరంగా ఓడిపోయిన దగ్గర నుంచి మళ్ళీ తెలంగాణ రాజకీయాల గురించి కనీసం నోరు కూడా విప్పటం లేదు. తెలంగాణలో పార్టీ నేలమట్టమైపోయిందన్న విషయం చంద్రబాబుతో పాటు అందరికీ తెలుసు. అయినా ఏదో నేతలను తనను కలిశారు కాబట్టి ఏదో మాట్లాడాలి కాబట్టి పార్టీ బలోపేతం గురించి మాట్లాడారంతే.

తలకిందులుగా తపస్సు చేసినా కేసీయార్ అధికారంలో ఉన్నంత వరకు తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు జోక్యం చేసుకోరన్నది వాస్తవం. ఈ మధ్య జరిగిన ఏ ఉప ఎన్నికలో కూడా టీడీపీ అసలు పోటీనే చేయలేదు. ప్రతిపక్షం అయ్యుండి ఉప ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదు ? ఎందుకంటే ఎన్నికలో దిగితే కేసీయార్ ను టార్గెట్ చేయాల్సుంటుంది. కేసీయార్ ను టార్గెట్ చేస్తే ఏమవుతుందో చంద్రబాబుకు బాగా తెలుసు. అందుకనే ఎన్నికలకు దూరంగా ఉంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణాలో పార్టీని బలోపేతం చేయాలంటే అది కొత్త సంవత్సరం జోక్ గా మిగిలిపోతుంది.