Begin typing your search above and press return to search.

చంద్రబాబు చేసిన పనికి జగన్ అనుభవించాల్సిందే..

By:  Tupaki Desk   |   27 Feb 2020 8:02 AM GMT
చంద్రబాబు చేసిన పనికి జగన్ అనుభవించాల్సిందే..
X
టీడీపీ అధినేత చేసిన పనులకు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కష్టాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు హయాంలో జరిగిన పనులు, అవకతవకలతో పాటు విధానపరమైన నిర్ణయాలతో జగన్ రాష్ట్రాన్ని గాడీలో పెట్టాలని ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగా వేగంగా చర్యలు తీసుకుంటున్నాడు. దీంతో పాటు గతంలో జరిగిన అవినీతి, అవకతవకలను వెలుగులోకి తెచ్చి ప్రజాసొమ్మును పరిరక్షించేందుకు పని చేస్తున్నాడు. అయితే చంద్రబాబు అప్పుడు చేసిన తప్పునకు ఇప్పుడు జగన్ సరిదిద్దలేకపోతున్నాడు. పైగా రాష్ట్రానికి తీవ్ర నష్టం కానుంది.

ముందే ఆర్థిక ఇబ్బందులతో సతమతవుతున్నది ఆంధ్రప్రదేశ్. ఏ అవకాశం ఉన్నా దాన్ని సద్వినియోగం చేసుకుని రాష్ట్రంలో సంపద పెరిగిలే చేయాలి. అయితే చంద్రబాబు తీసుకున్న నిర్ణయం తో రావాల్సిన నిధులు కూడా రాకుండా పోతున్నాయి. ఇప్పుడు దాన్ని అనుభవించాల్సి వస్తోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల్లో రూ.3,200 కోట్లు రాష్ట్రానికి దక్కకుండా పోయే పరిస్థితి ఎదురైంది. 2020 మార్చి 31వ తేదీలోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి. ఆలోపు నిర్వహించక పోతే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆ నిధులు నిలిచి పోయే ప్రమాదం ఉంది. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఇప్పట్లో ఎన్నికలు పూర్తయ్యేటట్టు కనిపించడం లేదు. దీంతో ఆ నిధులు పోయినట్టే భావించాలి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. వాటికి 2018 ఆగష్టుతో పదవీకాలం ముగిసింది. పంచాయతీ ఎన్నికలు అప్పుడు నిర్వహించాల్సి ఉండగా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు వెనకంజ వేశారు. 2019 ఎన్నికలు రాబోతున్న సమయంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించి ఫలితాలు ప్రతికూలంగా వస్తే సాధారణ ఎన్నికలపై పడతాయని భావించి ఎన్నికలకు వెళ్లలేదు. దీంతో అప్పటి నుంచి పంచాయతీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించలేదు. తెలంగాణ లో గతేడాది పూర్తయినా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పూర్తి చేయలేదు. జగన్ కూడా ఆ ఎన్నికలపై శ్రద్ధ పెట్టలేదు. ఇప్పుడు ఆ నిధులు దక్కవనే భయంతో ఆదరబాదరగా ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నాడు.

కానీ స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు 59.85 శాతానికి చేరాయి. రిజర్వేషన్లు 50 శాతం దాటడాన్ని సవాల్ చేస్తూ టీడీపీ నేత బి.ప్రతాప్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించడంతో ప్రస్తుతం ఎన్నికల నిర్వహణపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. ఈ అంశం హైకోర్టులో విచారణ పెండింగ్‌లో ఉన్న సమయంలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదు. దీనికతోడు జగన్ ప్రకటించినట్టు మార్చిలోగా ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పినా రాష్ట్రంలో పరిస్థితులు అనుకూలంగా లేవు. ఎందుకంటే ప్రస్తుతం పరీక్షల సమయం. పంచాయతీ ఎన్నికల నిర్వహణ కు పాఠశాలలు, ఉపాధ్యాయుల సేవలు వినియోగించుకోవాల్సిందే. పరీక్షల సమయంలో ఎన్నికల విధులకు ఎలా వస్తారో తెలియాల్సి ఉంది. ఇంటర్, పదో తరగతి పరీక్షలు జరగనుండడంతో మార్చిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహణ కష్టమే.

14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు గ్రామ పంచాయతీలకు నిధుల కేటాయింపులో అధిక ప్రాధాన్యం ఇచ్చారు. పంచాయతీలకు నూరు శాతం గ్రాంట్ మంజూరు చేయాలని 14వ ఆర్థిక సంఘం సిఫారసు చేయడంతో దాని ప్రకారం 2018-20 మధ్య రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఏపీకి రూ.4,065.79 కోట్లు కేటాయించారు. తొలి విడతగా రూ.858.99 కోట్లు మంజూరు చేశారు. మిగతా మొత్తం మంజూరు కావాల్సి ఉంది. అయితే పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్రం ఆ నిధులను మంజూరు చేయడం లేదు. మార్చి 31తో 14వ ఆర్థిక సంఘం గడువు ముగిసి పోతుండడంతో ఆ నిధులు కూడా రాని పరిస్థితి ఏర్పడింది.