Begin typing your search above and press return to search.

వైరల్ :జగన్ ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటో

By:  Tupaki Desk   |   4 July 2020 4:00 AM GMT
వైరల్ :జగన్ ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటో
X
ఇద్దరు బద్ధ శత్రువులు.. పైగా రాజకీయ ప్రత్యర్థులు.. ఒకరంటే ఒకరికి అస్సలు పడదు.. అధికారంలో ఉన్నప్పుడు అణగదొక్కేవారు.. వీరి మధ్య పచ్చగడ్డి వేసినా వేయకపోయినా ఎప్పుడూ భగ్గుమంటూనే ఉంటుంది. అలాంటి ఇద్దరి ఫొటోలు.. ఒక అధికార కార్యక్రమంలో ఫ్లెక్సీలో దర్శనమివ్వడం నిజంగానే పెద్ద వింత.. అది ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేసిన 104,108 వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో వెలుగుచూసింది.

అసలు అధికార పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ అతిపెద్ద కార్యక్రమంలో.. పైగా ప్రభుత్వ సంబంధిత ప్రోగ్రాం బ్యానర్ లో ప్రతిపక్ష నాయకుల ఫొటోలు అస్సలు సాధారణంగా చూడలేము. కానీ తిరుపతి లో ఈ విచిత్రం చోటు చేసుకుంది. ఇది అందరి దృష్టి ని ఆకర్షించింది.

తిరుపతిలో మాజీ సీఎం చంద్రబాబు ఫొటో ‘108 అంబులెన్స్ ప్రారంభోత్సవం’ ర్యాలీలో బ్యానర్ ఫ్లెక్సీ లో దర్శనమివ్వడం అందరినీ షాక్ కు గురిచేసింది. ఇది ప్రభుత్వ ప్రాయోజిక కార్యక్రమం. స్పష్టంగా సీఎం జగన్ , మంత్రులు, ఎమ్మెల్యేల ఫొటోలు మాత్రమే ఉండాలి. అధికార పార్టీ నేతల ఫొటోలతోపాటు ప్రత్యర్థి ప్రతిపక్ష చంద్రబాబు ఫొటో పెట్టడం సంచలనమైంది. ఇది అధికార వైసీపీ కార్యకర్తలను ఆశ్చర్యపరిచింది.

దీనిపై వైసీపీ కార్యకర్తలు అధికారులను ప్రశ్నించగా, అది పొరపాటున జరిగిందని అధికారులు అంగీకరించారు. బహుశా ఇది ప్రభుత్వ పరంగా అతిపెద్ద లోపంగా చెప్పవచ్చు. ఇంత చేసి క్రెడిట్ ను ఏమీ చేయని ప్రతిపక్షాలకు ఇవ్వడమా అని వైసీపీ నేతలు ఊసురుమన్నారు.

దీన్ని బట్టి ఇంకా మన అధికారులు ఇప్పటికీ చంద్రబాబు సీఎంగా ఉన్నాడని.. ఆయన హ్యాంగోవర్‌లో ఉన్నట్లు కనిపిస్తోందని సెటైర్లు పడుతున్నాయి.