Begin typing your search above and press return to search.

ఇంట్లోనే తారక రత్నం... వదులుకుంటున్నావా బాబూ...?

By:  Tupaki Desk   |   22 Aug 2022 1:27 PM GMT
ఇంట్లోనే తారక రత్నం... వదులుకుంటున్నావా బాబూ...?
X
సీనియర్ ఎన్టీయార్ మేటి నటుడు. ఆయన శిఖరాయమానంగా ఎదిగారు. ఆయన వారసుడిగా వచ్చిన బాలక్రిష్ణ కూడా టాప్ స్టార్ గా నిలిచారు. ఇక మూడవ తరంలో జూనియర్ ఎన్టీయార్ అద్భుతమైన నటుడిగా కీర్తి గడించారు. కేవలం పద్దెనిమిదేళ్ళ వయసులోనే స్టార్ అయ్యారు. ఎన్టీయార్ ఈ రోజు పాన్ ఇండియా లెవెల్ కి ఎదిగారు. అలాంటి జూనియర్ ఫీచర్స్ కానీ ఆయన మాట్లాడే భాష కానీ, హావ భావాలు కానీ అచ్చం సీనియర్ ఎన్టీయార్ ని పోలి ఉంటాయి. అందుకే ఆయనకు అంత క్రేజ్.

నాడు ఎన్టీయార్ ని గద్దె దించి ముఖ్యమంత్రి కావడమే కాదు, పార్టీని కూడా సొంతం చేసుకుని టీడీపీని నారా వారి పార్టీగా నడిపిస్తున్న చంద్రబాబుకు జూనియర్ ఎన్టీయార్ విలువ తెలుసో తెలియదో కానీ అమిత్ షా అనే పెద్దాయన ఈ రోజున దేశంలో అత్యంత శక్తివంతమైన నాయకుడు హైదరబాద్ వచ్చి జూనియర్ అంటే ఏమిటో సమస్త లోకానికి గట్టిగానే చాటి చెప్పారు. ఎందరో అమిత్ షా అపాయింట్మెంట్ కోరుకుంటూంటే ఆయన జూనియర్ ఎన్టీయార్ తో డిన్నర్ చేయాలని ముచ్చట పడ్డారు.

దీని వెనక రాజకీయ కారణాలు ఉంటే ఉండవచ్చు కానీ జూనియర్ ఎన్టీయార్ వాల్యూ ఏంటి అన్నది అమిత్ షాకు బాగా తెలుసు అంటున్నారు. ఈ రోజున తెలుగు సీమలో రాజకీయం కమ్ సినిమా రెండు రంగాల్లో రాణించగల సత్త్తా జూనియర్ కి మాత్రమే ఉందని చాలా మంది అంటారు. ఆయన ప్రసంగాలు తడుముకోకుండా చెప్పే డైలాగులు మాస్ ని ఉర్రూతలూగించే ఆయన శైలి ఇవన్నీ రాజకీయ మసాలాలే.

జూనియర్ 2009 ఎన్నికల్లో టీడీపీకి ప్రచారం చేసి పెట్టారు. నాడు టీడీపీ గెలవకపోయినా సెంచరీకి దగ్గరకు వచ్చింది అంటే అందుకో జూనియర్ ఎన్టీయార్ ఇంపాక్ట్ చాలానే ఉంది అన్నది ఒప్పుకోవాలి. ఇక నాడు జూనియర్ ప్రసంగాలు వినడానికి జనాలు తండోపతండాలుగా వచ్చేవారు. అలాంటి స్టామినా పొటెన్షియాలిటీ ఉన్న జూనియర్ ని ఇంట్లో పెట్టుకుని చంద్రబాబు మిగిలిన హీరోల వెంట పడడం మీద తమ్ముళ్ళకే చాలా బాధగా ఉంది. జూనియర్ ని పిలిస్తే టీడీపీకి బాసటగా నిలుస్తారు. ఆయన ఒక కొమ్ము కాస్తే టీడీపీకి విజయం లభించడం కూడా తధ్యం.

కానీ చంద్రబాబు నాటి భారతాన దృతరాష్ట్రుడు పుత్ర ప్రేమలో పడి యుద్ధాన్ని కోరుకున్నట్లుగా మేనల్లుడి స్టామిన తెలిసి కూడా కుమారుడు లోకేష్ కి ఎక్కడ పోటీ వస్తారో అని ఆయన్ని సైడ్ చేశారు అన్నది టీడీపీలో సామాన్యమైన తమ్ముళ్ళకు కూడా తెలిసిన బహిరంగ రహస్యమే. ఒక్కడో ఒక సూటి ప్రశ్న వారి నుంచి కూడా వస్తుంది. క్యాడర్ కి టీడీపీ కోసం ప్రాణం ఇచ్చేవారికి ఎవరు ముఖ్యమంత్రి అవుతారు, ఎవరి చేతిలో టీడీపీ ఉంది అన్నది ముఖ్యం కాదు, టీడీపీ జెండా గర్వంగా ఎగరాలి. అంతే. ఆ విధంగా చేయగల సత్తా నూటికి నూరు శాతం జూనియర్ కి ఉంది అన్నది తమ్ముళ్లకు తెలుసు.

మరి ఏ టీడీపీ కోసమైతే సొంత మామను ఎదిరించి పార్టీ పరిరక్షణ చేశాను అని నాటి నుంచి నేటి వరకూ చెప్పుకుంటున్న చంద్రబాబు అవే మాటలు నిజమైతే కనుక ఇపుడు పాతాళానికి పడిపోయిన టీడీపీ గ్రాఫ్ ని మళ్లీ పెంచడానికి మరోమారు టీడీపీ పరిరక్షణ కోసం జూనియర్ ఎన్టీయార్ సేవలను తీసుకుంటే తప్పేంటి అన్న ప్రశ్న అయితే అందరిలో వస్తోంది. అమిత్ షా బీజేపీ వారికి జూనియర్ ప్రచారం చేస్తారా ఆయన రాజకీయాల్లోకి వస్తారా అన్న చర్చ వేరేగా చూడాలి.

కానీ టీడీపీ ఇంట అద్భుతమైన నట శిఖరం ఉంది. తెలుగు నాట తారకరత్నం ఉంది. మరి దాన్ని తెలుగుదేశం పార్టీకి ఉపయోగించుకోకపోతే మాత్రం తప్పు నూటికి నూరు పాళ్ళూ చంద్రబాబుదే అని రేపటి చరిత్ర చెబుతుంది. ఏమైనా జూనియర్ వాల్యూ అమాతం పాన్ ఇండియా లెవెల్ కి పెంచేసిన అమిత్ షా కు నిజమైన ఎన్టీయార్ అభిమానులు తెలుగు తమ్ముళ్ళు శత విధాలుగా థాంక్స్ చెప్పుకుంటున్నారు.