Begin typing your search above and press return to search.

టీడీపీకి అంత సీన్ ఉందా ?

By:  Tupaki Desk   |   31 May 2021 4:11 AM GMT
టీడీపీకి అంత సీన్ ఉందా ?
X
‘ఎన్నికలు ఎప్పుడు జరిగినా తెలుగుదేశంపార్టీ విజయాన్ని అడ్డుకోవటం ఎవరికీ సాధ్యంకాదు’..ఇది తాజాగా చంద్రబాబునాయుడు అన్న మాటలు. న్యూజిల్యాండ్ లోని పార్టీ సానుభూతిపరులతో జరిగిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతు చేసిన వ్యాఖ్యలు. జగన్మోహన్ రెడ్డి రెండేళ్ళ పాలనలో జరిగిన విధ్వంసాన్ని జనాలంతా అర్ధం చేసుకున్నారట. 2024లో కాదు ఎన్నికలు ఎప్పుడు జరిగినా విజయం మనదే అంటు హుషారైన మాటలు చెప్పారు.

చంద్రబాబు చెప్పిన మాటలు పార్టీ నేతలను, కార్యకర్తలను లేదా సానుభూతిపరులను సంతోషపెట్టడానికి అన్నట్లుగా స్పష్టమైపోతోంది. ఎందుకంటే చంద్రబాబు చెబుతున్నట్లు రాష్ట్రంలో జగన్ విధ్వంసం చేస్తున్నది నిజమే అయితే, జనాలు కూడా అలాగే అనుకుంటన్నట్లయితే మరి స్ధానిక సంస్ధల ఎన్నికల్లో వైసీపీకి అంతటి ఘన విజయం ఎలా సాధ్యమైంది.

ఈమధ్యనే జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు 99 శాతం ఫలితాలు ఏకపక్షంగా వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. పరిషత్ ఎన్నికల ఫలితాలు కోర్టు ఆదేశాల కారణంగా ఆగిపోయింది. ఈ ఎన్నికలను ఎలాగూ టీడీపీ బాయ్ కాట్ చేసింది కాబట్టి ఫలితాల గురించి ఆలోచించాల్సిన అవసరంలేదు. 2019 ఎన్నికల ఫలితాలతో టీడీపీ కుదేలైపోయింది. నేతల్లో భవిష్యత్తుపై నమ్మకంలేక కొందరు పార్టీనుండి వెళిపోయారు. చాలామంది స్తబ్దుగా ఉంటున్నారు. ఉన్నకొద్ది మంది జగన్ పై బురద చల్లటంతోనే సంతృప్తి పడుతున్నారు.

ప్రతిపక్షంలోకి వచ్చి రెండేళ్ళయినా ఇంతవరకు టీడీపీని జనాలు ఎందుకంత ఘోరంగా ఓడించారనే విషయంపై నిజాయితీగా విశ్లేషించుకున్నదే లేదు. ఎంతసేపు వైసీపీకి ఓట్లేసిన జనాలను తప్పుపట్టడం లేకపోతే జనాలను మోసంచేసి జగన్ ఓట్లేయించుకున్నారని ఆరోపించటంతోనే సరిపోతోంది. రాజకీయాలన్నాక గెలుపోటములు సహజం. గెలిచినపుడు ఏ కారణంతో గెలిచామని, ఓడిపోయినపుడు జనాలు ఎందుకు ఓట్లేయలేదని క్లియర్ గా విశ్లేషించుకోవాలి.

గెలుపోటములపై స్పష్టమైన అవగాహన రావాలంటే విశ్లేషణలో నిజాయితి అవసరం. అలాకాకుండా ఓట్లేసినపుడు తన సామర్ధ్యంచూసి ఓట్లేశారని, ఓడించినపుడు జనాలను శాపనార్ధాలు పెడితే ఉపయోగం లేదని చంద్రబాబు ఇప్పటికీ తెలుసుకోలేకపోతున్నారు. పదిమంది పార్టీ నేతలతో సమావేశం పెట్టుకునో లేకపోతే తనకు మద్దతిచ్చే మీడియాతో జగన్ కు వ్యతిరేకంగా వార్తలు, కథనాలు రాయించుకుంటే టీడీపీ అధికారంలోకి వచ్చేస్తుందా ? జనాలు కోరుకుంటేనే ప్రభుత్వాలు మారుతాయన్న చిన్న లాజిక్ ను చంద్రబాబు మిస్సయిపోతున్నారు.