Begin typing your search above and press return to search.

తమ్ముళ్ళకు చమటలు పట్టిస్తున్న బాబు...మ్యాటర్ అదే...?

By:  Tupaki Desk   |   24 Nov 2022 2:30 AM GMT
తమ్ముళ్ళకు చమటలు పట్టిస్తున్న బాబు...మ్యాటర్ అదే...?
X
చంద్రబాబుకు అలుపు సొలుపూ లేదు. ఆయనకు ఆయనే చెప్పుకున్నట్లుగా వయసు ఏడు పదులు దాటినా పాతికేళ్ల ప్రయంలో ఉన్న కుర్రాడి మాదిరిగా పనిచేయగలరు. అదే ఆయనకు ఉన్న అత్యంత పదునైన ఆయుధం. అయితే బాబులో మైనస్ ఏంటి అంటే తాను మాత్రం స్పీడ్ గా పనిచేస్తారు కానీ తమ్ముళ్లను అంతే వేగంతో పనిచేయించలేకపోతున్నారు.

బాబుకు మొదటి నుంచి ఇదే అలవాటు. తనలా ఎవరూ చేయలేరని భావించి అన్నీ ఆయన భుజాల మీద వేసుకోవడంతో ఇపుడు తమ్ముళ్లకు తాము ఏమి చేయాలో కూడా తెలియక అలా ఫుల్ గా సైలెంట్ అయిపోయారు. కానీ ఇపుడు ఏపీలో వైసీపీని ఓడించాలి. అతి పెద్ద టాస్క్ కళ్ల ముందు ఉంది. బాబు అయితే ఒకటికి పదిసార్లు ఈ మూడున్నరేళ్ల కాలంలో తమ్ముళ్లను హెచ్చరించారు.అదిలించారు, బెదిరించారు. అయినా దారికి రాని వారే ఎక్కువ మంది ఉన్నారుట.

దాంతో టీడీపీకి కొత్తగా వ్యూహకర్తగా నియమితులు అయిన రాబిన్ శర్మ ఇచ్చిన సర్వే రిపోర్ట్ బాబు చేతులలోకి వచ్చిందంట. ఆయన తన టీం ద్వారా టీడీపీ నేతల విషయంలో చేయించిన అంతర్గత సర్వే అంతా మొత్తం బాబు చేతుల్లోకి వెళ్లింది అంటున్నారు. చాలా చోట్ల పార్టీ తమ్ముళ్ళు ఎవరూ పనిచేయడంలేదని ఆ నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారుట.

నిక్కచ్చిగా నిజాయతీగా ఉన్న ఆ నివేదిక బాబు ముందు ఉందిపుడు. గతంలోలా రాజీపడో మొహమాటపడో టికెట్లు ఇచ్చేద్దామంటే అసలు కుదరదు. అందుకే చంద్రబాబు పనిమంతులకే టికెట్ అని నొక్కి మరీ వక్కాణించారు. అయినా కూడా నేతలలో మార్పు రలేదు. దాంతో చాలా మంది జాతకాలు ఇపుడు ఆ సర్వేలో ఉన్నాయి.

బాబు ఖండితంగా ఉంటారని తెలియడంతో తమ్ముళ్లకు ఒక్క లెక్కన చమటలు పడుతున్నాయట. ఎవరి మీద ఏ రకమైన వ్యతిరేకత ఉందో టికెట్లు రాకుండా చంద్రబాబు ఎక్కడ టిక్కు పెడతారో అని వారి గుండెలు పీచు పీచుమంటున్నాయట. ఇక పోతే చాలా చోట్ల సీనియర్లు పనిచేయడం లేదని, మాజీలకు పెద్దగా జనాలతో కనెక్షన్లు లేవని నివేదిక తేల్చిందట.

ఇక కొత్త ముఖాలను కూడా రేసులోకి దించాలని స్పష్టంగా సూచించిదట. అయితే యువ నేతలను పనిచేయనీయకుండా చాలా నియోజకవర్గాలలో సీనియర్లు అడ్డుకుంటున్నారని ఫలితంగా వారు కూడా పెద్దగా యాక్టివ్ గా లేరని అంటున్నారు. దాంతో ఈ సర్వే కాదు కానీ బాబుకు అతి పెద్ద పని పడింది అని అంటున్నారు. ఈ సర్వేను ఆధారం చేసుకుని బాబు గెలుపు గుర్రాలకే టికెట్ ఇస్తారని అంటున్నారు.

అందులోనూ అంగబలం, అర్ధబలం ఉనన్ వారికే పట్టం కడతారు అని చెబుతున్నారు. దాంతో చాలా మంది సీనియర్ల ఆశలు గల్లంతు అని అంటున్నారు. అదే విధంగా గతంలో అనేకసార్లు ఓడిపోయిన వారు ఈసారికి ఆశలు వదులుకోవాల్సిందే అని కూడా వారిలో వారికే అందుతున్న సందేశమట.

ఇవన్నీ పక్కన పెడితే ఈ సర్వే మరో భయంకరమైన వాస్తవాన్ని బయటపెట్టిందట. అదేంటి అంటే ఏపీలో మొత్తం ఉమ్మడి పదమూడు జిల్లాలలో పదుల సంఖ్యలోని నియోజకవర్గాలలో టీడీపీ నాయకులు పార్టీకి దూరంగా ఉంటున్నారని. అలాగే పెద్దగా దేనికీ రియాక్ట్ కావడంలేదని, దాంతో బాబు వీరందరినీ పార్టీ లైన్ లోకి తెచ్చి సైకిల్ ని జోరుగా తొక్కించాల్సిన పని అయితే ఉందిట. మరి బాబు చేతిలో సర్వే గుట్టు ఏంటో తెలిస్తే ఆయన యాక్షన్ కి దిగితే మాత్రం పసుపు పార్టీలో చాలా పరిణామాలే మారిపోతాయి అని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.