Begin typing your search above and press return to search.

బిగ్ షాట్ ని నో చెప్పిన చంద్రబాబు...?

By:  Tupaki Desk   |   17 Dec 2022 8:30 AM GMT
బిగ్ షాట్ ని నో చెప్పిన చంద్రబాబు...?
X
పార్టీలో చంద్రబాబు మార్క్ పాలిటిక్స్ ని 2024లో చూపిస్తారు అని అంతటా ప్రచారం సాగింది. అయితే బాబు ప్రకటనలకే పరిమితం అవుతారు తప్ప ఆచరణలో చేయలేరు అని అంతా అనుకున్నారు. కానీ ఇపుడు బాబు తీసుకుంటున్న డైనమిక్ డెసిషన్స్ చూస్తూంటే కొత్త బాబు పరిచయం అవుతున్నారు. తనకు ఎంతో సన్నిహితులు అయిన వారిని సైతం బాబు పక్కన పెట్టేస్తున్నారు.

సొంత సామాజికవర్గం నేతలను సైతం ఆయన వద్దు అనేస్తున్నారు. ఈసారి ఎన్నికలు చావో రేవో అన్నట్లుగా ఉండడం ఒక కారణం అయితే అంగబలం, అర్ధబలం ఉన్న వారికే ఎంపిక చేయాలనుకోవడం మరో కారణం. ఇక పాయింట్ వన్ పర్సెంట్ మొహమాటానికి పోయి రాజీ పడినా తేడాలు వచ్చేస్తాయని భావించి బాబు ఒకటికి పదిసార్లు ఆచీ తూచీ అడుగులు వేస్తున్నారు.

దానికి తాజాగా ప్రచారంలో ఉన్న ఒక విషయం కూడా బలమిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇటీవల బాబు టూర్ చేశారు. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తరువాత బాబు జిల్లాలో పార్టీ పరిస్థితి మీద సమీక్ష నిర్వహించారు. పార్టీ దిగ్గజ నేతలను సైతం పిలిపించుకుని మాట్లాడారు. ఈ సందర్భంగా ఏలూరు ఎంపీ టికెట్ ని ఆశిస్తున్న మాజీ మంత్రి, సీనియర్ నేత మాగంటి బాబుకు ఈసారి టికెట్ లేదని బాబు చెప్పేశారు అని అంటున్నారు.

మాగంటి బాబు కాంగ్రెస్ లో ఒక వెలుగు వెలిగిన నేత. ఆయన వైఎస్సార్ హయాంలో మంత్రిగా పనిచేశారు. ఆ తరువాత 2009 ఎన్నికల్లో ఆయన తెలుగుదేశం లో చేరి ఏలూరు నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడారు. 2014లో మాత్రం గెలిచారు. 2019 ఎన్నికలో మూడవసారి పోటీ చేస్తే వైసీపీ ఎంపీ కోటరిగి శ్రీధర్ చేతిలో ఓటమి పాలు అయ్యారు. 2024 నాటికి మాగంటి బాబు మళ్ళీ రెడీ అవుతున్నారు.

అయితే ఈ మధ్యలో మాగంటి బాబు ఇంట్లో విషాద సంఘటనలు జరిగాయి. ఆయన ఇద్దరు కుమారులూ రాజకీయ వారసులు కొద్ది నెలల తేడాతో ఒకే ఏడాదిలో చనిపోయి ఆయనకు పుత్ర శోకం మిగిల్చారు. దాంతో కొన్నాళ్ళు ఆయన డిప్రెషన్ లోకి వెళ్లారు. ఆ తరువాత పార్టీకి ఆయన దూరం అవుతారని అంతా భావించారు. కానీ మాగంటి బాబు మాత్రం రెట్టించిన ఉత్సాహంతో పార్టీ పటిష్టతకు పనిచేస్తూ వస్తున్నారు. తాజాగా చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లా టూర్ సక్సెస్ కావడం వెనక మాగంటి బాబు శ్రమ చాలా ఉంది.

ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో తానే ఎంపీ అభ్యర్ధిని అంటూ మాగంటి బాబు ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు. పార్టీ కచ్చితంగా టికెట్ ఇస్తుందని నమ్ముతున్నారు. అయితే చంద్రబాబు మాత్రం మూడు సార్లు టికెట్ ఇచ్చిన మాగంటి బాబుని ఈసారి మార్చాలని అనుకుంటున్నారుట. ఆయన వయసు దృష్ట్యా కూడా ఆలోచించి ఆయనను పక్కన పెట్టాలని నిర్ణయించారని తెలుస్తోంది. మాగంటి బాబు బంధువుకే ఏలూరు టికెట్ ని కొమ్మారెడ్డి రంబాబుకు టికెట్ ఇవ్వాలని బాబు ఆలోచిస్తున్నారుట.

ఆయన అంగబలం అర్ధబలం సమృద్ధిగా ఉన్న నాయకుడే కాదు, కొత్త ముఖంగా వచ్చే ఎన్నికలకు ఉంటారని చంద్రబాబు భావిస్తున్నారుట. మొత్తానికి మాగంటి బాబుకు నో చెప్పడానికి బాబు వెనకాడడం లేదు అంటే ఇక మీదట టీడీపీలో ఎవరికైనా బాబు టికెట్ లేదు అనే దాకా రావచ్చు అంటున్నారు. మొత్తానికి బాబు వైఖరి చూస్తే మాత్రం టీడీపీలో చాలా కొత్త ముఖాలు బలమైన అభ్యర్ధులు కనిపించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.